Public sector
-
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆస్తుల మానిటైజేషన్ డీలా.. టార్గెట్‌లో రూ.25 లక్షల కోట్ల లోటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1.75 లక్షల కోట్లను అందుకోలేకపోవచ్చని తెలుస్తోంది. దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వివరాల ప్రకారం రూ. 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోనున్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రౌన్‌ఫీల్డ్(పాత) మౌలిక సదుపాయాల ఆస్తుల అంచనా విలువ రూ. 6 లక్షల కోట్లు. 2022–2025 మధ్య కాలంలో మానిటైజేషన్‌కు వీలున్న ఆస్తుల అంచనాలివి. కాగా.. ఈ ఏడాది ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 1.5 లక్షల కోట్లు సమీకరించగలమని తాజా ఇంటర్వ్యూలో పాండే తెలియజేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లు, మైనింగ్, రహదారులు, విద్యుత్ రంగంలో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(టీవోటీ) ద్వారా మానిటైజేషన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలియం రంగంలోనూ ఇకపై మానిటైజేషన్‌కు తెరతీయనున్నట్లు వెల్లడించారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ బడ్జెట్లో ప్రతిబింబించదని, జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్హెచ్ఏఐ) దీనిని నిర్వహిస్తుందని వివరించారు. ఈ నిధులు ప్రభుత్వానికి చేరుతాయని, తద్వారా ఇవి బడ్జెట్లో ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. అయితే చాలా కేసులలో నిధులు సంస్థలకే చెందుతాయని, ప్రభుత్వానికి కాదని తెలియజేశారు. కొత్త మౌలిక సదుపాయాల కల్పనలో ప్రయివేట్ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వీలుగా ఆస్తుల మానిటైజేషన్‌ను చేపడుతున్నామని, ఇది ప్రభుత్వ విధానమని తెలియజేశారు. తద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధితోపాటు పట్టణ, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని సమ్మిళితం చేయవచ్చని వివరించారు. వ్యూహాత్మక వాటాల విక్రయంపై దృష్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్ తదితర సంస్థల ప్రైవేటీకరణను పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరే ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో కొత్తగా వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని పరిశీలించకపోవచ్చని స్పష్టం చేశారు. కాకపోతే లిస్టెడ్ ప్రభుత్వరంగ సంస్థల సబ్సిడరీల వాటాల విక్రయం ఉండొచ్చని సంకేతం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల ఉమ్మడి మార్కెట్ విలువ గత మూడేళ్ల కాలంలో 500 శాతం పెరిగి రూ.58 లక్షల కోట్లకు చేరినట్టు పాండే చెప్పారు. భారత ప్రభుత్వం వాటాల విలువ 4 రెట్లు పెరిగి రూ.38 లక్షలకు చేరుకున్నట్టు తెలిపారు. బలమైన పనితీరు, వృద్ధి అవకాశాలు, మూలధన వ్యయాల పునర్నిర్మాణం, స్థిరమైన డివిడెండ్ పంపిణీ విధానం వల్ల ప్రభుత్వరంగ సంస్థల విలువ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ స్టీల్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదనలు అమలు దశలో ఉండడం గమనార్హం. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇవి పూర్తి కావాల్సి ఉండగా, పలు అవాంతరాలతో జాప్యం నెలకొన్నట్టు చెప్పారు. ఇక హిందుస్థాన్ జింక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. దీని విక్రయంపై పాండేకు ప్రశ్న ఎదురైంది. విడతల వారీగా వాటా విక్రయించాలన్న తమ ప్రతిపాదనకు హిందుస్థాన్ జింక్ యాజమాన్యం డీమెర్జర్ ప్రణాళికలతో అనిశ్చితి ఏర్పడినట్టు చెప్పారు. హిందుస్థాన్ జింక్‌ను మూడు వేర్వేరు కంపెనీలుగా డీమెర్జర్ చేసేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. -
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
ఐఆర్ఎఫ్సీ నుంచి ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్(ఐఆర్ఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనుంది. కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) నిబంధన అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో 11శాతానికిపైగా వాటాను విక్రయించే వీలున్నట్లు అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం రైల్వే రంగ ఫైనాన్సింగ్ కంపెనీలో ప్రభుత్వం 86.36 శాతం వాటా ను కలిగి ఉంది. దీపమ్, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో ఏర్పాటైన అంతర్‌మంత్రివర్గ గ్రూప్ ఎంతమేర వాటా విక్రయించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ ఎంపీఎస్ నిబంధనలో భాగంగా ప్రభుత్వం 11.36 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 2021 జనవరిలో లిస్టయిన కంపెనీ ఐదేళ్లలోపు ఎంపీఎస్‌ను అమలు చేయవలసి ఉంది. అయితే వాటా విక్రయ అంశంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఈలో ఐఆర్ఎఫ్ఎస్ షేరు దాదాపు రూ. 51 వద్ద కదులుతోంది. ఈ ధరలో 11.36 శాతం వాటాకుగాను ప్రభుత్వం రూ. 7,600 కోట్లు అందుకునే వీలుంది. కాగా.. ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించనుండగా.. మరికొంత తాజాగా జారీ చేయనున్నట్లు అంచనా. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ షేరు బీఎస్ఈలో తొలుత రూ. 52.7 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 0.6 శాతం బలపడి రూ. 51.2 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ షేరు 38 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
చాలా కాలం తర్వాత ఎఫ్డీలకు కళ!
ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి. రుణాలకు డిమాండ్.. జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. బ్యాంకుల వారీ రేట్లు.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి. -
చమురు ధరలు తగ్గడం ఓఎంసీలకు అనుకూలం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద బలహీన ఆర్థిక ఫలితాలనే నమోదు చేస్తాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ.. విక్రయ ధరలను చాలా కాలంగా నిలిపి ఉంచడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్థిక మందగమనం ఆందోళనలతో చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడం వల్ల మూడు ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల బాట పడతాయని అంచనా వేసింది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నష్టాలు వచ్చినందున, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు బలహీనంగానే ఉంటాయి. చమురు విక్రయ ధరలపై పరిమితి పెట్టినందున మొదటి ఆరు నెలల్లో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అవి రేట్లను సవరించలేదు’’అని మూడీస్ పేర్కొంది. ఈ మూడు కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి చమురు విక్రయ ధరలను సవరించకుండా, అవే ధరలను కొనసాగిస్తుండడం గమనార్హం. 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అవి ధరలను సవరించకపోవడం వల్ల, మొదటి ఆరు నెలలకు రూ.21,000 నష్టాలను ప్రకటించాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా.. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం వీటి నష్టాలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. ఇవి ముడి చమురును డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయని మూడీస్ తెలిపింది. లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే చమురు ధరలు తగ్గినందున, కొనుగోళ్ల వ్య యాలు తగ్గి లాభదాయక వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడుతుందని మూడీస్ అంచనా వేసింది. రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేయడం ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు కలిసొస్తుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ కంటే రష్యా చమురు త క్కువ ధరకు వస్తుండడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ వచ్చే 12నెలల్లో చమురు ధరలు అస్థిరతల మధ్యే చలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రతరమైనా లేక చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నా అది అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని, అదే జరిగితే ఆయిల్ కంపెనీల లాభాలు పరిమితం కావొచ్చని పేర్కొంది. రుణ పరిస్థితుల్లో మెరుగు.. ‘‘లాభాలు పెరిగితే రుణ భారం తగ్గుతుంది. మూ లధన అవసరాలకు నిధుల వెసులుబాటు లభిస్తుంది. 2022 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య నష్టాలను అదనపు రుణాలు తీసుకుని ఇవి సర్దుబాటు చేసుకున్నాయి. దీంతో వాటి రుణ భారం పెరిగింది’’అని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పే ర్కొంది. పెరిగే ధరలకు అనుగుణంగా మూలధన అవసరాలు కూడా పెరుగుతాయని, ఫలితంగా కంపెనీల రుణ కొలమానాలు బలహీనంగా ఉంటా యని పేర్కొంది. నియంత్రణపరమైన అనిశ్చితి కూ డా వాటి రుణ నాణ్యతను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘‘భారత్‌లో చమురు ధరల పరంగా స్ప ష్టత లోపించింది. రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలకు ఇది క్రెడిట్ నెగెటివ్. చమురు ధరలపై నియంత్రణలతో కంపెనీల నష్టాలు కొనసాగుతా యి. వాటిని ప్రభుత్వం సకాలంలో సర్దుబాటు చే యకపోతే వాటి క్రెడిట్ నాణ్యత కూడా బలహీనపడుతుంది’’ ఈని మూడిస్ నివేదిక హెచ్చరించింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు దృష్ట్యా ఈ కంపెనీల తుది రేటింగ్‌ల్లో ఏ మాత్రం మార్పు ఉండదని స్పష్టం చేసింది. రేట్లపై స్వేచ్ఛ లభిస్తేనే.. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ విక్రయ రేట్లను సవరించుకునే స్వేచ్ఛ కల్పించినప్పుడే వాటి మార్జిన్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని మూడీస్ తెలిపింది. అయితే ఇది 2024 సాధారణ ఎన్నికల తర్వాతే సాధ్యపడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇటీవల అంతర్జాతీయంగా రేట్లు తగ్గడం కంపెనీలకు సానుకూలిస్తుందని పేర్కొంది. ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగతే వచ్చే కొన్ని నెలల్లో కంపెనీల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ తెలిపింది. ‘‘2022–23లో సెప్టెంబర్ 30 నాటికి సగటున చమురు ధర బ్యారెల్ 105 డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి డిసెంబర్ 31 నాటికి 16 శాతం తగ్గి బ్యారెల్ 89 డాలర్లకు దిగొచ్చింది’’ అని పేర్కొంది. -
ఎస్‌జేవీఎన్ భారీ పవన విద్యుత్ ప్రాజెక్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎస్‌జేవీఎన్ (గతంలో సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్) రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ–రివర్స్ వేలం ప్రక్రియ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుండి ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు ఎస్‌జేవీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్మాణానికి సంబంధించి యూనిట్‌కు రూ.2.90 (టారిఫ్), అలాగే స్వయం నిర్వహణ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పొందినట్లు పేర్కొంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎస్జీఈఎల్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్‌ను చేపట్టి, అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్‌టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 16 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో రూ.2,480 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ అక్టోబర్‌లో రూ.2,870 కోట్లకు చేరుకున్నాయి. పన్ను ఎగవేతదారులను గుర్తించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం పన్ను ఆదాయం పెరగడంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య 90 శాతం దాటిందన్నారు. అక్టోబర్‌లో వసూలైన రూ.2,870 కోట్లు రాష్ట్రంలో జరిగిన లావాదేవీలపై వచ్చిన జీఎస్టీ ఆదాయమని, ఇందులో ఎస్జీఎస్టీ మినహాయింపులు తీసేస్తే ఆ మేరకు రాష్ట్రానికి వచ్చే నికర జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని వాణిజ్యపన్నుల అధికారులు వివరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రధమం. -
టాటా గూటికి మహారాజా!!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్‌గా టాటా గ్రూప్ నిలి్చనట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్ఏఎం) ఈ బిడ్‌పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, టాటా గ్రూప్ దాఖలు చేసిన ఆర్థిక బిడ్లను డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్ అత్యధికంగా కోట్ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్‌ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్ అంశంలో ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్ చేశారు. టాటా గ్రూప్‌నకు ఇప్పటికే ఎయిర్‌ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా అనే జాయింట్ వెంచర్ నిర్వహిస్తోంది. 2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు.. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్‌కి బదలాయిస్తారు. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్‌పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలు లభిస్తాయి. 1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం... మహారాజా మస్కట్‌తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ గా ప్రారంభమైంది. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్ యాష్ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. -
ఎగుమతులకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్ ముగింపునకు 190 బిలియన్ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్ మార్కెట్లోకి వస్తుందని వెల్లడించారు. ఎన్‌ఈఐఏ స్కీమ్ కొనసాగింపు నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ) స్కీమ్ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు. 2022 మార్చి వరకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్జీఎస్ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది. లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్జీఎస్ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది. -
పెట్రోల్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: ఇంధనాల వినియోగం ఆగస్టులో మిశ్రమంగా నమోదైంది. కోవిడ్–19 పరిస్థితులతో ప్రజలు వ్యక్తిగత రవాణా సాధనాలకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో నెలవారీగాను పెట్రోల్‌కు డిమాండ్ కొనసాగగా, డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థల ప్రాథమిక గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఆగస్టులో 2.43 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 13.6 శాతం అధికం. 2019 ఆగస్టు (కోవిడ్‌కి పూర్వం) అమ్మకాలు 2.33 మిలియన్ టన్నులు. మరోవైపు, దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు జులైతో పోలిస్తే ఆగస్టులో 9.3 శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 15.9 శాతం పెరిగి 4.94 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే 9.8 శాతం క్షీణించాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోల్చినప్పుడు గత నెల డీజిల్ వినియోగం 8 శాతం తగ్గింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ విజృంభించడానికి ముందు మార్చిలో ఇంధనాల వినియోగం దాదాపు సాధారణ స్థాయికి తిరిగి వచ్చింది. కానీ ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో ప్రతికూల ప్రభావం పడి మే నెలలో పడిపోయింది. కరోనా కట్టడి కోసం అమలవుతున్న ఆంక్షలను సడలిస్తుండటంతో ఆ తర్వాత నెలల్లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. ప్రభుత్వ రవాణా సాధనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రాధాన్యమిస్తుండటంతో జులైలోనూ పెట్రోల్ వినియోగం పెరిగింది. మరోవైపు, తాజాగా ఆగస్టులో వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.85 శాతం వృద్ధి చెంది 2.33 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. విమానయాన సర్వీసులు క్రమంగా పెరిగే కొద్దీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 42 శాతం పెరిగి 3,50,000 టన్నులకు చేరాయి. -
ఎల్ఐసీలోకి విదేశీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లు కూడా పాలుపంచుకునేందుకు అవకాశం లభించనుంది. దీనిపై గత కొద్ది వారాలుగా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ శాఖలు కూడా చర్చించాక, క్యాబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించాయి. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం బీమా రంగ సంస్థల్లో ఆటోమేటిక్ విధానంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే, ప్రత్యేకంగా చట్టం ద్వారా ఏర్పాటైన ఎల్ఐసీకి మాత్రం ఇది వర్తించదు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలంటే సెబీ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. -
నామినేటెడ్ పోస్టులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్ తర్వాతగానీ నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్ఐఐసీ, స్పోర్ట్స్ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. భారీగానే ఆశావహులు.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్ఎస్లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్ఎస్లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. ఈ పదవులన్నీ ఖాళీయే.. పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. -
ఆ విద్యుత్ ఏమైపోతోంది?
సంస్కరణలు అమలు చేస్తేనే.. విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణలతో దేశవ్యాప్తంగా డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3.03 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని (ఆత్మనిర్భర్–2 కింద) ప్యాకేజీని ప్రకటించింది. వ్యవసాయం మినహా మిగతా కేటగిరీల వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగించడం, వ్యవసాయ ఫీడర్లను విభజించడం, ఫీడర్లు–డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడం, ప్రతి పట్టణంలో స్కాడా సెంటర్ ఏర్పాటు చేయడం, కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్/ఏఐ) వినియోగం వంటి సంస్కరణలను ప్రతిపాదించింది. వీటిని అమలు చేస్తే డిస్కంలు ‘ఏటీ–సీ’నష్టాలను సమూలంగా నిర్మూలించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఏటేటా పెరుగుతున్న నష్టాలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పరిపాలన, నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతున్న డిస్కంలు గట్టెక్కేదెలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో గుర్తించడం, సాంకేతిక–వాణిజ్యపర లోపాలతో ఏర్పడే ‘ఏటీ–సీ’నష్టాలను నియంత్రించడం, వినియోగదారులకు ఇచ్చే రాయతీలకు తగ్గట్టు ప్రభుత్వ సబ్సిడీలను పెంచడం, అధిక ధర విద్యుత్ కొనుగోళ్లను వదులుకోవడం, దుబారా ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలు చేపడితేనే.. డిస్కంలు మెరుగుపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలు తోడ్పతాయని చెప్తున్నారు. ఏటా వేల కోట్ల నష్టాలు.. డిస్కంలు ఏటా భారీ విద్యుత్ నష్టంతో వేల కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లు 2019–20 ఉమ్మడిగా రూ.6,061 కోట్ల వార్షిక నష్టాలను ప్రకటించగా.. అందులో నియంత్రించదగిన ‘సాంకేతిక, వాణిజ్య(అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్/ఏటీ–సీ)’నష్టాలే రూ.3,837.65 కోట్ల మేర ఉండటం గమనార్హం. ఆ ఏడాది రెండు డిస్కంలు కలిపి విద్యుత్ ప్లాంట్ల నుంచి 65,751.1 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా.. వినియోగదారులకు సరఫరా చేసినట్టు లెక్క తేలినది 59,631.68 ఎంయూలు మాత్రమే. మిగతా 6,119.42 ఎంయూల విద్యుత్ ఏమైందో తెలియదు. డిస్కంలు దానిని సాంకేతిక, వాణిజ్య నష్టాల కింద లెక్కలు చూపాయి. ►ఎస్పీడీసీఎల్ రూ.24,907.26 కోట్ల వ్యయంతో 45,247.02 ఎంయూ విద్యుత్ కొనుగోలు చేయగా.. సరఫరా లెక్కలు 40,981.27 ఎంయూలకే ఉన్నాయి. మిగతా 4,265.75 ఎంయూల విద్యుత్ ఏమైంది, ఎలా నష్టపోయిందన్న లెక్కలు తెలియవు. సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.5.5 ఖర్చు చేయగా.. వినియోగదారులకు అమ్మినది రూ.6 చొప్పున. అయినా రూ.2,560.68 కోట్లు నష్టపోయింది. ►ఎన్పీడీసీఎల్ రూ.11,326.08 కోట్లతో 20,504.08 ఎంయూ విద్యుత్ కొన్నది. 18,650.41 ఎంయూల సరఫరా లెక్కలతో రూ.12,848.57 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్కో యూనిట్ కొనుగోలుకు సగటున రూ.5.52 పైసలు ఖర్చుచేయగా.. వినియోగదారులకు విక్రయించినది రూ.6.88. అంటే గణనీయంగా ఆదాయం రావాలి. కానీ 1,853.67 ఎంయూల విద్యుత్ లెక్కలు తెలియక.. రూ.1,276.97 కోట్ల ఆదాయానికి గండిపడింది. వాస్తవ నష్టాలు ఇంకా ఎక్కువే! వ్యవసాయం మినహా మిగతా అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ మీటర్లు ఉన్నాయి. దీంతో వ్యవసాయ వినియోగం అంచనాలను పెంచడం ద్వారా నష్టాలను తగ్గించి చూపిస్తున్నారన్న ఆరోపణలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. వాస్తవానికి డిస్కంల నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు 2019–20లో ఎన్పీడీసీఎల్ 11,510.14 ఎంయూ విద్యుత్‌ను మీటర్లు గల వినియోగదారులకు విక్రయించగా, మరో 7,140.27 ఎంయూ విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేసినట్టు అంచనా వేసింది. మరో 1,853.66 ఎంయూ నష్టపోయినట్టు చూపింది. అంటే మూడో వంతుకుపైగా విద్యుత్‌ను వ్యవసాయానికే వినియోగించినట్టు పేర్కొంది. ఎక్కడికక్కడ నష్టాలు తెలుసుకోవచ్చు దేశవ్యాప్తంగా తొలివిడత కింద 2023 డిసెంబర్ నాటికి 10 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఫీడర్లు, డిస్ట్రిబ్యుషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికేబుల్ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటిద్వారా ఏయే ప్రాంతాల్లో, ఏ కారణాలతో విద్యుత్ నష్టాలు వస్తున్నాయో గుర్తించవచ్చు. సాంకేతిక లోపాలతో నష్టం వచ్చినా, చౌర్యం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఆయా ప్రాంతాల్లో బాధ్యులైన అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ‘సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్(స్కాడా)’కేంద్రం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాను దీని ద్వారా సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్ సరఫరా ఫీడర్లను వేరుచేసి, మీటర్లు ఏర్పాటు చేస్తే.. వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు బయటపడతాయి. ఇతర నష్టాలను వ్యవసాయ ఖాతాలో వేయడానికి అవకాశం ఉండదు. రూ.9,020 కోట్లు నష్టాలు: నీతి ఆయోగ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2018–19 నాటికి రూ.9,020 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని విద్యుత్ పంపిణీ రంగం– సంస్కరణలపై తాజాగా ప్రచురించిన అధ్యయన నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ వచ్చాక 2014–15లో రూ.2,912 కోట్లుగా ఉన్న నష్టాలు ఏటా పెరుగుతూ ఐదేళ్లలో మూడింతలైనట్టు తెలిపింది. నీతి ఆయోగ్ వెల్లడించిన గణాంకాలివీ.. -
క్యూ1లో గెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 500 శాతం దూసుకెళ్లి రూ. 1,530 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ1లో దాదాపు రూ. 256 కోట్లు మాత్రమే ఆర్జించింది. కోవిడ్–19 కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు కారణంగా గత క్యూ1లో కార్యకలాపాలకు విఘాతం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. అయితే తాజా క్వార్టర్లోనూ మహమ్మారి సెకండ్ వేవ్ తలెత్తినప్పటికీ తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని తెలియజేసింది. మొత్తం ఆదాయం సైతం 44 శాతం జంప్‌చేసి రూ. 17,387 కోట్లను తాకింది. లాభాల తీరిలా సొంత పైప్లైన్ల ద్వారా గ్యాస్ రవాణా పెరగడంతో ఈ విభాగం నుంచి లాభదాయకత 27 శాతం పుంజుకుని రూ. 915 కోట్లకు చేరినట్లు వివరించింది. కాగా.. గ్యాస్‌పై మార్జిన్లు బలపడటంతో రూ. 378 కోట్లు ఆర్జించింది. గత క్యూ1లో రూ. 545 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయి. ఇక పెట్రోకెమికల్ బిజినెస్ సైతం రూ. 138 కోట్ల లాభం సాధించగా.. గతంలో రూ. 154 కోట్ల నష్టం నమోదైంది. భాగస్వామ్య సంస్థలతో కలసి 8,000 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 38,000 కోట్లవరకూ వెచ్చిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉసార్‌లో పీడీహెచ్పీపీ యూనిట్ ద్వారా పాలీప్రొపిలీన్ సామర్థ్యాన్ని 5,00,000 టన్నులమేర విస్తరిస్తోంది. ఇదేవిధంగా యూపీలోని పాటాలో 60,000 పీపీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 10,000 కోట్ల పె ట్టుబడులను కేటాయించింది. మొత్తం పెట్టుబడు ల్లో ఈ ఏడాది రూ. 6,600 కోట్లు సమకూర్చనుంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 143 వద్ద ముగిసింది. -
సాధారణ బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సాధారణ బీమా వ్యాపారం (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021కి లోక్‌సభ మంగళవారం ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం వేసింది. పెగాసస్, ఇతర సమస్యలపై సభ్యుల ఆందోళనల నడుమ ఈ బిల్లును సభలో ఆమోదం నిమిత్తం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో కేంద్రం తన వాటాల విక్రయానికి మార్గం సుగమం చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రైవేటుపరం కానుంది. అయితే ఈ పేరును ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు. ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ గత వారమే ఆమోదముద్ర వేసింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇక రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. -
‘ఆటో’ అవకాశాలను అందిపుచ్చుకునేలా..
సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు ►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్‌లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్‌కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తాయి. ►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్‌లోని తమ యూనిట్లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది. -
ప్రైవేటీకరణ దిశగా కేంద్రం జోరు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానానికి కొత్త క్లాజ్‌ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్లో పేర్కొంది. విదేశీ కంపెనీల ఆసక్తి.. బీపీసీఎల్‌లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్‌లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకూ 49 శాతమే! 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా! ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. చిన్న విమానాశ్రయాలు షురూ..! దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.