![Opposition parties held a meeting with the Central Election Commission team - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/4/election2.jpg.webp?itok=q_bqgIbI)
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్‌ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి.
ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్‌ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి.
సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ
మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు.
మద్యం షాపులు మూసేయిస్తే...
మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు.
ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్‌ఎస్
ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment