క్యూ2లో రూ. 2,595 కోట్లు
మొత్తం రూ. 29 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతంపైగా క్షీణించి రూ. 2,595 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,657 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జతగా మరో రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు అనుమతించింది. దీంతో మొత్తం రూ. 29 (రూ.6,814 కోట్లు) డివిడెండ్ చెల్లించనుంది.
ఆదాయం ప్లస్...
తాజా క్యూ2లో హెచ్‌యూఎల్ మొత్తం టర్నోవర్ 2%పైగా బలపడి రూ. 16,145 కోట్లను తాకింది. దీనిలో ప్రొడక్టుల విక్రయాలు 2 శాతం వృద్ధితో రూ. 15,703 కోట్లకు చేరాయి. పట్టణాల్లో డిమాండ్ తగ్గినా గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.
ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత..: క్వాలిటీ వాల్స్, కార్నెటో, మ్యాగ్నమ్ బ్రాండ్లను కలిగిన ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. స్వతంత్ర కమిటీ సలహామేరకు ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ చెప్పారు.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 2,658 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment