Mahadev App Scam Case మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కాం (ఎంఓబి) కేసు బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో దాదాపు 17మంది బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బీ-టౌన్ నటుడు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్, నుష్రత్ భరుచ్చా, తదితరులకు సమన్లు పంపేందుకు దర్యాప్తు సంస్థ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్ మహదేవ్ బుక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. రూ.417 కోట్ల డబ్బు, డాక్యుమెంట్‌లను ఈడీ సీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎఇలో రస్‌అల్‌ఖైమాలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు నటులు , గాయకులు హాజరయ్యారు.టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ ప్రముఖులకు ఈడీ షాక్ ఇవ్వనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈడీ సేకరించిన సాక్ష్యం ప్రకారం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు ముట్టాయి. హోటల్ బుకింగ్‌ల కోసం చెల్లింపు రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహ బృందంలోని కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుండి యుఎఇకి తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నారు, వివాహంలో పాల్గొనడానికి ముంబై నుండి వెడ్డింగ్ ప్లానర్‌లు, డ్యాన్సర్‌లు, డెకరేటర్‌లు మొదలైన వారిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది.
మహాదేవ్ బుక్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల ఈడీ పోలీసు విభాగాలచే విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సౌరభ్ చంద్రకర్ , రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడిలను క్రియేట్‌చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఈడీ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లోని సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్‌లో గత ఏడాది సెప్టెంబర్ 18 నాటి పార్టీకి హాజరయ్యేందుకు బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రమోటర్లు రూ.40 కోట్లు చెల్లించారని ఆరోపణలతో కొంతమంది తారలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది. బాలీవుడ్ పెద్దలు రెండు ఈవెంట్‌లకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుండి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్‌కు చెందిన ఒక అసోసియేట్‌తో ఎంఓబి సమన్వయంతో బెట్టింగ్ యాప్‌ను లాంచ్ చేసిందన్న ఆరోపణలను కూడా ఈ విచారణ ధృవీకరిస్తున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment