
దేశంలో పెరిగిన పెద్దపులుల వేట
ఐదేళ్లలో వేటకు బలైన 100 పులులు
ఏపీలోనూ మూడు పులుల హతం
పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో భారీ డిమాండ్
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కేంద్రంగా పులులను వేటాడే ముఠాలు
వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో నివేదిక వెల్లడి
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది.
సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.
పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్‌లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది.
ఐదేళ్లలో బలైన 100 పులులు
కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.
కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు.
ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు.
మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు
చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్‌గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది.
ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్‌లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్‌లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి.
అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు.
స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు
దేశంలో పులుల వేట, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment