న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది.
లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment