సాక్షి, అమరావతి: ఐదేళ్లగా అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతున్న ఎల్లో మీడియా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తినే అన్నంపైనా ‘ఘోర’మైన అబద్ధాలను వండి వార్చింది. నిత్యం మూడు దశల పరిశీలన అనంతరం పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తుంటే ఈనాడు రామోజీకి ముద్ద సహించడం లేదు! రేపటి తరానికి విద్యా బుద్ధులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గోరుముద్ద మెనూను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలోని 44,156 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద బలవర్థకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు హాజరు తీసుకునే సమయంలో ఆ రోజు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మెనూ సరుకులు వంటవారికి అందిస్తున్నారు. ప్రతి దశలో కొలతలు, లెక్క పక్కాగా అమలు చేస్తున్నారు.
పిల్లలకు ఎలా వండితే నచ్చుతుందో వారి అభిప్రాయాలు తీసుకుని పరిశుభ్రంగా వండి పెడుతున్నారు. భోజనం తిన్నాక విద్యార్థులే స్వయంగా రిజిస్టర్‌లో తమ అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. ఆ రోజు మెనూ, ఆహారం బాగుంటే ‘గుడ్’ అని బాగా లేదంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. ప్రతి రోజు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి గోరుముద్ద తిని వారి అభిప్రాయాలు సైతం నమోదు చేస్తున్నారు.
రోజుకో మెనూ రుచించలేదా రామోజీ?
విద్యార్థుల్లో రక్త హీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే గోరుముద్దలో వినియోగిస్తున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది స్కూళ్లకు వెళ్లి బడి పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. రక్తహీనత నివారించే మాత్రలు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు.
పిల్లలు తీసుకునే ఆహారం మెనూను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రూపొందించారు. రక్తహీనత నివారణకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డు అందిస్తున్నారు. టీడీపీ హయాంలో బడి పిల్లలకు రోజూ నీళ్ల సాంబారు.. ముద్దగా మారిన అన్నం మాత్రమే ఇవ్వడంతో 20 శాతం పిల్లలు కూడా తినేవారు కాదు.
సగటున 34.90 లక్షల మందికి భోజనం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లో శద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలను పిల్లలకు ఇస్తున్నారు. విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ప్రతిరోజు బడిలో సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్‌లోడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల వరకు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు.
నాడు 450 కోట్లు.. నేడు 1,450 కోట్లు!
టీడీపీ అధికారంలో ఉండగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ఏనాడూ సకాలంలో డబ్బులు చెల్లించలేదు. నాడు స్కూళ్లలో వంటపాత్రల సరఫరా కూడా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,156 పాఠశాలలకు రూ.41 కోట్లతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత సర్కారు పిల్లల భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు వెచ్చించగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సగటున రూ.1,448.92 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో గోరుముద్దకు రూ.1,689 కోట్లు కేటాయించింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
♦ గత సర్కారు వంట ఖర్చు నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ.3.59 మాత్రమే కేటాయించగా ప్రస్తుతం రూ.8.57కి పెంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న కేంద్రీకృత కిచెన్ ఏజెన్సీలకు వంట ఖర్చును ప్రభుత్వం ఇప్పుడు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. వంట చేసే కుక్/ హెల్పర్ల గౌరవ వేతనాన్ని ప్రతి నెలా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది.
♦ ప్రభుత్వ స్కూళ్లల్లో 70 శాతం మంది విద్యార్థులు మాత్రమే భోజనం తింటున్నట్లు ఈనాడు కాకి లెక్కలు వేసింది. వాస్తవానికి గతేడాది జూన్ నుంచి డిసెంబర్ 31 వరకు హాజరైన విద్యార్థుల్లో సగటున 90 శాతం మంది భోజనం చేశారు.
♦ చిత్తూరు సంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో 585 మంది విద్యార్థులుంటే 400 మందికి మాత్రమే వంట చేస్తున్నారని, కానీ అంతకంటే తక్కువ మంది తింటున్నారంటూ ఈనాడు పేర్కొంది. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 575 కాగా సగటున 420 మంది హాజరవుతున్నారు. వచ్చిన వారంతా గోరుముద్ద తీసుకున్నట్టు తేలింది.
♦ నరసరావుపేట శంకర భారతీపురం హైస్కూల్లో 60 శాతం కంటే తక్కువ మందే గోరుముద్ద తీసుకుంటున్నారన్నదీ అబద్ధమే. ఇక్కడ 1,240 మంది విద్యార్థుల్లో సగటున 862 మంది హాజరు అవుతుండగా (88 శాతం) సరాసరిన 757 మంది (85 శాతం) మంది గోరుముద్ద తీసుకుంటున్నారు.
నోరూరే మెనూ..
♦ సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు / వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ
♦ మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు
♦ బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
♦ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
♦ శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
♦ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్
Comments
Please login to add a commentAdd a comment