
టీజీఐఐసీ ద్వారా రూ.8,476 కోట్లు సేకరించాం
ఆ నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చు చేశాం
కంచ గచ్చిబౌలి భూములు సర్కారువేనని సుప్రీంకోర్టు తేల్చింది
నకిలీ వీడియోలతో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆ భూముల విలువను రూ.30 వేల కోట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం విడ్డూరమని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం సెబీ నిబంధనలకు అనుగుణంగా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి టీజీఐఐసీ ద్వారా బాండ్ల రూపంలో రూ.9,995 కోట్లు సేకరించాలని నిర్ణయించి ఇప్పటివరకు రూ. 8,476 కోట్లు సేకరించినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవని సుప్రీంకోర్టు తేల్చాక ఇంకా వివాదం చేయడం ఏమిటన్నారు. రూ.5,200 కోట్ల భూమిని రూ.30,000 కోట్లుగా చూపిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. సీబీఆర్‌ఐ అనుబంధంగా ఉన్న ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ ఈ భూమి విలువను రూ.23,000 కోట్లుగా నిర్ధారించగా దీన్ని సెబీ, ఆర్‌బీఐ కూడా ధ్రువీకరించాయని తెలిపారు. టీజీఐఐసీ ద్వారా సేకరించిన నిధులను రైతుభరోసా, రుణమాఫీ, సన్న బియ్యం కొనుగోలు వంటి ప్రజా సంక్షేమ పథకాల కోసమే ఉపయోగించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10.09% వడ్డీకి నిధులు సేకరించగా కాంగ్రెస్ ప్రభుత్వం 9.35% వడ్డీకే సమకూర్చిందని తెలిపారు. మర్చంట్ బ్యాంకర్ మధ్యవర్తిగా ఉండి ఫండ్స్‌ను జమచేసి బాండ్స్‌ను ఇన్వెస్టర్ వద్దకు తీసుకెళ్తారని, సెబీ నిబంధనల మేరకే మర్చంట్ బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో సంబంధం లేదని, ఎల్–1 బిడ్డర్‌గా బ్యాంకర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 4,600 ఎకరాలు సేకరించినప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేయించారా? అని ప్రశ్నించారు.
రాయదుర్గం, ఖానామెట్, కోకాపేట, నార్సింగి, మోకిలలో వందల కోట్ల విలువైన భూములను అమ్మేశారని, అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్తాన్‌లో మృతిచెందిన జింక పిల్లను హెచ్‌సీయూలో చనిపోయినట్లు, ఏనుగులు అక్కడ సంచరిస్తున్నట్లు ఏఐ ఫొటోలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.