మాట్లాడుతున్న శశిధర్‌రెడ్డి
సాక్షి, మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ సీటును మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కే కేటాయిస్తారని, అభ్యర్థిగా బరిలో నేనే ఉంటానని నా తండ్రి, తాతల నుండి నాది కాంగ్రెస్ రక్తమని టీపీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని రాజీవ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన పదేళ్లలో రాజకీయంగా నా జీవితం త్యాగమయం అవుతోందని, ఎన్నోసార్లు పోటీ నుండి తప్పుకున్నానన్నారు. అయినా కార్యకర్తల వెన్నంటే ఉంటూ పార్టీ ఆదేశాలమేరకు అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు పిలుపునిచ్చినా నావెన్నంటే ఉన్నారని, వారికి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేదని చెప్పారు.
గత ఆరు రోజులుగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షేత్రస్థాయి సర్వే ప్రకారం టిక్కెట్ కేటాయిస్తే అందులో మనమే ఉంటామని చెప్పారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు చెందవద్దని, ఈ నెల 14న మనమే నామినేషన్ వేస్తామని చెప్పారు. తను ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అప్పటి మహానేత రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మెదక్–అక్కన్నపేటకు రైల్వేలైన్ మంజూరు చేయించానన్నార. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రూ. 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికోసం అనేక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతరాజు రమణ, మామిళ్ల ఆంజనేయులు, గూడూరి ఆంజనేయులు, అమృతరావు, శ్రీధర్‌యాదవ్, గంటరాజు, రబ్బిన్‌దివాకర్, శ్రీకాంత్, నాగరాజుతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment