ఎన్బీసీసీలో 15% వాటా విక్రయానికి ఓకే..
రూ.1,700-1,800 కోట్లు రావచ్చని అంచనా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీలో 15% వాటా విక్రయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలి పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.13,788 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,700- 1,800 కోట్లు సమకూరవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ వ్యవహారాల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
డిజిన్వెస్ట్‌మెంట్ సమయంలో మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ఈ వాటా విక్రయం ద్వారా ఎంత లభిస్తుందనేది తేలనుందని తెలిపారాయన. ఈ వాటా విక్రయంలో భాగంగా అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న ఎన్‌బీసీసీ ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
11 శాతం పతనమై ఎన్‌బీసీసీ
ప్రభుత్వం ఈ కంపెనీలో అధిక వాటాను విక్రయించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ 15 శాతానికే పరిమితమవటంతో స్టాక్ ఎక్స్చేంజీలలో ఎన్‌బీసీసీ షేర్ బుధవారం 11 శాతం క్షీణించి రూ.230 వద్ద ముగిసింది.
మూడు ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ
గోరక్‌పూర్, సింద్రి, బరౌనిల్లో మూతపడిన యూరియా ప్లాంట్లను పునరుద్ధరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కోటి 1.27 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మూడు ప్లాంట్ల పునరుద్ధరణ వ్యయం రూ.18,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఈశాన్య రాష్ట్రాల డిమాండ్‌ను తట్టుకోవడానికి, యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.