
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్టుకూ అంబాసిడర్‌గా వ్యవహరించి.. వివాదంలో చిక్కుకున్నారాయన. తాజాగా ఈ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. ధోనీతో పాటు ప్లాట్‌ల బకాయిల్ని చెల్లించని మరికొంతమందికి సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం 15 రోజుల డెడ్‌లైన్ విధించారు. లేనిపక్షంలో ఒప్పందం రద్దు కావడంతో పాటు ప్లాట్‌లను వేలం వేస్తామని స్పష్టం చేసింది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్‌లోని కస్టమర్ డేటాలో ఇంతదాకా బకాయిలు చెల్లించని ఓనర్లలో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎన్‌బీసీసీ(National Buildings Construction Corporation Ltd).. ఈ మేరకు ధోనీతో పాటు మొత్తం పద్దెనిమిది వందల మందికి నోటీసులు జారీ చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించి.. ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి బకాయిలు చెల్లింపునకు రెండు వారాల గడువు ఇస్తున్నామని, లేని పక్షంలో వాళ్లను డిఫాల్టర్‌లుగా గుర్తిస్తామని నోటీసుల్లో తెలిపింది. ఆపై ఆ ప్లాట్‌లను అమ్ముడుపోని జాబితాలో చేరుస్తామని, తర్వాతి దశలో ఎలాట్‌మెంట్‌ను రద్దుచేసి... వేలం వేస్తామని హెచ్చరించింది.
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ప్రాజెక్ట్ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేసే సంస్థ ఎన్‌బీసీసీకి అప్పగించింది. ఇప్పటికే చాలామంది పేమెంట్స్ పూర్తి చేయగా.. బకాయిలు చెల్లించని వాళ్లలో ధోనీ కూడా ఉన్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లాట్‌లు ధోనీ పేరిట ఉన్నాయి.
నొయిడాలోని సాప్పైర్ ఫేజ్-1లోని పెంట్ హౌజ్ కోసం కోటిన్నరకుగానూ ఇదివరకే ఇరవై లక్షలు ధోనీ చెల్లించినట్లు ఎన్‌బీసీసీ గుర్తించింది. అంతేకాదు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తక్కువ ఎమౌంట్‌కే ప్లాట్‌లను ధోనీకి అప్పగించినట్లు, ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించినట్లు రోహిత్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ (RSMPL) వెల్లడించింది. ఇక ఈ హౌజింగ్ సొసైటీలో హోం బయర్స్ దాదాపు పదివేలమంది కస్టమర్ డాటాలో పేర్లను నమోదు చేసుకోకపోవడం విశేషం.
చదవండి: ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment