Sasidhar reddy
-
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్‌రెడ్డి, పి.శశిధర్‌రెడ్డి గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తు న్నారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి బీజేపీ ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ అధికారుల తీరుపై విచారణకు ఆదేశించాలని, వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఎన్ని కల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఈ నెల 9న కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైందని.. కానీ షెడ్యూల్ వెలువడటంతో ఎస్సీసీఎల్ అధికారులు, గ్రీన్‌ఫీల్డ్ హైవేస్ అథారిటీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ఆ సమావేశాన్ని విరమించుకున్నారని సీఈవోకు వివరించారు. కేంద్రమంత్రి సమావేశం జరగకపోయినా కూడా.. ఆ సమావేశంలో పాల్గొని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వీరం రాజుపై అధికారులు కేసు పెట్టారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో ప్రలోభమంటూ.. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను పూర్తిగా మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గంలోని డెయిరీ, టైలరింగ్ యూనిట్లకు ఖర్చు చేస్తున్నారని ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఇది సరికాదని.. స్త్రీనిధి సంస్థ ఎండీ, ఇతర రిటైర్డ్ అధికారులను వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క ఉపఎన్నికనే (మునుగోడు అసెంబ్లీ సీటుకు) సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీశాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్ఎస్ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని ఆరోపించాయి. ఏకంగా పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో అధికార బీఆర్ఎస్ డబ్బు సరఫరా చేసిందని దుయ్యబట్టాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి. సీఈసీతో సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న బి.వినోద్ కుమార్. చిత్రంలో భరత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర బలగాలను దింపాలి: బీజేపీ మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్ పాఠక్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులను భారీ స్థాయిలో ఎన్నికల పరిశీలకులుగా పంపాలని కోరారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు పనులు చేయా లని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు. మద్యం షాపులు మూసేయిస్తే... మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రధానపోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, ఫిరోజ్‌ఖాన్, జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అధికారుల బదిలీలను మళ్లీ జరపాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ప్రజల మధ్య విభజనకు మతఛాందసవాదుల కుట్ర: బీఆర్ఎస్ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతఛాందసవాదులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో మతఛాందసవాదులను నియంత్రించాలని సీఈసీని కోరింది. పార్టీ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ ఈసీ బృందానికి కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ గుర్తును ఓ పార్టీకి కేటా యించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరారు. కాగా, ఈ భేటీలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్‌కుమార్, కాసాని సతీష్, రాఘవేంద్ర ప్రతాప్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డీజీ నరసింహారావు, జ్యోతి, బీఎస్పీ నేతలు విజయార్య క్షత్రియ, రాజరత్నం, సురే‹Ùకుమార్, ఆప్ నేతలు దిడ్డి సుధాకర్, రాములు గౌడ్, హేమ ఈసీ బృందానికి తమ సూచనలు తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఈసీ బృందానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, పోలీసు అధికారులు స్వాగతం పలికారు. -
అభ్యర్థి నేనే.. మెదక్ కాంగ్రెస్‌దే
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ సీటును మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కే కేటాయిస్తారని, అభ్యర్థిగా బరిలో నేనే ఉంటానని నా తండ్రి, తాతల నుండి నాది కాంగ్రెస్ రక్తమని టీపీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని రాజీవ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పదేళ్లలో రాజకీయంగా నా జీవితం త్యాగమయం అవుతోందని, ఎన్నోసార్లు పోటీ నుండి తప్పుకున్నానన్నారు. అయినా కార్యకర్తల వెన్నంటే ఉంటూ పార్టీ ఆదేశాలమేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు పిలుపునిచ్చినా నావెన్నంటే ఉన్నారని, వారికి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేదని చెప్పారు. గత ఆరు రోజులుగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షేత్రస్థాయి సర్వే ప్రకారం టిక్కెట్ కేటాయిస్తే అందులో మనమే ఉంటామని చెప్పారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు చెందవద్దని, ఈ నెల 14న మనమే నామినేషన్ వేస్తామని చెప్పారు. తను ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అప్పటి మహానేత రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మెదక్–అక్కన్నపేటకు రైల్వేలైన్ మంజూరు చేయించానన్నార. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికోసం అనేక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతరాజు రమణ, మామిళ్ల ఆంజనేయులు, గూడూరి ఆంజనేయులు, అమృతరావు, శ్రీధర్‌యాదవ్, గంటరాజు, రబ్బిన్దివాకర్, శ్రీకాంత్, నాగరాజుతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
రేపు టికెట్లు ప్రకటించనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ టికెట్ల ఖరారుపై రేపు స్పష్టత రానుంది. ఎప్పటినుంచో ఊహించిన విధంగానే నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్‌పై షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికోసం 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టికెట్ కోసం తీవ్రంగా కృషి చేసిన శశిధర్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఆశావహులు మాత్రం విజయశాంతి అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లు సమాచారం. సాక్షి, మెదక్: నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో మెదక్, నర్సాపూర్ టికెట్లపై స్పష్టత రానుంది. గురువారం రోజంతా స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జాబితాను అందజేసింది. రాహుల్‌గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు అందరూ ఊహించిన విధంగానే నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ సునీతారెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. మెదక్ సీటుపై మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మెదక్ నుంచి పోటీ చేయాల్సిందిగా మాజీ ఎంపీ విజయశాంతిపై కాంగ్రెస్ అధిష్టానం వత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు ఆమె మెదక్ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్ ఆశిస్తున్న ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం విజయశాంతి పోటీ చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎదుట గురువారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డిలు హాజరయ్యారు. వీరిద్దరిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జిగించినట్లు సమాచారం. విజయశాంతి విజయానికి సహకరించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని రెబెల్‌గా పోటీ చేయొద్దని ఇద్దరిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాత్రం విజయశాంతికి టికెట్ కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెదక్ టికెట్ తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి బహుమానంగా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ దక్కని పక్షంలో రెబెల్‌గా పోటీచేసే యోచనలో శశిధర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ తదితరులు విజయశాంతి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. మెదక్ నుంచి టీజేఎస్ పోటీ చేసేకంటే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తేనే తమకు, పార్టీకి బాగుంటుందని వారు భావించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒత్తిడి తీసుకురావడంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు మెదక్ అసెంబ్లీ టికెట్‌పై ఉత్కంఠ నెలకొంది. దీని కోసం 14 మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శశిధర్‌రెడ్డి మినహా మిగితా ఆశావహులంతా విజయశాంతిని కలిసి తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఒప్పించారు. దీంతో విజయశాంతి శశిధర్‌రెడ్డిని మినహాయించి మిగితా ఆశావహుల్లో ఎవరికైనా టికెట్ ఇప్పించాలని అనుకున్నారు. అయితే అకస్మాత్తుగా టీజేఎస్ ఈ టికెట్ కోసం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని వదులుకునేందుకు ముందుగా కాంగ్రెస్ సిద్ధమైంది. దీనిని పసిగట్టిన ఆశావహులంతా మరోమారు విజయశాంతిని కలిసి మెదక్ టికెట్ టీజేఎస్‌కు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే మీరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలిపారు. దీంతో విజయశాంతి మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతోపాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్దాస్ను కలిసి మెదక్ టికెట్ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కే ఇవ్వాలని టీజేఎస్‌కు ఇవ్వొద్దని కోరారు. మెదక్ స్థానం టీజేఎస్‌కు ఇవ్వవద్దని అనుకుంటే మీరే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిపై వత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో విజయశాంతి మెదక్ నుంచి పోటీచేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీజేఎస్ మాత్రం మెదక్‌పై ఇంకా ఆశలు వదులుకోవడం లేదు. విజయశాంతి పక్కకు తప్పుకున్న పక్షంలో మెదక్ స్థానం తమకే దక్కుతుందని టీజేఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
కోర్టులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
అనంతపురం లీగల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి జి. స్వర్ణలత, వినియోగదారుల న్యాయస్థానం ఎదుట ఫోరం అధ్యక్షురాలు వై.ప్రమీలారెడ్డి, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అశోకస్థూపం వద్ద న్యాయవాదసంఘం అధ్యక్షుడు టి.భరత్‌భూషన్‌రెడ్డి తదితరులు త్రివర్ణపతాకాలు ఎగుర వేశారు. -
సీఎం సొంత జిల్లాకే అన్యాయం
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా మెదక్ లోనే చెరుకు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్ క్రషింగ్ సెంటర్ లో లక్ష టన్నుల చెరుకును ఏం చేస్తారో ప్రభుత్వమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతులకు రూ.13 కోట్ల బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
-
దెబ్బతిన్న ప్రతి పంటకూ పరిహారం
సాక్షి, నల్లగొండ: పంట దశ ను పరిగణనలోకి తీసుకోకుండా దెబ్బతిన్న ప్రతి పంటకూ నష్టపరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎండీఎంఏ) వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు మండలాల్లో వైస్ చైర్మన్‌తో కూడిన బృందం సోమవారం పర్యటించింది. దెబ్బతిన్న పంటలు, చెరువులు, రోడ్లను బృంద సభ్యులు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నష్ట పరిహారం చెల్లింపులకు ప్రస్తుతమున్న నిబంధనల్లో మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. వరదలకు కొట్టుకుపోయిన వ్యవసాయ మోటార్లకు పరిహారం చెల్లించడం నిబంధనల్లో లేదన్నారు. అయినా కేంద్రంతో మాట్లాడి పరిహారం అందజేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అధిక నిధులు విడుదల చేయాలని నివేదిక పంపించామని తెలిపారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల వివరాలు రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన వెంటనే కేంద్ర బృందం పర్యటన చేపడుతుందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.