fema
-
డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!
చెన్నై : డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులో బుధవారం ఈడీ అధికారులు తమిళనాడులో వ్యాపారవేత్త, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఫెమా చట్టం సెక్షన్ 37ఏ కింద రూ.89.19 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు రూ.908 కోట్లు జరిమానా విధించినట్లు ఎక్స్ వేదికగా ఈడీ వెల్లడించింది. ED, Gurugram has provisionally attached assets worth Rs. 294.19 Crore in the form of Lands, Buildings, Flats and FDR under the provisions of the PMLA, 2002 in the case of M/s Sunstar Overseas Ltd. & Others.— ED (@dir_ed) August 28, 2024జగత్రక్షకన్ ఎవరు?జగత్రక్షకన్ తమిళనాడు డీఎంకే అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్‌పై ఈడీ కేసు అయితే డిసెంబర్ 1,2021లో డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనల ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందినట్లు ఈడీ తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేపట్టామని, విచారణలో జగత్రక్షకన్‌పై ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు ఈడీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. -
‘స్పేస్’లో మరిన్ని ఎఫ్‌డీఐలకు సై
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్ వాహనాలు తదితర విభాగాల్లోకి వంద శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించేలా నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. అది దాటితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ల ప్రయోగం కోసం స్పేస్పోర్టుల ఏర్పాటు వంటి విభాగాల్లో 49 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. ఉపగ్రహాల విడిభాగాలు, సిస్టమ్స్/సబ్–సిస్టమ్స్ మొదలైన వాటి తయారీలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ప్రకారం ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటోంది. కొత్త సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది తొలి నాళ్లలోనే ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి కేంద్ర అంతరిక్ష విభాగం ఇన్–స్పేస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. మస్క్ పర్యటన నేపథ్యంలో.. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న సందర్భంలో తాజా పరిణామం ప్రాధా న్యం సంతరించుకుంది. వేల కొద్దీ ఉపగ్రహాలతో ప్రపంచంలో ఎక్కడైనా హై–స్పీడ్ ఇంటర్నెట్ను అందించేలా ఎలాన్ మస్క్ తలపెట్టిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్టు స్టార్‌లింక్‌కు ప్రస్తుతం అనుమతులను జారీ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న మస్క్ .. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు భారతీయ స్పేస్ కంపెనీలతో కూడా సమావేశం కానున్నారు. -
రాజస్తాన్ సీఎం గెహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్: రాజస్తాన్‌లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరిపింది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘన కేసులో సీఎం అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోరింది. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు నడుమ గురువారం ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్లలోని గోవింద్ సింగ్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సికార్ జిల్లాలోని లచ్చమన్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా, దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా, మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్లో రాజస్తాన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన సీనియర్ టీచర్ గ్రేడ్–2 పరీక్షలో జనరల్ నాలెడ్జి ప్రశ్నపత్రం లీకైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి గోవింద్‌సింగ్ తదితరులు కలిసి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, ఈ దందాకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వైభవ్‌పై ఆరోపణలేంటీ? సీఎం గెహ్లోత్ కుమారుడు వైభవ్ విదేశీ మాదక ద్రవ్య మారి్పడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున వైభవ్ శుక్రవారం విచారణకు హాజరుకాకపోవచ్చని ఈడీ అంటోంది. విచారణ వాయిదా కోరవచ్చని భావిస్తోంది. రాజస్తాన్‌కు చెందిన ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వార్ధా ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయ్‌పూర్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్‌లో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్ గెహ్లోత్‌తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దాడుల్లో రూ.1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది. -
ఫెమా ఉల్లంఘనకు షావోమీకి ఈడీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. రాయల్టీ ముసుగులో అనధికారికంగా రూ. 5,551.27 కోట్ల విలువ చేసే మొత్తాన్ని విదేశాలకు బదలాయించడానికి సంబంధించి ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. సదరు మొత్తాన్ని జప్తు చేస్తూ.. షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్‌తో పాటు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
పెళ్లైన కొద్ది రోజులకే హీరోయిన్‌కు ఈడీ షాక్!
సాక్షి, ముంబై: హీరోయిన్ యామీ గౌతంకు మరోసారి ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల చిత్రనిర్మాత ఆదిత్య ధార్‌ను వివాహమాడిన యామీకి మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. యామీకి ఈడీ నోటీసులివ్వడం ఇది రెండోసారి. విక్కీ డోనర్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యామీ గౌతం హృతిక్ రోషన్‌తో కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు బిగ్ బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఒక థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్ భారీ చిత్రాలపై ఈడీ దృష్టిపెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. కాగా తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కరోనా కాలంలో ఆదిత్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
అమెజాన్‌పై ఆరోపణలు.. రంగంలోకి ఈడీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. కొన్ని మల్టీ–బ్రాండ్స్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలపై అవసరమైన చర్యలు కోరుతూ ఈడీకి ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. విదేశీ మారక నిర్వహణ చట్టంలోని (ఫెమా) వివిధ సెక్షన్ల కింద దర్యాప్తు జరుగుతోంది. ఫ్యూచర్ రిటైల్‌ను నియంత్రించడానికి అమెరికాకు చెందిన అమెజాన్.. ఫ్యూచర్ రిటైల్ యొక్క అన్‌లిస్టెడ్ యూనిట్‌తో చేసుకున్న ఒప్పందాల ద్వారా చేసిన ప్రయత్నం ఫెమా మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఉల్లంఘించాయంటూ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌కు (డీపీఐఐటీ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు చేశాయి. -
‘ఇల్లు’ గెలిచింది..!
న్యూఢిల్లీ : గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు బుక్ చేసుకున్న 42,000 మంది పైచిలుకు కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. గ్రూప్ సీఎండీ అనిల్ శర్మతో పాటు ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులపై ఉన్న మనీల్యాండరింగ్ అభియోగాలపై విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. కోర్టు రిసీవర్‌గా సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమణిని నియమిస్తున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు.యు. లలిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లీజుల రద్దు తర్వాత నుంచి ప్రాపర్టీలపై పూర్తి అధికారాలు కోర్టు రిసీవర్‌కు దఖలుపడతాయని తెలిపింది. బకాయిల ను రాబట్టే క్రమంలో గ్రూప్ ప్రాపర్టీల విక్రయానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతర అధికారులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇతర బిల్డర్లకు హెచ్చరిక.. తాజా ఆదేశాలు కేవలం ఆమ్రపాలి గ్రూప్‌నకు మాత్రమే సుప్రీంకోర్టు పరిమితం చేయలేదు. మిగతా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ముందుగా చెప్పిన గడువులోగా కచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహాల కొనుగోలుదారులకు అందించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కష్టార్జితాన్ని ధారపోసే కొనుగోలుదారులు .. నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొంది. ‘తప్పుడు బిల్డర్ల కారణంగా లక్షల మంది గృహాల కొనుగోలుదారులు మోసపోతున్నారు. కొనుగోలుదారుల డబ్బుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి కొనుగోలుదారులకు తమ ఇంటిని దక్కించుకునేందుకు పూర్తి హక్కులు ఉంటాయి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయానికి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేసి అందించని బిల్డర్లపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఆమ్రపాలి గ్రూప్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించాలని ఎన్బీసీసీని ఆదేశించింది. వారి దగ్గర్నుంచి అదనంగా నిధులు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రమోటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గృహాల కొనుగోలుదారులు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సూచించింది. దశలవారీగా ఎన్బీసీసీ పనులు పూర్తి చేసే కొద్దీ ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొంది. అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు.. అటు అధికారుల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు, సంపన్న బిల్డర్లు కుమ్మక్కై సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారుల కష్టార్జితాన్ని ఎలా దోచుకుంటున్నారో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. అనేక ప్రాజెక్టులు పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. షాక్ కలిగిస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారందరిపైనా కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉండాలి‘ అని వ్యాఖ్యానించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు గృహ కొనుగోలుదారుల ఫ్లాట్స్‌ను విక్రయించడం కుదరదని తేల్చి చెప్పింది. ‘ఇప్పటికే జప్తు చేసిన ఆమ్రపాలి ప్రమోటర్లు, ఇతర అధికారుల ఆస్తులను విక్రయించి బకాయిలను రాబట్టుకోవచ్చు‘ అని సుప్రీం కోర్టు తెలిపింది. బ్యాంకులు, అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగానే ఆమ్రపాలి ప్రమోటర్లు నిధులను మళ్లించగలిగారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ నేపథ్యంలో బాకీలు రాబట్టుకునేందుకు కొనుగోలుదారులపై కేసులు పెట్టడం గానీ లేదా వారి ఫ్లాట్లను విక్రయించడం గానీ చేయరాదు. గృహాల కొనుగోలుదారులు ఇప్పటికే ఒకసారి మోసపోయారు. బాకీల రికవరీ పేరిట ఆ ప్రాజెక్టులను అమ్మేసి మళ్లీ మోసగించడం సరికాదు. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు ఆయా సందర్భాలను బట్టి కొనుగోలుదారులకు నెల రోజుల్లోగా రిజిస్టర్డ్ డీడ్స్ ఇవ్వాలి‘ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈడీ కేసు నమోదు.. గృహ కొనుగోలుదారులు కట్టిన సొమ్మును మళ్లించిన ఆమ్రపాలి గ్రూప్.. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలను పక్కన పెట్టి నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు కూడా ఆమ్రపాలి గ్రూప్‌తో కుమ్మక్కై పూర్తి సహకారం అందించారని పేర్కొంది. బాకీలను రాబట్టుకునే క్రమంలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాపర్టీలను విక్రయించేందుకు నోయిడా, గ్రేటర్ నోయిడాకు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఆమ్రపాలి గ్రూప్, దాని ప్రమోటర్ల మీద మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసును నమోదు చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్ట నిబంధనల ఉల్లంఘన కింద ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లను విచారణ చేయడంతో పాటు వారి అసెట్స్‌ను ఈడీ జప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ధోనీ కూడా బాధితుడే.. ఇళ్ల కొనుగోలుదారులే కాదు క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కూడా ఆమ్రపాలి గ్రూప్ బాధితుడే. 2011లో ప్రపంచ కప్ గెల్చిన భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లకు నోయిడాలోని ప్రాజెక్టులో రూ. 9 కోట్ల విలువ చేసే విల్లాలు ఇస్తామంటూ ఆమ్రపాలి ప్రకటించింది. వాటిని కట్టనూ లేదు. ఇవ్వనూ లేదు. అంతే కాదు.. ఆమ్రపాలికి సుమారు 6–7 ఏళ్ల పాటు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. కానీ దానికి కూడా ఆమ్రపాలి గ్రూప్ డబ్బులు చెల్లించలేదు. చివరికి, ఆమ్రపాలి బాధిత గృహాల కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ధోనీ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. రూ. 150 కోట్ల బకాయిలు రాట్టుకోవడం కోసం ఆమ్రపాలిపై కేసు వేశాడు. -
ఐపీఎల్‌పై బాంబే హైకోర్టు ఫైర్..!
సాక్షి, ముంబై: ఐపీఎల్ పుణ్యమాని ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒనగూరిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై నమోదైన విదేశీ మారక నిల్వల (ఫెమా) కేసు విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, భారతి దంగ్రే వ్యాఖ్యానిస్తూ ‘ఐపీఎల్‌ను విజయవంతం చేశారు సరే. గడిచిన పదేళ్లలో ఆర్థిక అవకతవకలు, కేసుల కంటే ఈ లీగ్ ఆటకెంత మేలు చేసిందో నిర్వాహకులు సమీక్షించుకోవాలి. ఇప్పటికే ఫిక్సింగ్–బెట్టింగ్‌లతో ఐపీఎల్ బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్, ఐపీఎల్ నిర్వాహకులు ఈ లీగ్ క్రికెట్ క్రీడ కోసమా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని అన్నారు. లలిత్ మోడిపై నమోదైన కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తమ మార్గదర్శనంలో చేయాలని ఈడీని ఆదేశించింది. మార్చి 2న మొదలయ్యే ఈ ప్రక్రియను 31లోగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. -
ఐదు విదేశీ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
ముంబై: విదేశీ మారక నిర్వహణ (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను ఐదు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యోమిత్సుబిషి, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇందులో ఉన్నాయి. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించి ఆయా బ్యాం కులు ఇచ్చిన వివరణను పరిశీ లించినమీదట డాయిష్ బ్యాంక్‌పై రూ. 20,000,మిగతా బ్యాంకులపై తలో రూ. 10,000 జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. -
దాన్నుంచి ఈ భూమిని రక్షించుకునేదెలా..!
వాషింగ్టన్: జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఓ పెద్ద ఆస్టరాయిడ్(ఉల్క) వచ్చి ఈ భూమిని ఢీకొట్టబోతోంది. రద్దీగా ఉన్న ఓ పెద్ద పట్టణంపై అది పడబోతోంది. ఆ విషయం మనకు తెలిసింది. దీనికోసం ఏం చేయాలి. ఈ ఉపద్రవం నుంచి భూమిని ఎలా కాపాడుకోవాలి. సరిగ్గా ఇలాంటి ఊహను ఆధారంగా చేసుకొనే ఓ భారీ స్పేస్ రాక్ భూమిని తాకుతుందన్న పరికల్పనతో.. నాసా, ఫెమా(ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) సిబ్బంది అక్టోబర్ చివరన ఓ సదస్సును నిర్వహించారు. నాసా శాస్త్రవేత్తలేమో ఆ ఉల్క భూమిని చేరేలోపే దానిని దారి మళ్లించడం ఎలా అనే దానిపై దృష్టి సారిస్తే.. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ప్రజలను వేగంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే అంశాలపై ఫెమా ఈ సదస్సులో దృష్టి సారించింది. అయితే వాస్తవానికి రానున్న 100 ఏళ్లలో ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టడానికి ఉన్న అవకాశాలు అత్యంత స్వల్పమని నాసా ఇదివరకే ప్రకటించింది. ఒకవేళ ఏదైనా చిన్న పరిమానంలోని ఆస్టరాయిడ్ డీకొట్టినా దానితో భూమిపై ప్రాణులకు ఏర్పడే నష్టం చాలా అత్యంత స్వల్పంగా ఉంటుందని నాసా ఇంతవరకూ చెబుతూ వస్తోంది. అయినప్పటికీ చాలా మంది పరిశోధకులు విపత్కర పరిస్థితి ఎదురైప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో కాకుండా ముందస్తు వ్యూహంతో ఉండటం మేలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల కొంతమంది ప్లానెటరీ సైంటిస్ట్‌లు, భౌతిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నాసా, ఈఎస్ఏ(యురోపియన్ స్పేస్ ఏజెన్సీ)ల ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టబోతున్న ఏఐడీఏ(ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ అండ్ డిఫ్లెక్షన్ అసెస్మెంట్) మిషన్‌కు మద్దతు తెలిపారు. నాసా, ఈఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న ఏఐడీఏ మిషన్ ద్వారా ముందుగానే ఓ ఆస్టరాయిడ్‌ను గుర్తించి దాన్ని కైనటిక్ ఇంపాక్టర్ తో దారి మళ్లించే ప్రయత్నం ఉపయుక్తమని వారు అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తుండగా మొదటి దశ కోసం నిధుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఎన్నారైల స్థిరాస్తి రూటు
పెట్టుబడులనగానే గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్, స్థిరాస్తి, బంగారం వంటివే. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయనేది కాదనలేని వాస్తవం. అందుకే స్థానికులు గానీ ప్రవాస భారతీయులు గానీ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తుంటారు. రూపాయి విలువ బలహీనపడటం, స్థిరాస్తి ధరలూ అందుబాటులో ఉండటం వంటి కారణాలతో దేశీ స్థిరాస్తి రంగం ఎన్నారై పెట్టుబడులను ఆకర్షిస్తోంది. వీటికి తోడు ఆర్బీఐ నిబంధనలు సరళంగా ఉండటం, స్థిరాస్తి కొనుగోళ్లకు ముందస్తు అనుమతులు అవసరం లేకపోవటం వంటివి ఎన్నారై పెట్టుబడులను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు దేశంలోని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా.. స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్నా ప్రవాస భారతీయులకు (ఎన్నారై) ఉన్న నిబంధనలేంటి? అవకాశాలేంటి? రాయితీలు, పన్ను ప్రయోజనాల వంటివేమైనా ఉన్నాయా? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ కథనం... - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో * దేశీ రియల్టీలో పెరుగుతున్న పెట్టుబడులు * ప్రవాసులకూ స్థానికుల మాదిరే పన్ను ప్రయోజనాలు * డిగ్రీ ఉంటేనే గృహ రుణం; తొలి ప్రాపర్టీకి సంపద పన్ను నో * వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్‌లను కొనే వీలు లేదు ఎన్నారైల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి (పీఐఓ) వ్యక్తులు గానీ దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ కొనుగోళ్లకు పరిమితి అంటూ కూడా ఏమీ లేదు. కాకపోతే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్ వంటి ప్రాపర్టీలను గానీ కొనుగోలు చేయటం మాత్రం కుదరదు. బహుమతి ద్వారా లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులుంటాయి. కొనేముందే పరిశీలించాలి.. * యాజమాన్య హక్కులను, పత్రాలు, టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులెక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి. * స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధృవీకరణ పత్రం తీసుకోవాలి. నీరు, విద్యుత్ వంటి బిల్లులు పూర్తిగా చెల్లించారో లేదో పరిశీలించాలి. * కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్ టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీలను తీసుకున్నారో లేదో గమనించాలి. ముఖ్య అర్హత ఇది.. ఎన్నారైలకు గృహ రుణం మంజూరు చేయటంలో విద్యార్హతలు, నడవడిక కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే దేశంలో కేవలం పట్టభద్రులైన ఎన్నారైలకే గృహ రుణాలు ఇస్తారనేది మరిచిపోకూడదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం స్థిరాస్తి విలువలో 80 శాతం వరకూ గృహ రుణంగా పొందవచ్చు. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారుడే భరించాలి. అయితే ప్రాపర్టీ లావాదేవీలు పూర్తిగా రూపాయిల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచైనా సరే కానీ ఎన్నారై ఖాతా ద్వారానే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ లేదా ఎఫ్సీఎన్ఆర్ ఖాతాకు చెందిన లేదా పోస్ట్ డేట్ చెక్స్, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ (ఈసీఎస్) ద్వారా కూడా చెల్లించవచ్చు. ఒకవేళ విదేశాల్లో ఉంటూ.. అక్కడ సంపాదిస్తుంటే గనక స్థానిక బ్యాంకుల నుంచి నిధులను తీసుకొని ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలు ఎన్నారైలకుంటుందని రైట్ హొరైజన్స్ ఫౌండర్ అండ్ సీఈఓ అనిల్ రెగో తెలియజేశారు. ఎందుకంటే మన దేశంతో పోల్చుకుంటే కొన్ని దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఒకవేళ ప్రాపర్టీని వినియోగించలేని పక్షంలో అద్దెకిచ్చేసి అద్దెను బ్యాంకు రుణ చెల్లింపులో వినియోగిస్తే మాత్రం... స్థానిక బంధువులు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వారి స్థానిక బ్యాంక్ ఖాతాకు చెందిన చెక్కులను కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ నిర్మాణంలో ఉంటే.. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ఇవ్వాల్సిందిగా డెవలపర్‌ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవటం మంచిది. సులభతరం కూడా. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్‌కు గానీ మార్ట్‌గేజ్‌కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని విక్రయించాలని అనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాధీనం, అగ్రిమెంట్ వంటి విషయాల్లో పీఓపీ ఎంతగానో ఉపయుక్తమవుతుందనేది గుర్తుంచుకోవాలి. విక్రయించాలనుకుంటే.. ఫెమా నిబంధనల ప్రకారం ఎన్నారై తన సొంత ఆస్తిని గానీ వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని గానీ దేైన్నైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్నారైకు వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి గానీ ప్లాంటేషన్ గానీ ఫాంహౌస్ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకున్నపుడు స్థానిక నివాసికి మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇతర ఎన్నారైకి గానీ భారత సంతతికి గానీ గిఫ్ట్‌గా అందించొచ్చు కూడా. విదేశీ ఖాతా నుంచి నిధులొస్తుంటే.. దాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎఫ్‌సీఆర్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అది కూడా స్థానిక బ్యాంకింగ్ చానళ్ల ద్వారా ఆస్తి కొనుగోలుకు చెల్లించిన విదేశీ మారక మొత్తం మాత్రం మించకూడదు. బయనా వావసు, రద్దు, రీఫండ్ వంటి వాటిలో పరిమితులుండవని టాక్స్పానర్.కామ్ కో-ఫౌండర్ అండ్ సీఎఫ్ఓ సుధీర్ కౌశిక్ చెప్పారు. పన్ను ప్రయోజనాలు.. ఎవరికైనా సరే స్థిరాస్తి అనేది పన్ను ఆదా సాధనమనే చెప్పాలి. నివాస భారతీయుడికి ఎలాంటి పన్ను ప్రయోజనాలుంటాయో ఎన్నారైకు కూడా దాదాపు అవే ఉంటాయి. ప్రాపర్టీ కొనుగోలులో ఎన్నారై 80సీ కింద లక్ష రూపాయల మినహాయింపును పొందవచ్చు. ఒకవేళ రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేస్తే రుణంపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపునూ పొందవచ్చు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, మున్సిపల్ పన్నులు వంటి వాటిల్లో పరిమితులేం ఉండవు. అలాగే 30 శాతం అద్దె చెల్లింపులు, నిర్వహణలో తగ్గింపుల వంటివి ఉంటాయి. రూ.50 లక్షల కంటే విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేస్తే.. 1 శాతం రేటుతో టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. సంపద పన్ను తప్పాలంటే.. ఒకవేళ ప్రాపర్టీ ఖాళీగా ఉన్నా లేదా సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా సంపద పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రాపర్టీని అద్దెకిస్తే మాత్రం సంపద పన్ను చెల్లించాల్సిందే. అయితే ఈ నిబంధన తొలి ప్రాపర్టీకి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మరిన్ని ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకుంటే వాటిక్కూడా సంపద పన్ను నుంచి మినహాయింపును పొందవచ్చనుకోవటం కుదరదు. అందుకని రెండో ప్రాపర్టీని తల్లిదండ్రుల పేరు మీద గానీ, పిల్లల మీద గానీ కొనుగోలు చేయడం ఉత్తమమని సుధీర్ కౌశిక్ వివరించారు. సంపద పన్ను రూపేణా రూ.30 లక్షల పైచిలుకు విలువ గల ప్రాపర్టీ మీద 1 శాతం పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న ప్రాపర్టీలను స్వీయ ఆక్రమిత ప్రాపర్టీలు గానే పరిగణిస్తారు. కాబట్టి వాటి మీద ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు ఖాళీగా ఉంటే మాత్రం స్వీయ ఆక్రమిత ప్రాపర్టీ ఏదో.. మిగిలినవి ఎందుకు ఖాళీగా ఉన్నాయో చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ప్రాపర్టీలను పన్ను పరిధిలోకి చేరుస్తారు. రిటర్న్ ఇక్కడే.. ఒకవేళ ప్రాపర్టీపై అద్దె వస్తుంటే గనక ఆ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి పన్ను రిటర్న్‌ను కూడా ఇక్కడే దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆదాయానికి సంబంధించిన పన్ను లెక్కలను చూపించాల్సి ఉంటుంది అప్పుడే రెండు దేశాల్లోనూ పన్ను కట్టాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు. ప్రాపర్టీని విక్రయించాలనుకుంటే మాత్రం.. ఆదాయపు పన్ను చట్టం కింద మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలల కంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉంటే దీర్ఘకాల మూలధన లాభాల ప్రయోజనాలను పొందవచ్చు. 3 ఏళ్లకు పైగా ఆస్తిని కలిగి ఉంటే దీర్ఘకాల మూలధన లాభాల కింద పరిగణిస్తారు. ఇందుకు గాను 20 శాతం పన్ను ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల కంటే తక్కువుంటే స్వల్వకాల లాభాలుగా పరిగణిస్తూ.. సాధారణ పన్నులను విధిస్తారు. -
ఫ్లిప్ కార్ట్ కు ఈడీ 1000 కోట్ల జరిమానా?
న్యూఢిల్లీ: ఆన్ లైన్ బిజినెస్ వెబ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించడలోనూ ఫ్లిఫ్ కార్ట్ విఫలమైందనే ఆరోపణలపై ప్రశ్నించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్ కార్ట్ పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే తాము నిబంధనల్ని పూర్తిగా పాటించామని, ఈడీ అధికారుల విచారణకు సహకరిస్తామని ఫ్లిప్ కార్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.