interim dividend
-
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
హెచ్‌యూఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతంపైగా క్షీణించి రూ. 2,595 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,657 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జతగా మరో రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు అనుమతించింది. దీంతో మొత్తం రూ. 29 (రూ.6,814 కోట్లు) డివిడెండ్ చెల్లించనుంది.ఆదాయం ప్లస్...తాజా క్యూ2లో హెచ్‌యూఎల్ మొత్తం టర్నోవర్ 2%పైగా బలపడి రూ. 16,145 కోట్లను తాకింది. దీనిలో ప్రొడక్టుల విక్రయాలు 2 శాతం వృద్ధితో రూ. 15,703 కోట్లకు చేరాయి. పట్టణాల్లో డిమాండ్ తగ్గినా గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత..: క్వాలిటీ వాల్స్, కార్నెటో, మ్యాగ్నమ్ బ్రాండ్లను కలిగిన ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. స్వతంత్ర కమిటీ సలహామేరకు ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ చెప్పారు.ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 2,658 వద్ద ముగిసింది. -
క్రిసిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఏడాది(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 172 కోట్లకు చేరింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ. 152 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 772 కోట్ల నుంచి రూ. 833 కోట్లకు బలపడింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 15 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ షేరు బీఎస్ఈలో 2% లాభంతో రూ. 4,790 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అపోలో హాస్పిటల్స్ లాభం 60 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది. -
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది. -
లారస్ లాభం 55 శాతం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్ రూ.1.2 చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం క్షీణించి రూ.103 కోట్లు నమోదు చేసింది. మార్జిన్స్ 7.5 శాతం సాధించింది. ఎబిటా 28 శాతం తగ్గి రూ.287 కోట్లు, ఎబిటా మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఈపీఎస్ రూ.1.9 నమోదైంది. టర్నోవర్ 3% తగ్గి రూ. 1,381 కోట్లకు వచ్చి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,041 కోట్ల టర్నోవర్‌పై రూ.790 కోట్ల నికరలాభం పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో లారస్ షేరు ధర గురువారం 2.60 శాతం క్షీణించి రూ.292.25 వద్ద స్థిరపడింది. -
నెస్లే నుంచి రూ. 27 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా తాజాగా ఒక్కో షేరుకి రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. బుధవారం నిర్వహించిన 64వ వార్షిక సమావేశంలో కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ ఏప్రిల్ 21కాగా.. వాటాదారులకు మే 8న ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున చెల్లించనుంది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. రూ. 10 ముఖ విలువగల 9.64 కోట్లకుపైగా షేర్లతోకూడిన మొత్తం చెల్లించిన మూలధనంపై డివిడెండును ప్రకటించింది. కాగా.. ప్రస్తుత ఏడాది(2023) తొలి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలను ఈ నెల 25న ప్రకటించనుంది. 2022 అక్టోబర్ 31న కంపెనీ షేరుకి రూ. 120 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఎన్ఎస్ఈలో నెస్లే ఇండియా షేరు 1 శాతం నీరసించి రూ. 19,460 వద్ద ముగిసింది. -
నాట్కో మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం తగ్గి రూ.62 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.591 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నాట్కో షేరు ధర బీఎస్ఈలో గురువారం 0.38 శాతం క్షీణించి రూ.529.10 వద్ద స్థిరపడింది. -
రూ. 407 కోట్లతో సీసీఎల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వియత్నాం తయారీ కేంద్రంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ఫెసిలిటీని నెలకొల్పనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.407 కోట్లు. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ రూ.3 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కంపెనీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.9 శాతం ఎగసి రూ.73 కోట్లు సాధించింది. ఎబిటా 9 శాతం పెరిగి రూ.101 కోట్లుగా ఉంది. టర్నోవర్ 26.5 శాతం అధికమై రూ.535 కోట్లు నమోదు చేసింది. -
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
ఓఎన్జీసీ డివిడెండ్ రూ.5
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, కార్యకలాపాలు కొనసాగించడానికి తగిన నిధులు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్జీసీ భరోసానిచ్చింది. అంతే కాకుండా 100 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఓఎన్జీసీ తెలిపింది. కేంద్రానికి 62.78 శాతం వాటా ఉండటంతో కేంద్ర ఖజానాకు రూ.3,949 కోట్లు డివిడెండ్ ఆదాయం లభించగలదని వివరించింది. -
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండో డివిడెండ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది. -
టీవీఎస్ మరోసారి మధ్యంతర డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీసీఎస్ మోటార్ తన వాటాదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ బోర్డు రెండవ తాత్కాలిక డివిడెండ్ రూపంలో షేరుకు 1.40 చొప్పున చెల్లించడానికి ఆమోదించినట్లు తెలిపింది. మార్చి 18 న పని గంటలు ముగిసే సమయానికి ఈ షేర్లను వాటాలను కలిగి ఉన్న వాటాదారులకు మార్చి 20 న లేదా ఆ తరువాత ప్రకటించిన తాత్కాలిక డివిడెండ్ చెల్లించబడుతుందని చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రోజు (మంగళవారం) జరిగిన సంస్థ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రెండవ మధ్యంతర డివిడెండ్‌ను షేరుకు రూ. 1.40 (140 శాతం) చొప్పున ప్రకటించింది. గత నెలలో ఇది ఒక్కో షేరుకు రూ. 2.1 డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హీరో మోటో లాభాలు భేష్
సాక్షి, ముంబై: అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ త్రైమాసికంలో బలమైన ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ హీరో మోటో షేరు 3 శాతానికిపైగా లాభాలతో హీరోగా నిలిచింది. అంచనాలకు మించి 2020 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 14.5 శాతం నికర లాభం పెరిగి 880 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 769 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో 17శాతం పుంజుకుని రూ.773 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.905 కోట్లకు పెరిగిందని ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అయితే మొత్తం అమ్మకాలు 17,98,905 యూనిట్ల నుంచి 14.34 శాతం తగ్గి 15,40,876 యూనిట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 11 శాతం తగ్గి రూ .6,997 కోట్లకు చేరిందని హీరో మోటొకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో ఇబిట్టా 6 శాతం తగ్గి రూ.1,105 కోట్ల నుంచి రూ.1,039 కోట్లకు చేరింది, ఇబిట్టా మార్జిన్లు 80 బీపీఎస్ పాయింట్లు పెరిగి 14.8 శాతానికి పెరిగింది. అలాగే రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.65 డివిడెండ్(3,250 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. -
భారత డైనమిక్స్ భారీ డివిడెండ్
భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కంపెనీ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ సోమవారం రెగ్యులేటరీకి సమాచారం అందించింది. 10 రూపాయల ఫేస్ వాల్యూ గల ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 5.25 ల మధ్యంతర డివిడెండ్‌ను అంశాన్ని వెల్లడించింది. మార్చి 27వ రికార్డ్ తేదీగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 16నాటికి డివిడెండ్ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. 2018-19 ఆర్థికసంవత్సరంలో ఇది మొదటి మధ్యంతర డివిడెంట్. ఈ వార్తలతో భారత డైనమిక్స్ షేర్ లాభాలతో కొనసాగుతోంది. -
కేంద్రానికి ఆర్బీఐ 28 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) కేంద్రం ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్బీఐ బోర్డ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. క్లుప్తంగా వివరాలివీ... ► ఆర్బీఐ జూలై – జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీనిప్రకారం 2018 జూలై నుంచి 2019 జూన్ నెలాఖరు వరకూ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. 2018 ఆగస్టులో (తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరిధిలోనికి వచ్చే) ఆర్బీఐ ఒక ప్రకటన చేస్తూ, 2017–18కి సంబంధించి కేంద్రానికి రూ.50,000 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్. ► ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018 జూలై–2019 జూన్) సంబంధించి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా సోమవారం పేర్కొంది. ► దీనితో కేంద్రానికి సంబంధించినంతవరకూ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్–2019 మార్చి) ఆర్బీఐ నుంచి మొత్తం రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది. ► ఇలా మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్బీఐ ఇవ్వడం ఇది వరుసగా రెండవ సంవత్సరం. 2017–18లో ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్ రూ.30,663 కోట్లు. ► ఆర్బీఐ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2018 జూలై–2019 జూన్) 2018 డిసెంబర్‌కి 6 నెలలు పూర్తయ్యింది. పరిమిత ఆడిట్ సమీక్ష, అందుబాటులో ఉన్న మిగులు నిధులు (ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్) వంటి అంశాల ప్రాతిపదికన కేంద్రానికి రూ.28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని ఆర్బీఐ బోర్డ్ నిర్ణయం తీసుకుంది... అని సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ఒకటి తెలిపింది. ► 1934 ఆర్బీఐ చట్టం సెక్షన్ 47 కింద కేంద్రానికి ఆర్బీఐ తన మిగులు నిధులను అందిస్తోంది. మొండిబకాయిలు, మొండిబకాయిలుగా మారేందుకు అవకాశమున్న బకాయిలకు కేటాయింపులు, సిబ్బంది, పదవీ విమరణ నిధికి వాటా, ఇతర కేటాయింపులుపోను మిగిలిన లాభాలను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించాలని ఈ సెక్షన్ పేర్కొంటోంది. ద్రవ్యలోటు... వివాదాల నేపథ్యం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ లేదా మిగులుగా రూ.82,911.56 కోట్లను పొందాలని బడ్జెట్ నిర్దేశించింది. ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో కేంద్రానికి ఇదొక మార్గం. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని సంబంధిత వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. దీనితో మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలను 3.3 శాతంకాకుండా, 3.4 శాతానికి కేంద్రం పెంచింది. అయితే ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రం పేర్కొంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జలాన్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ మాత్రం దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం మిగులు నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. మెగా బ్యాంకులు కావాలి: జైట్లీ ఆర్బీఐ బోర్డ్ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాల్లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు, తత్సబంధ ఫలితాలను ప్రస్తావించారు. భారత్‌లో బ్యాంకుల సంఖ్య తగ్గాలనీ, మెగా బ్యాంకులు ఏర్పాటవ్వాలని ఆర్థికమంత్రి సూచించారు. తద్వారా ఈ రంగం దేశాభివృద్ధిలో మరింత కీలకపాత్ర పోషించగలుగుతుందన్నారు. ఎస్బీఐలో భారతీయ మహిళాబ్యాంక్ సహా ఐదు అనుబంధ బ్యాంకుల విలీనాన్ని జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇదే సానుకూల అనుభవంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయాబ్యాంక్ విలీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ బ్యాంకుల విలీనంతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 18కి తగ్గుతోంది. రేటు కోతపై బ్యాంకర్లతో 21న దాస్ భేటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బ్యాంకర్లు బదలాయించడంపై ఈ సమావేశంలో దాస్ దృష్టి సారించనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ఆర్బీఐ గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘రేట్ల కోత ప్రయోజనం బదలాయింపు చాలా ముఖ్యమైన అంశం. ఇదే విషయాన్ని పాలసీ సమీక్ష ప్రకటన సందర్భంగా చెప్పాం. 21న కూడా ఇదే అంశంపై దృష్టి సారించనున్నాం’’ అని తెలిపారు. లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.25 కోట్ల వరకూ రుణంపై ప్రకటించిన పునర్వ్యవస్థీకరణ పథకాన్ని దాస్ ప్రస్తావిస్తూ, ఇక ఈ పథకం అమలు బ్యాంకుల పరిధిలో ఉందని అన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్‌బ్యాంకులపై రెగ్యులేటరీ చర్యల గురించి అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానం ఇస్తూ, నియంత్రణా నిబంధనల పాటింపు విషయంలో తగిన చర్యలన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందన్నారు. రుణ వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు. జవాన్లకు నివాళులు జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూ, ఆర్బీఐ బోర్డ్ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది. -
మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన ఆర్బీఐ
సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు పథకాల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి నిధుల ఊతం అందిరానుంది. కేంద్ర ప్రభుత్వానికి రూ 28.000 కోట్ల మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు ఆర్బీఐ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. మోదీ ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్ వరుసగా అడ్వాన్స్ చెల్లింపులు జరపడం ఇది రెండో ఏడాది కావడం గమనార్హం. రైతులకు ప్రకటించిన నగదు సాయంతో పాటు ద్రవ్యలోటుకు కళ్లెం వేసేందుకు ఆర్బీఐ నిధులు కేంద్రానికి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇక రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయం కింద మార్చి 31లోగా తొలివిడత 12 కోట్ల మంది రైతులకు రూ 2000 అందచేసేందుకు రూ 20,000 కోట్లు అవసరం కానుండగా ఆర్బీఐ నిధులు కొంత మేర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తాయి. కాగా ఈ ఏడాది ఆర్బీఐతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ప్రభుత్వం రూ 74,140 కోట్ల డివిడెండ్లను ఆశిస్తుండగా, వచ్చే ఏడాది డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి రూ 82,910 కోట్లు సమకూరతాయని అంచనా వేస్తోంది. -
అంచనాలను అందుకున్న ఇన్ఫీ
సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 10.3శాతం లాభాల వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6-8శాతం వుంటుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో ఎనలిస్టులు అంచనాలకు మించి ఈ ఆర్థికసంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ. 4,110 కోట్ల నికర లాభాలాను సాధించింది. ఆదాయం 17.30 శాత ఎగిసి 20,609 కోట్ల రూపాయలను సాధించింది. కఆపరేటింగ్ మార్జిన్లు 23.7శాతంగా ఉన్నాయి. డివిడెండ్: అలాగే ప్రతి ఈక్విటీ షేరుకు 7రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అక్టోబరు 30 తరువాత డివిడెండ్ చెల్లింపు ఉంటుందని తెలిపింది. -
నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్
సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్ చెల్లించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్ చెల్లిస్తుంది. అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ చెల్లింపు చేయనుంది. అలాగే డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్లో నెస్లే ఇండియా లిమిటెడ్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 7680 వద్ద ముగిసింది. -
కావేరీ సీడ్స్ 125% డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కావేరీ సీడ్స్ క్యూ1లో రూ. 664 కోట్ల ఆదాయంపై (కన్సాలిడేటెడ్) రూ. 218 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 827 కోట్ల ఆదాయంపై రూ. 230 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గురువారం సమావేశమైన బోర్డు వాటాదారులకు 125% మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరుకు డివిడెండ్ రూ. 2.50 లభించనుంది.