NBCC
-
MS Dhoni: ధోనీకి షాక్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్టుకూ అంబాసిడర్‌గా వ్యవహరించి.. వివాదంలో చిక్కుకున్నారాయన. తాజాగా ఈ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. ధోనీతో పాటు ప్లాట్ల బకాయిల్ని చెల్లించని మరికొంతమందికి సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం 15 రోజుల డెడ్‌లైన్ విధించారు. లేనిపక్షంలో ఒప్పందం రద్దు కావడంతో పాటు ప్లాట్లను వేలం వేస్తామని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్‌లోని కస్టమర్ డేటాలో ఇంతదాకా బకాయిలు చెల్లించని ఓనర్లలో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎన్బీసీసీ(National Buildings Construction Corporation Ltd).. ఈ మేరకు ధోనీతో పాటు మొత్తం పద్దెనిమిది వందల మందికి నోటీసులు జారీ చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించి.. ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి బకాయిలు చెల్లింపునకు రెండు వారాల గడువు ఇస్తున్నామని, లేని పక్షంలో వాళ్లను డిఫాల్టర్లుగా గుర్తిస్తామని నోటీసుల్లో తెలిపింది. ఆపై ఆ ప్లాట్లను అమ్ముడుపోని జాబితాలో చేరుస్తామని, తర్వాతి దశలో ఎలాట్‌మెంట్‌ను రద్దుచేసి... వేలం వేస్తామని హెచ్చరించింది. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ప్రాజెక్ట్ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేసే సంస్థ ఎన్బీసీసీకి అప్పగించింది. ఇప్పటికే చాలామంది పేమెంట్స్ పూర్తి చేయగా.. బకాయిలు చెల్లించని వాళ్లలో ధోనీ కూడా ఉన్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లాట్లు ధోనీ పేరిట ఉన్నాయి. నొయిడాలోని సాప్పైర్ ఫేజ్-1లోని పెంట్ హౌజ్ కోసం కోటిన్నరకుగానూ ఇదివరకే ఇరవై లక్షలు ధోనీ చెల్లించినట్లు ఎన్బీసీసీ గుర్తించింది. అంతేకాదు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తక్కువ ఎమౌంట్‌కే ప్లాట్లను ధోనీకి అప్పగించినట్లు, ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించినట్లు రోహిత్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ (RSMPL) వెల్లడించింది. ఇక ఈ హౌజింగ్ సొసైటీలో హోం బయర్స్ దాదాపు పదివేలమంది కస్టమర్ డాటాలో పేర్లను నమోదు చేసుకోకపోవడం విశేషం. చదవండి: ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
ఎన్బీసీసీ- ఎస్‌హెచ్ కేల్కర్- పిపావవ్ అప్
మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. అయితే విభిన్న వార్తల నేపథ్యంలో ఎస్‌హెచ్ కేల్కర్, గుజరాత్ పిపావవ్ పోర్ట్, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. గుజరాత్ పిపావవ్ పోర్ట్ విదేశీ సంస్థ జేపీ మోర్గాన్ ఫండ్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలతో పోర్ట్ హ్యాండ్లింగ్, మెరైన్ సర్వీసుల కంపెనీ గుజరాత్ పిపావవ్ పోర్ట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 8 శాతం జంప్ చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 90 వరకూ ఎగసింది. బ్లాక్ డీల్ ద్వారా గుజరాత్ పిపావవ్ పోర్ట్‌లో 0.63 శాతం వాటాను జేపీ మోర్గాన్ ఫండ్స్ కొనుగోలు చేసింది. 30.34 లక్షల షేర్ల కొనుగోలుకి రూ. 23.6 కోట్లను వెచ్చించింది. ఎస్‌హెచ్ కేల్కర్ వివిధ పరిమళ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఎస్‌హెచ్ కేల్కర్ తాజాగా జూన్ చివరికల్లా రుణ భారాన్ని రూ. 255 కోట్లకు పరిమితం చేసుకున్నట్లు తెలియజేసింది. అంతకుముందు 2020 మార్చికల్లా రుణ భారం రూ. 299 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌హెచ్ కేల్కర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 7శాతం జంప్‌చేసి రూ. 71 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది. ఎన్బీసీసీ ఇండియా గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎన్బీసీసీ ఇండియా షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎన్బీసీసీ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 27 వద్ద ట్రేడవుతోంది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో ఎన్బీసీసీ ఇండియా నికర లాభం 68 శాతం క్షీణించింది. రూ. 48.5 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 33 శాతం తక్కువగా రూ. 1570 కోట్లకు చేరాయి. -
మిషన్ బిల్డ్ ఏపీపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: మిషన్ బిల్డ్ ఏపీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) లిమిటెడ్ సీఎండీ పి.కె.గుప్తా, ఇతర ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు గరిష్ట వినియోగం, అందులో చేపట్టాల్సిన పలు ప్రతిపాదనలపై ఎన్బీసీసీ ప్రతిపాదనలు చేసింది. ఈ సమావేశం అనంతరం ఎన్బీసీసీ సీఎండీ పి.కె గుప్తాను సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. -
‘ఇల్లు’ గెలిచింది..!
న్యూఢిల్లీ : గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో గృహాలు బుక్ చేసుకున్న 42,000 మంది పైచిలుకు కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. గ్రూప్ సీఎండీ అనిల్ శర్మతో పాటు ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులపై ఉన్న మనీల్యాండరింగ్ అభియోగాలపై విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. కోర్టు రిసీవర్‌గా సీనియర్ అడ్వొకేట్ ఆర్ వెంకటరమణిని నియమిస్తున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యు.యు. లలిత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లీజుల రద్దు తర్వాత నుంచి ప్రాపర్టీలపై పూర్తి అధికారాలు కోర్టు రిసీవర్‌కు దఖలుపడతాయని తెలిపింది. బకాయిల ను రాబట్టే క్రమంలో గ్రూప్ ప్రాపర్టీల విక్రయానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతర అధికారులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇతర బిల్డర్లకు హెచ్చరిక.. తాజా ఆదేశాలు కేవలం ఆమ్రపాలి గ్రూప్‌నకు మాత్రమే సుప్రీంకోర్టు పరిమితం చేయలేదు. మిగతా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ముందుగా చెప్పిన గడువులోగా కచ్చితంగా ప్రాజెక్టులు పూర్తి చేసి, గృహాల కొనుగోలుదారులకు అందించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కష్టార్జితాన్ని ధారపోసే కొనుగోలుదారులు .. నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొంది. ‘తప్పుడు బిల్డర్ల కారణంగా లక్షల మంది గృహాల కొనుగోలుదారులు మోసపోతున్నారు. కొనుగోలుదారుల డబ్బుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. కాబట్టి కొనుగోలుదారులకు తమ ఇంటిని దక్కించుకునేందుకు పూర్తి హక్కులు ఉంటాయి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయానికి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేసి అందించని బిల్డర్లపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఆమ్రపాలి గ్రూప్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించాలని ఎన్బీసీసీని ఆదేశించింది. వారి దగ్గర్నుంచి అదనంగా నిధులు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రమోటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గృహాల కొనుగోలుదారులు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సూచించింది. దశలవారీగా ఎన్బీసీసీ పనులు పూర్తి చేసే కొద్దీ ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొంది. అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు.. అటు అధికారుల తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు, సంపన్న బిల్డర్లు కుమ్మక్కై సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారుల కష్టార్జితాన్ని ఎలా దోచుకుంటున్నారో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. అనేక ప్రాజెక్టులు పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. షాక్ కలిగిస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారందరిపైనా కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉండాలి‘ అని వ్యాఖ్యానించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకునేందుకు గృహ కొనుగోలుదారుల ఫ్లాట్స్‌ను విక్రయించడం కుదరదని తేల్చి చెప్పింది. ‘ఇప్పటికే జప్తు చేసిన ఆమ్రపాలి ప్రమోటర్లు, ఇతర అధికారుల ఆస్తులను విక్రయించి బకాయిలను రాబట్టుకోవచ్చు‘ అని సుప్రీం కోర్టు తెలిపింది. బ్యాంకులు, అధికారుల నిష్క్రియాపరత్వం కారణంగానే ఆమ్రపాలి ప్రమోటర్లు నిధులను మళ్లించగలిగారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ నేపథ్యంలో బాకీలు రాబట్టుకునేందుకు కొనుగోలుదారులపై కేసులు పెట్టడం గానీ లేదా వారి ఫ్లాట్లను విక్రయించడం గానీ చేయరాదు. గృహాల కొనుగోలుదారులు ఇప్పటికే ఒకసారి మోసపోయారు. బాకీల రికవరీ పేరిట ఆ ప్రాజెక్టులను అమ్మేసి మళ్లీ మోసగించడం సరికాదు. నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు ఆయా సందర్భాలను బట్టి కొనుగోలుదారులకు నెల రోజుల్లోగా రిజిస్టర్డ్ డీడ్స్ ఇవ్వాలి‘ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈడీ కేసు నమోదు.. గృహ కొనుగోలుదారులు కట్టిన సొమ్మును మళ్లించిన ఆమ్రపాలి గ్రూప్.. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలను పక్కన పెట్టి నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు కూడా ఆమ్రపాలి గ్రూప్‌తో కుమ్మక్కై పూర్తి సహకారం అందించారని పేర్కొంది. బాకీలను రాబట్టుకునే క్రమంలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాపర్టీలను విక్రయించేందుకు నోయిడా, గ్రేటర్ నోయిడాకు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఆమ్రపాలి గ్రూప్, దాని ప్రమోటర్ల మీద మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసును నమోదు చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్ట నిబంధనల ఉల్లంఘన కింద ఆమ్రపాలి గ్రూప్ ప్రమోటర్లను విచారణ చేయడంతో పాటు వారి అసెట్స్‌ను ఈడీ జప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ధోనీ కూడా బాధితుడే.. ఇళ్ల కొనుగోలుదారులే కాదు క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కూడా ఆమ్రపాలి గ్రూప్ బాధితుడే. 2011లో ప్రపంచ కప్ గెల్చిన భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లకు నోయిడాలోని ప్రాజెక్టులో రూ. 9 కోట్ల విలువ చేసే విల్లాలు ఇస్తామంటూ ఆమ్రపాలి ప్రకటించింది. వాటిని కట్టనూ లేదు. ఇవ్వనూ లేదు. అంతే కాదు.. ఆమ్రపాలికి సుమారు 6–7 ఏళ్ల పాటు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. కానీ దానికి కూడా ఆమ్రపాలి గ్రూప్ డబ్బులు చెల్లించలేదు. చివరికి, ఆమ్రపాలి బాధిత గృహాల కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ధోనీ కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. రూ. 150 కోట్ల బకాయిలు రాట్టుకోవడం కోసం ఆమ్రపాలిపై కేసు వేశాడు. -
ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేకసార్లు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం తాజా సంచలన తీర్పును వెలువరించింది. సంస్థ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను ఆదేశించింది. సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. తద్వారా సుమారు 42వేల గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు కోర్టు రిసీవర్‌గా ఆర్ వెంకట్రామన్‌ను నియమించింది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్‌పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న కుంభకోణంలో ఆమ్రపాలి చిక్కుకుంది. అలాగే ఆమ్రపాలి గ్రూప్‌నకు ప్రచారకర్తగా వ్యవహరించిన తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని -
‘ఆమ్రపాలి’పై సుప్రీం మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఎండీ, డైరెక్టర్లపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లోగా కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బుధవారం హెచ్చరించింది. ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూపు సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించకుండా కోర్టుతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది. మరీ ఇంత తెలివిగా ప్రవర్తించడం సరికాదన్న ధర్మాసనం.. ఇన్వెస్టర్లకు న్యాయం చేసేందుకు మీ ఇళ్లను అమ్మడానికి కూడా కోర్టు వెనకాడబోదని ఎండీని హెచ్చరించింది. 15 రోజుల్లోగా ఆమ్రపాలి సంస్థ ఎండీ, డైరెక్టర్లకు సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము సేకరించి.. ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. వేల మందిని నిరాశ్రయులను చేయాలని చూస్తున్న మిమ్మల్ని నిరాశ్రయులను చేసేందుకు.. వడ్డీతో సహా సొమ్మును వసూలు చేసేందుకు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా సిద్ధంగా ఉందని ఘాటుగా హెచ్చరించింది. మీరు ఎలా పూర్తి చేయగలరు? ఆమ్రపాలి గ్రూప్ చేపట్టిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) ఆగస్టు 2న కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... 30 రోజుల్లోగా నిర్మాణ పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. నిర్మాణ పనులకు ఆటంకం కలిగించకుండా విద్యుత్ సరఫరాను యథావిథిగా కొనసాగించాలని ఆమ్రపాలి గ్రూప్‌తో జతకట్టిన పవర్ కంపెనీలను కోర్టు కోరింది. -
ఎన్‌బీసీసీలో 15% వాటా విక్రయానికి ఓకే..
రూ.1,700-1,800 కోట్లు రావచ్చని అంచనా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీలో 15% వాటా విక్రయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలి పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.13,788 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,700- 1,800 కోట్లు సమకూరవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ వ్యవహారాల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. డిజిన్వెస్ట్‌మెంట్ సమయంలో మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ఈ వాటా విక్రయం ద్వారా ఎంత లభిస్తుందనేది తేలనుందని తెలిపారాయన. ఈ వాటా విక్రయంలో భాగంగా అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న ఎన్బీసీసీ ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 11 శాతం పతనమై ఎన్బీసీసీ ప్రభుత్వం ఈ కంపెనీలో అధిక వాటాను విక్రయించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ 15 శాతానికే పరిమితమవటంతో స్టాక్ ఎక్స్చేంజీలలో ఎన్బీసీసీ షేర్ బుధవారం 11 శాతం క్షీణించి రూ.230 వద్ద ముగిసింది. మూడు ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ గోరక్‌పూర్, సింద్రి, బరౌనిల్లో మూతపడిన యూరియా ప్లాంట్లను పునరుద్ధరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కోటి 1.27 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మూడు ప్లాంట్ల పునరుద్ధరణ వ్యయం రూ.18,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఈశాన్య రాష్ట్రాల డిమాండ్‌ను తట్టుకోవడానికి, యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. -
స్టాక్స్ వ్యూ
ఎన్బీసీసీ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,017 టార్గెట్ ధర: రూ.1,145 ఎందుకంటే: నేషనల్ బిల్డింగ్స్ కన్స్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1960 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. 2014లో నవరత్న హోదా సాధించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.843గా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 36 శాతం వృద్ధి చెంది రూ.1,149 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.32 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. జౌళి మంత్రిత్వ శాఖ నుంచి వారణాసిలో ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసే రూ.197 కోట్ల ప్రాజెక్ట్‌ను ఇటీవలనే సాధించింది. వివిధ క్లయింట్ల నుంచి ఈ సంస్థ సాధించిన వ్యాపారం ఈ ఏడాది ఆగస్టులో రూ.387 కోట్లుగానూ, గత నెల్లో రూ.277 కోట్లుగానూ ఉంది. ఈ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. 132 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయి వ్యాపారాన్ని సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళ్లలో ఈ కంపెనీ నికర అమ్మకాలు 16 శాతం, నికర లాభం 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.1,145 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను రికమెండ్ చేస్తున్నాం. కోల్గేట్ పామోలివ్ బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.904 టార్గెట్ ధర: రూ.811 ఎందుకంటే: గత పదేళ్లలో భారత టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఈ కంపెనీకి పోటీ అంతకంతకూ తీవ్రమవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి కేటగరీలో అగ్రస్థానంలో ఉండగా, కోల్గేట్-పామోలివ్ కంపెనీ మాత్రం ఒక్క కేటగిరీ(టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల)పై మాత్రమే దృష్టిసారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అనిశ్చితిగా ఉండటంతో అమ్మకాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండగలదని భావిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్లకు లభించే ద్రవ్య ప్రోత్సాహకాల కాలపరిమితి ముగింపునకు వచ్చింది. గత ఐదేళ్లలో 13% చొప్పున వృద్ధి సాధించిన టూత్‌బ్రష్, టూత్ పేస్టుల మార్కెట్ రానున్న ఐదేళ్లలో 10% లోపే చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యూరోమానిటర్ సంస్థ అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో 18%గా ఉన్న టూత్‌పేస్ట్‌ల ఆదాయం 2014-15లో 12%కి తగ్గింది. టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌ల మార్కెట్ సంతృప్త స్థాయికి చేరడంతో కంపెనీలు తమ తమ మార్కెట్ వాటా పెంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. పోటీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ పెప్పొడెంట్, క్లోజప్ల్లో కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే కాకుండా ప్రచారం భారీగా చేస్తోంది. ఈ విషయంలో కోల్గేట్ పామోలివ్ వెనకబడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. హిందుస్తాన్ యూనిలివర్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.785 టార్గెట్ ధర: రూ.1,017 ఎందుకంటే: సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మార్కెట్లో సర్ఫ్, లైఫ్‌బాయ్, లక్స్, లిరిల్, రెక్సోనా, డవ్, పియర్స్, హమామ్, వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ వంటి బ్రాండ్లతో, సన్‌సిల్క్, లిప్టన్ గ్రీన్ టీ, బ్రూ గోల్డ్, ఫ్లేవర్డ్ టీ బ్యాగ్స్ వంటి బ్రాండ్లతోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, లాక్మే, క్లినిక్ ప్లస్, క్లోజప్, తదితర బ్రాండ్లతో ఓరల్, హెయిర్, స్కిన్ కేర్ సెగ్మెంట్లతో తన మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటోంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. నికర అమ్మకాలు 5 శాతమే పెరగ్గా, నికర లాభం 2.6 శాతం క్షీణించింది. పన్ను ప్రయోజనాలు తొలగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగమనం ఫలితాలపై ప్రభావం చూపా యి. అయితే అమ్మకాలు 7%, నిర్వహణ మార్జిన్లు 41 బేసిస్ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఉత్పత్తుల ధరలను కొంత మేర తగ్గించింది. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీకే అధిక ప్రయోజనమని భావిస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 14%. నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో నిర్వహణ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 18%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18.5% మెరుగుపడతాయని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
కొత్త ఏపీ భవన్లో సకల సౌకర్యాలు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో పునరాభివృద్ధి చేయనున్న ఆంధ్రప్రదేశ్ భవన్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అనేక రెస్టారెంట్లు, బహుళ ప్రయోజన అపార్ట్మెంట్లు, సర్వీస్ అపార్ట్మెంట్లను నిర్మించనున్నారు. జాతీయ రాజధానిలో ఈ చారిత్రక భనాన్ని పునర్నిర్మించేందుకు సంబంధించి నవరత్న కంపెనీల్లో ఒకటైన పట్టణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ (ఎన్బీసీసీ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సంప్రదించింది. ఇందుకు స్పందించిన ఎన్బీసీసీ ఏపీ భవన్ పునరాభివృద్ధికి సంబంధించి ఓ ప్రణాళిక తో ముందుకొచ్చింది. ఈ భవన్ వెంట సర్వీస్ అపార్ట్మెంట్లు, విభిన్నమైన శైలిలో అతిథి గృహాన్ని నిర్మించాలని ఎన్బీసీసీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ అపార్ట్మెంట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ భవన్లో ఒక్కసారి భోజనం చేస్తే ఢిల్లీ వాసులకు మళ్లీ మళ్లీ రావాలని అనిపించేవిధంగా చేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు. ఆంధప్రదేశ్‌కు చెందిన వివిధ రకాల వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఇక్కడ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ సెంటర్ పునరాభివృద్ధిలో భాగంగా ఏపీ భవన్ ప్రాంగణంలో రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ విషయమై ఎన్బీసీసీ చైర్మన్ అనూప్‌కుమార్ మిట్టల్ మాట్లాడుత ‘ఏపీ భవన్లో రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన ఓ క న్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని ప్రతిపాదించాం. ఈ సౌకర్యం ఏపీభవన్‌లో ఉంటే విజ్ఞాన్ భవన్ తర్వాత నగరంలో ఇదొక హేపెనింగ్ సెంటర్‌గా మారుతుంది’ అని అన్నారు. క న్వెన్షన్ సెంటర్, సర్వీస్ అపార్ట్మెంట్ల వల్ల ఏపీ ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు విడిది చేసేందుకు వారికి కూడా సకల సౌకర్యాలతో కూడిన గదులను నిర్మిస్తామన్నారు. చర్చలు జరిపిన చంద్రబాబు ఏపీ భవన్ పునరాభివృద్ధి విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్బీసీసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం 19 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రకు 10.6, తెలంగాణకు మిగతా స్థలం దక్కనుంది. ఏపీభవన్ నగరంలోని అశోకారోడ్డులోగల ఇండియా గేట్ వద్ద ఉంది. హైదరాబాద్ హౌస్‌కు ఆనుకుని ఉంది. ప్రస్తుతం ఈ కాంపౌండ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రం ఉంది.