సాక్షి, నల్లగొండ: పంట దశ ను పరిగణనలోకి తీసుకోకుండా దెబ్బతిన్న ప్రతి పంటకూ నష్టపరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎండీఎంఏ) వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు మండలాల్లో వైస్ చైర్మన్‌తో కూడిన బృందం సోమవారం పర్యటించింది. దెబ్బతిన్న పంటలు, చెరువులు, రోడ్లను బృంద సభ్యులు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
నష్ట పరిహారం చెల్లింపులకు ప్రస్తుతమున్న నిబంధనల్లో మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. వరదలకు కొట్టుకుపోయిన వ్యవసాయ మోటార్లకు పరిహారం చెల్లించడం నిబంధనల్లో లేదన్నారు. అయినా కేంద్రంతో మాట్లాడి పరిహారం అందజేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అధిక నిధులు విడుదల చేయాలని నివేదిక పంపించామని తెలిపారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాల వివరాలు రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన వెంటనే కేంద్ర బృందం పర్యటన చేపడుతుందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న ప్రతి పంటకూ పరిహారం
Published Tue, Nov 5 2013 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement