ఎన్‌బీసీసీ
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.1,017
టార్గెట్ ధర: రూ.1,145
ఎందుకంటే: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్రక్షన్ కార్పొరేషన్(ఎన్‌బీసీసీ) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1960 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. 2014లో నవరత్న హోదా సాధించింది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.843గా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 36 శాతం వృద్ధి చెంది రూ.1,149 కోట్లకు పెరిగాయి.
నికర లాభం రూ.32 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. జౌళి మంత్రిత్వ శాఖ నుంచి వారణాసిలో ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసే రూ.197 కోట్ల ప్రాజెక్ట్‌ను ఇటీవలనే సాధించింది. వివిధ క్లయింట్ల నుంచి ఈ సంస్థ సాధించిన వ్యాపారం ఈ ఏడాది ఆగస్టులో రూ.387 కోట్లుగానూ, గత నెల్లో రూ.277 కోట్లుగానూ ఉంది.
ఈ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. 132 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయి వ్యాపారాన్ని సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళ్లలో ఈ కంపెనీ నికర అమ్మకాలు 16 శాతం, నికర లాభం 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.1,145 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను రికమెండ్ చేస్తున్నాం.
కోల్గేట్ పామోలివ్
బ్రోకరేజ్ సంస్థ: నొముర
ప్రస్తుత ధర: రూ.904
టార్గెట్ ధర: రూ.811
ఎందుకంటే: గత పదేళ్లలో భారత టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ కంపెనీకి పోటీ అంతకంతకూ తీవ్రమవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి కేటగరీలో అగ్రస్థానంలో ఉండగా, కోల్గేట్-పామోలివ్ కంపెనీ మాత్రం ఒక్క కేటగిరీ(టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల)పై మాత్రమే దృష్టిసారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అనిశ్చితిగా ఉండటంతో అమ్మకాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండగలదని భావిస్తున్నాం.
హిమాచల్ ప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్లకు లభించే ద్రవ్య ప్రోత్సాహకాల కాలపరిమితి ముగింపునకు వచ్చింది. గత ఐదేళ్లలో 13% చొప్పున వృద్ధి సాధించిన టూత్‌బ్రష్, టూత్ పేస్టుల మార్కెట్ రానున్న ఐదేళ్లలో 10% లోపే చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యూరోమానిటర్ సంస్థ అంచనా వేస్తోంది.
కంపెనీ ఆదాయంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో 18%గా ఉన్న టూత్‌పేస్ట్‌ల ఆదాయం 2014-15లో 12%కి తగ్గింది. టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌ల మార్కెట్ సంతృప్త స్థాయికి చేరడంతో కంపెనీలు తమ తమ మార్కెట్ వాటా పెంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. పోటీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ పెప్పొడెంట్, క్లోజప్‌ల్లో కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే కాకుండా ప్రచారం భారీగా చేస్తోంది. ఈ విషయంలో కోల్గేట్ పామోలివ్ వెనకబడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి.
హిందుస్తాన్ యూనిలివర్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.785
టార్గెట్ ధర: రూ.1,017
ఎందుకంటే: సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మార్కెట్లో సర్ఫ్, లైఫ్‌బాయ్, లక్స్, లిరిల్, రెక్సోనా, డవ్, పియర్స్, హమామ్, వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ వంటి బ్రాండ్లతో, సన్‌సిల్క్, లిప్టన్ గ్రీన్ టీ, బ్రూ గోల్డ్, ఫ్లేవర్డ్ టీ బ్యాగ్స్ వంటి బ్రాండ్లతోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్‌లీ, పాండ్స్, లాక్మే, క్లినిక్ ప్లస్, క్లోజప్, తదితర బ్రాండ్లతో ఓరల్, హెయిర్, స్కిన్ కేర్ సెగ్మెంట్లతో తన మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటోంది.
కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. నికర అమ్మకాలు 5 శాతమే పెరగ్గా, నికర లాభం 2.6 శాతం క్షీణించింది. పన్ను ప్రయోజనాలు తొలగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగమనం ఫలితాలపై ప్రభావం చూపా యి. అయితే అమ్మకాలు 7%, నిర్వహణ మార్జిన్లు 41 బేసిస్ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఉత్పత్తుల ధరలను కొంత మేర తగ్గించింది.
అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీకే అధిక ప్రయోజనమని భావిస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 14%. నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో నిర్వహణ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 18%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18.5% మెరుగుపడతాయని భావిస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Oct 19 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement