‘ఇల్లు’ గెలిచింది..! | SC Revokes Licence of Amrapali Group in Huge Relief for Stranded Home Buyers | Sakshi
Sakshi News home page

‘ఇల్లు’ గెలిచింది..!

Published Wed, Jul 24 2019 1:55 AM | Last Updated on Wed, Jul 24 2019 1:56 AM

SC Revokes Licence of Amrapali Group in Huge Relief for Stranded Home Buyers - Sakshi

న్యూఢిల్లీ : గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్‌ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు బుక్‌ చేసుకున్న 42,000 మంది పైచిలుకు కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. గ్రూప్‌ సీఎండీ అనిల్‌ శర్మతో పాటు ఇతర డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులపై ఉన్న మనీల్యాండరింగ్‌ అభియోగాలపై విచారణ జరపాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. కోర్టు రిసీవర్‌గా సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్‌ వెంకటరమణిని నియమిస్తున్నట్లు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యు.యు. లలిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లీజుల రద్దు తర్వాత నుంచి ప్రాపర్టీలపై పూర్తి అధికారాలు కోర్టు రిసీవర్‌కు దఖలుపడతాయని తెలిపింది. బకాయిల ను రాబట్టే క్రమంలో గ్రూప్‌ ప్రాపర్టీల విక్రయానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆమ్రపాలి గ్రూప్‌ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతర అధికారులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  

ఇతర బిల్డర్లకు హెచ్చరిక.. 
తాజా ఆదేశాలు కేవలం ఆమ్రపాలి గ్రూప్‌నకు మాత్రమే సుప్రీంకోర్టు పరిమితం చేయలేదు. మిగతా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ కూడా ముందుగా చెప్పిన గడువులోగా కచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహాల కొనుగోలుదారులకు అందించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కష్టార్జితాన్ని ధారపోసే కొనుగోలుదారులు .. నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొంది. ‘తప్పుడు బిల్డర్ల కారణంగా లక్షల మంది గృహాల కొనుగోలుదారులు మోసపోతున్నారు. కొనుగోలుదారుల డబ్బుతోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి కొనుగోలుదారులకు తమ ఇంటిని దక్కించుకునేందుకు పూర్తి హక్కులు ఉంటాయి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయానికి గ్రూప్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి అందించని బిల్డర్లపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఆమ్రపాలి గ్రూప్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించాలని ఎన్‌బీసీసీని ఆదేశించింది. వారి దగ్గర్నుంచి అదనంగా నిధులు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రమోటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గృహాల కొనుగోలుదారులు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సూచించింది. దశలవారీగా ఎన్‌బీసీసీ పనులు పూర్తి చేసే కొద్దీ ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొంది. 

అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు.. 
అటు అధికారుల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు, సంపన్న బిల్డర్లు కుమ్మక్కై సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారుల కష్టార్జితాన్ని ఎలా దోచుకుంటున్నారో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. అనేక ప్రాజెక్టులు పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. షాక్‌ కలిగిస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారందరిపైనా కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉండాలి‘ అని వ్యాఖ్యానించింది. నోయిడా, గ్రేటర్‌ నోయిడా అధికారులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు గృహ కొనుగోలుదారుల ఫ్లాట్స్‌ను విక్రయించడం కుదరదని తేల్చి చెప్పింది. ‘ఇప్పటికే జప్తు చేసిన ఆమ్రపాలి ప్రమోటర్లు, ఇతర అధికారుల ఆస్తులను విక్రయించి బకాయిలను రాబట్టుకోవచ్చు‘ అని సుప్రీం కోర్టు తెలిపింది.  బ్యాంకులు, అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగానే ఆమ్రపాలి ప్రమోటర్లు నిధులను మళ్లించగలిగారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ నేపథ్యంలో బాకీలు రాబట్టుకునేందుకు కొనుగోలుదారులపై కేసులు పెట్టడం గానీ లేదా వారి ఫ్లాట్లను విక్రయించడం గానీ చేయరాదు. గృహాల కొనుగోలుదారులు ఇప్పటికే ఒకసారి మోసపోయారు. బాకీల రికవరీ పేరిట ఆ ప్రాజెక్టులను అమ్మేసి మళ్లీ మోసగించడం సరికాదు. నోయిడా, గ్రేటర్‌ నోయిడా అధికారులు ఆయా సందర్భాలను బట్టి కొనుగోలుదారులకు నెల రోజుల్లోగా రిజిస్టర్డ్‌ డీడ్స్‌ ఇవ్వాలి‘ అని సుప్రీంకోర్టు పేర్కొంది.   

ఈడీ కేసు నమోదు.. 
గృహ కొనుగోలుదారులు కట్టిన సొమ్మును మళ్లించిన ఆమ్రపాలి గ్రూప్‌.. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలను పక్కన పెట్టి నోయిడా, గ్రేటర్‌ నోయిడా అధికారులు కూడా ఆమ్రపాలి గ్రూప్‌తో కుమ్మక్కై పూర్తి సహకారం అందించారని పేర్కొంది. బాకీలను రాబట్టుకునే క్రమంలో ఆమ్రపాలి గ్రూప్‌ ప్రాపర్టీలను విక్రయించేందుకు నోయిడా, గ్రేటర్‌ నోయిడాకు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఆమ్రపాలి గ్రూప్, దాని ప్రమోటర్ల మీద మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) క్రిమినల్‌ కేసును నమోదు చేసింది. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్ట నిబంధనల ఉల్లంఘన కింద ఆమ్రపాలి గ్రూప్‌ ప్రమోటర్లను విచారణ చేయడంతో పాటు వారి అసెట్స్‌ను ఈడీ జప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ధోనీ కూడా బాధితుడే..
ఇళ్ల కొనుగోలుదారులే కాదు క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కూడా ఆమ్రపాలి గ్రూప్‌ బాధితుడే.  2011లో ప్రపంచ కప్‌ గెల్చిన భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లకు నోయిడాలోని ప్రాజెక్టులో రూ. 9 కోట్ల విలువ చేసే విల్లాలు ఇస్తామంటూ ఆమ్రపాలి ప్రకటించింది. వాటిని కట్టనూ లేదు. ఇవ్వనూ లేదు. అంతే కాదు.. ఆమ్రపాలికి సుమారు 6–7 ఏళ్ల పాటు ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. కానీ దానికి కూడా ఆమ్రపాలి గ్రూప్‌ డబ్బులు చెల్లించలేదు. చివరికి, ఆమ్రపాలి బాధిత గృహాల కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ధోనీ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. రూ. 150 కోట్ల బకాయిలు రాట్టుకోవడం కోసం ఆమ్రపాలిపై కేసు వేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement