సాయం చేస్తున్నా గిట్టదా? | Declaration of drought zones before the end of the season | Sakshi
Sakshi News home page

సాయం చేస్తున్నా గిట్టదా?

Published Mon, Dec 18 2023 5:20 AM | Last Updated on Mon, Dec 18 2023 5:20 AM

Declaration of drought zones before the end of the season - Sakshi

సాక్షి, అమరావతి: పంట నష్టం అంచనాలతో పనిలేదు.. కరువొచ్చిన మర్నాడే సాయం అంది తీరాలి! తుపాన్‌ తీవ్రత తగ్గక ముందే పరిహారం ఇచ్చి తీరాలి అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ధోరణి! కరువు రావడం, తుపాన్‌ వల్ల భారీ వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా ఉన్నాయి రామోజీ రాతలు! విపత్తుల వేళ అప్రమత్తతోపాటు రైతన్నలు నష్ట పోయిన ప్రతీ ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ గింజకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

పంట నష్టం లెక్కింపులో జాప్యం లేకుండా, పరిహారం చెల్లించి ఆదుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. సంక్రాంతి లోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా తనకు పట్టనట్లుగా యథాప్రకారం బురదలో కూరుకుపోయి దుష్ప్రచారానికి దిగే పెద్ద మనిషిని ఏమనుకోవాలి? 

ఎలా లెక్కిస్తారో తెలియదా? 
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) పరిగణనలోకి తీసుకుంటారు. ఇక తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించిన పంట నష్టపరిహారాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందిస్తారు.  

ఆదుకోలేదనడానికి మనసెలా వచ్చింది? 
ఖరీఫ్‌ 2023–24లో బెట్ట పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్‌ సీజన్‌ ప్రారంభం నుంచి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా 80 శాతం రాయితీపై విత్తనం పంపిణీ చేశారు. 80 శాతం సబ్సిడీతో (రూ.26.46 కోట్ల విలువ) 30,977 క్వింటాళ్ల విత్తనాలను 1.16 లక్షల మంది రైతులకు అందజేశారు. ముందస్తు రబీలో 89 వేల  మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు.  

కరువు సాయం కోసమే కేంద్ర బృందాలు 
ఖరీఫ్‌ 2023కి సంబంధించి ఏడు జిల్లాలలో 103 కరువు మండలాలను గుర్తించారు. 7.14 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కించి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించారు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు రూ. 534 కోట్ల పెట్టుబడి రాయితీ కోరుతూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కేంద్ర బృందం రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు 6.39 లక్షల మంది రైతులు 5.33 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు లెక్క తేల్చి రూ. రూ.784.61 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్‌ 2023లో 21, రబీ 2023 –24లో 17 పంటలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ప«థకాన్ని వర్తింప చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఖరీఫ్‌ 2023 నోటిఫైడ్‌ పంటలకు సంబంధించి 34.7 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం వర్తింప చేశారు ఈ జాబితాలను కేంద్రంతో పాటు బీమా కంపెనీలకు సైతం పంపించారు. 

ఉదారంగా ధాన్యం కొనుగోళ్లు 
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఉదారంగా వ్యవహరిస్తూ తేమ శాతం నిబంధనలను సడలించి రంగుమారిన, పాడైపోయిన «6.52 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్ద నుంచే సేకరించారు. గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో సహా గత నాలుగున్నరేళ్లలో విపత్తులతో నష్టపోయిన 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ సొమ్మును అదే పంట కాలం చివరిలో బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు.   

సాయం పెంపు కనపడదా? 
వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే సంకల్పంతో 2023  నవంబర్‌ 14 నుంచి పెట్టుబడి రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు­లు జారీ చేసింది. విపత్తుల వల్ల వ్యవసా­య భూముల్లో మట్టి, ఇసుక మేట వేస్తే తొ­లగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వే­లు ఇవ్వగా సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.­18 ­వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధా­ర పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8500కి పెంచింది.

నీటిపారుదల భూ­ములైతే ఇన్‌పుట్‌ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.17 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచగా మామిడి, నిమ్మ జాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500లకు, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలు చొప్పున పెంచి ఇస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement