సాక్షి, ముంబై: హీరోయిన్ యామీ గౌతంకు మరోసారి ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల చిత్రనిర్మాత ఆదిత్య ధార్‌ను వివాహమాడిన యామీకి మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. యామీకి ఈడీ నోటీసులివ్వడం ఇది రెండోసారి.
విక్కీ డోనర్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యామీ గౌతం హృతిక్ రోషన్‌తో కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు బిగ్ బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఒక థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్ భారీ చిత్రాలపై ఈడీ దృష్టిపెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే.
కాగా తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కరోనా కాలంలో ఆదిత్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment