Tiger
-
మళ్లీ కనిపించిన పులి
మంచిర్యాలరూరల్ (హాజీపూర్): మంచిర్యాల జిల్లా ముల్కల్ల, పాతమంచిర్యాల అటవీ సెక్షన్ పరిధిలోని గఢ్‌పూర్‌లో పులులు కెమెరాకు చిక్కాయి. గఢ్‌పూర్ సఫారీ మార్గంలోని ఓ చెట్టుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు రెండుసార్లు వేర్వేరు పులులు చిక్కడం గమనార్హం. గత నెల 12న ఇదే కెమెరా మగపులి వెళుతున్న ఫొటోను తీయగా, తాజాగా బుధవారం ఉదయం ఇదే దారి వెంట వెళుతున్న ఆడపులి ఫొటోను తీసింది. అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పులిగా నిర్ధారించారు. మిరప చేనులో పెద్దపులి కౌటాల: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ మిరప చేనులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడే నవీన్ మిరప చేనుకు గురువారం ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చేనులో పడుకుని ఉన్న పులిని చూసి భయపడి గ్రామానికి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో వినయ్‌కుమార్ సాహూ, అధికారులు పాదముద్రలు పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. మహారాష్ట్ర నుంచి వార్దానది దాటి వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. -
బెబ్బులి బెదురుతోంది!
దేశంలోనే విస్తీర్ణంలో అతి పెద్దదైన పెద్దపులుల అభయారణ్యం శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్). అలాంటి చోటే వాటికి పెను ముప్పు ఎదురవుతోంది. పెరుగుతున్న పులుల సంతతికి తగ్గట్టు ఆవాసం, ఆహార లభ్యత దొరకడం లేదు. వీటి ప్రధాన ఆహార జంతువులైన దుప్పులు, కణుతుల సంఖ్య పెరగకపోగా రోజురోజుకు వాటి సంఖ్యలో తరుగుదల కనిపిస్తోంది. ఇందుకు అటవీ పరిధిలో వేటగాళ్లు మాటు వేయడం.. వారిని కట్టడి చేసే స్థాయిలో సిబ్బంది సంఖ్య లేకపోవడంతో ఎంతో భద్రమైనదిగా భావించే నల్లమలలోనే వాటి సంరక్షణ గాలిలో దీపంలా మారింది.ఆత్మకూరు రూరల్: అటవీ ఆవరణ వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పెద్దపులులు అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం– నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో 87 ఉన్నాయి. అయితే, పులులు పెరిగే కొద్ది వాటి ఆవాస ప్రాంతం, ఆహార లభ్యత పెరగడం లేదు. ఇందుకు తగినన్ని గడ్డి మైదానాలు అభివృద్ధి కాలేదు. పులుల ప్రధాన ఆహార జంతువుల సంఖ్య పెరగడమూ లేదు. నల్లమలలోని ఆత్మకూరు, నంద్యాల , గిద్దలూరు,మార్కాపురం డివిజన్లలో వేటగాళ్ల కదలికలు రోజురోజుకు పెరుగుతుండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన కొందరు వేటగాళ్లు గడ్డితినే జంతువులు సంచరించే నీటివనరుల వద్ద, జేడ (సాల్ట్ లిక్)మైదానాల వద్ద ఉచ్చులు వేసి మాటు గాస్తున్నారు. ఆ ఉచ్చులకు చిక్కిన వన్యప్రాణులను మాంసంగా మార్చి పట్టణాల్లో పెద్ద మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో పులి ఎంతో భద్రమైనదని భావించే ఎన్ఎస్టీఆర్ లో ప్రాణాంతక వైరస్‌లా వేటగాళ్ల చొరబాటు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది విస్పష్టం.ఎన్ఎస్టీఆర్ సర్కిల్లో మొత్తం నాలుగు డివిజన్లలో 750 (ఇది పాత లెక్క)మంది సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 250 మందే ఉన్నారు. ఈ అరకొర సిబ్బందితో వేటగాళ్లను నియంత్రించ లేని పరిస్థితి. ఫలితంగా పులి సంరక్షణ ప్రమాదకర స్థితిలో పడింది. ఫుట్ పెట్రోలింగ్‌కు అదే సమస్య అటవీ సంరక్షణలో రోజువారి ఫుట్ పెట్రోలింగ్ ( కాలి నడకతో ప్రదేశాన్ని చుట్టి రావడం)కు కూడా సిబ్బంది కొరతే ప్రధాన అడ్డంకిగా ఉంది. సుమారు 3,750 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లో ఫుట్ పెట్రోలింగ్‌కు ఉన్న వనరులు కేవలం బేస్ క్యాంప్ సిబ్బంది మాత్రమే. పులి సంరక్షణలో మేటి అని చెప్పుకునే ఆత్మకూరు అటవీ డివిజన్లో ఉన్న 23 బేస్ క్యాంపుల్లో సుమారు వంద మంది ప్రొటెక్షన్ వాచర్లు పని చేస్తుంటారు.అయితే, వీరిలో కొందరు వీక్లీ ఆఫ్‌లో ఉంటారు. మిగతా వారిని ప్రత్యేకించి ఫుట్ పట్రోలింగ్కు కేటాయించలేని పరిస్థితి. ప్రొటెక్షన్వాచర్లను పర్యవేక్షించేందుకు ఒక్కో బేస్ క్యాంపులో ఒక రెగ్యులర్ అటవీ సిబ్బంది ఉండాలి. ఈ రూల్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైంది. వేధిస్తోన్న ఆహార కొరత .. శ్రీశైలం – నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఆహార లభ్యతను బట్టి ఒక్కో పెద్దపులి తన అధీన ప్రాంతం (టెరటరీ)గా సుమారు 40 చ.కిమీ పరిధిని ఉంచుకుంటోంది. పులి సాధారణంగా ఆరు సార్లు దాడులు చేస్తే ఒకసారి వేట సాఫల్యమవుతుంది. ఇందుకోసం అది ఆరు రోజులు కూడా ఆకలితో నకనకలాడాల్సి ఉంటుంది. కనీసం వారానికో జంతువును వేటాడినా ప్రస్తుతం నల్లమలలో ఉన్న పులులకు వారానికి సుమారు 90 ఆహార జంతువులు అవసరమవుతాయి. నెలకు 360, సంవత్సరానికి దరిదాపుగా నాలుగు వేలకు పైగా జంతువులు అందుబాటులో ఉండాలి. ఇది కనిష్ట అవసర స్థితి. ఈ నిష్పత్తిలో ఆహార లభ్యత లేక పోతే పులుల ఆధీన ప్రాంతం క్రమేపీ పెరుగుతుంది. దీంతో పులుల మధ్య ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఈ పోరులో ఎన్నో పులులు మరణించే అవకాశం ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పులి ఆహారం వేటగాళ్ల చౌర్యానికి గురైతే జరిగే నష్టం లెక్కకట్టలేనిది. అడపాదడపా కేసులు... శిక్షలు శూన్యం? అటవీ అధికారులు అడపాదడపా ఎవరో ఒకరిని వన్యప్రాణి వేట కేసుల్లో పట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే, వారిలో ఏ ఒక్కరికీ కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందుకు ప్రధాన కారణం కూడా సిబ్బంది కొరతే. కనీసం పీఓఆర్ను కాని చార్జ్ షీట్‌ను కాని ముద్దాయిలకు శిక్ష పడేలా రాసుకోలేని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు రేంజ్ లోని గుమ్మడాపురం కు చెందిన కొందరు దుప్పి తలతో అధికారులకు చిక్కారు.ఇదే రేంజ్ లోని శివపురం సమీపంలో ఏప్రిల్ నెలలో ఇద్దరు ఎలుగు బంటి మాంసంతో చిక్కారు. ముసలమడుగు సమీపంలో అక్టోబర్ నెలలో కొందరు అడవి పంది మాంసంతో పట్టుబడ్డారు. వీరందరిపై పీఓఆర్ నమోదు అయి కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే వారిపై సరైన సెక్షన్లు పెట్టకపోవడంతో నిందితులు 24 గంటల్లో బెయిల్‌పై తిరిగి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఉచ్చులతో పులికీ ప్రమాదంవేటగాళ్లు పులి ఆహార జంతువులైన జింకల కోసం నీటి వనరుల వద్ద ఉచ్చులు పన్ని ఉంచు తారు. అయితే ఈ ఉచ్చులలో ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు పెద్ద పులులు కూడా చిక్కు కుని మరణిస్తుంటాయి. గతంలో సిద్దాపురం చెరువులో పన్నిన ఉచ్చులకు ఓ పెద్దపులి చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్ లోని నల్లకాల్వ సెక్షన్ లో ఓ పులి కళేబరం గాలేరు ప్రవాహంలో కొట్టుకు వచ్చింది. దాని మెడలో ఒక ఉచ్చు బిగిసి ఉంది. ఇలా వేటగాళ్ల వల్ల పులుల ఆహార జంతువులు తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు అవి కూడా ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అదే పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే వేటగాళ్లను నియంత్రిచవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వివరణ కోరగా ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని, కింది స్థాయిలో రిక్రూట్మెంట్ జరగడం లేదని, తమ వరకు పులుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఎవరీ వేటగాళ్లు... నల్లమల పులి ఆహారానికి పీడగా మారిన వేటగాళ్ల గురించి ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పడుతున్నాయి. ప్రధానంగా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వేటగాళ్ల కదలికలను గమనిస్తే అవి ఎక్కువగా మండలంలోని వెంకటాపురం, నల్లకాల్వ, కొత్తరామాపురం,సిద్దాపురం పరిధిల్లోనే కనిపిస్తున్నాయి. మండలంలోని మాజీ నేరస్తుల ఆవాస గ్రామానికి చెందిన కొందరు దాదాపు ప్రతి గ్రామంలోనూ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ అక్రమ మద్యం దుకాణాలు నడుపుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే లుంపెన్ తరగతులకు చెందిన యువకులను తమ వెంట తిప్పుతూ ఇటు నాటుసారా అక్రమ రవాణాకు, అటు వన్యప్రాణుల వేటకు వినియోగించుకుంటున్నారు. -
తాడ్వాయి అడవుల్లో పెద్దపులి!
మంగపేట: కొద్దిరోజులుగా ములుగు జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. తాజాగా తాడ్వాయి మండలం పంబాపూర్ అటవీ ప్రాంతం నార్త్ బీటు పరిధిలో సంచరించినట్లు అటవీశాఖ మంగపేట రేంజ్ అధికారి అశోక్ తెలిపారు. పంబాపూర్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి పులి గాండ్రింపులు వినిపించాయని చెప్పడంతో తాడ్వాయి రేంజ్ అధికారి సత్తయ్యతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పులి జాడ కోసం గాలించారు. పంబాపూర్ అటవీ ప్రాంతంలోని వట్టివాగు సమీపం వరకు వెళ్లిన పులి, తిరిగి వెనక్కి వచి్చనట్లు ఆనవాళ్లను గుర్తించారు. అది మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం లేదా మల్లూరువాగు ప్రాజెక్టు అటవీ ప్రాంతానికి లేదా కాటాపురం, గంగారం మీదుగా లవ్వాల అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పాదముద్రల సేకరణ ములుగు జిల్లా మంగపేట మండల పరిధి చుంచుపల్లి, తిమ్మాపురం అటవీ ప్రాంతంలో రెండు రోజుల నుంచి పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) రాహుల్ కిషన్‌జాదవ్ గురువారం సందర్శించారు. చుంచుపల్లి, పాలాయిగూడెం గ్రామాల మధ్య గోదావరి నదిని దాటివచ్చిన ప్రాంతంలో పులి పాదముద్రలను పరిశీలించారు. అనంతరం తిమ్మాపురం అటవీ ప్రాంతంలోని చౌడొర్రె వద్ద పులి పాద ముద్రలను పీఓపీ విధానం ద్వారా సేకరించారు. -
పులి కలకలం.. నాలుగేళ్ల క్రితం కూడా ఆడ పులి కోసమే..
ఇల్లెందురూరల్/చుంచుపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలం హడలెత్తించిన పెద్దపులి క్రమంగా కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలు దాటుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాకి ప్రవేశించింది. పాదముద్రల ఆధారంగా పులి భద్రాద్రి జిల్లాలోకి వచ్చినట్లు ములుగు జిల్లా తాడ్వాయి అటవీశాఖ అధికారులు తెలిపినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపునకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాలోని అడవికి ఆనుకుని ఉన్న ఏజెన్సీ మండలాల్లో అటవీశాఖ అప్రమత్తమైంది.మేటింగ్ సీజన్ కావడంతో..సాధారణంగా చలికాలం అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పులులకు మేటింగ్ (సంభోగం) సీజన్. ఈ సమయంలోనే మగ పెద్దపులి ఆడతోడు కోసం వెదుకుతుంది. దశాబ్దాల క్రితం పులులకు ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో కలియతిరిగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతం వెంట అక్టోబర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన పులి తాజాగా జిల్లాలోకి ప్రవేశించింది.నాలుగేళ్ల క్రితం కూడా ఆడ పులి కోసమే..నాలుగేళ్ల క్రితం జిల్లాలో పెద్దపులి సంచారం కనిపించింది. 2020 నవంబర్‌లో మగపెద్దపులి ఆడతోడు కోసం ములుగు జిల్లా నుంచి కరకగూడెం, ఆళ్లపల్లి, మామకన్ను అటవీ ప్రాంతాలలో సంచరించింది. అక్కడి నుంచి ఇల్లెందు మండలంలో పాండవుల గుట్ట మీదుగా మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించి తిరిగి ఆదిలాబాద్ దిశగా తన ప్రయాణం కొససాగించింది. ఆ సమయంలో జిల్లాలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని, ఆడతోడు కోసమే ఇటుగా వచ్చినట్లు అటవీశాఖ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2022లో మరోసారి పెద్దపులి సంచారం తిరిగి చలికాలంలోనే సాగింది.పూర్వం పులులకు అడ్డాగా..పూర్వం భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, గుండాల, పాండవుల గుట్ట, పూర్వ వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడెం అటవీ ప్రాంతం పెద్దపులుల సంచారానికి అడ్డాగా ఉండేది. 2000 సంవత్సరంలోనూ ఈ ప్రాంతం దట్టమైన అడవులతో అల్లుకుపోయి ఉండేది. పులుల నివాసానికి అనుగుణంగా కనిపించే గుహలు పాండవుల గుట్ట ఏడు బావుల ప్రదేశాల్లో నేటికీ దర్శనమిస్తాయి. ఆ సముదాయాన్ని పులి గుహగా పిలుస్తుంటారు. 2000 సంవత్సరంలో నవంబర్లోనే ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు ప్రచారంలో ఉంది. బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతుకు చెందిన రెండు ఆవులను పెద్దపులి సంహరించింది. గ్రామ సమీపం వరకు దట్టమైన అడవి ఉండటంతో పులి సంచారాన్ని నాడు గిరిజనులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పులుల ఆవాసంగా గుర్తింపు పొందిన పాండవుల గుట్ట అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాల తరువాత అంటే 2020లో, ఆ తర్వాత 2022లో పెద్దపులి సంచరించింది. ప్రస్తుతం మరో రెండేళ్ల తర్వాత తాజాగా మరోసారి పెద్దపులి జిల్లాలోకి ప్రవేశించి పాండవుల గుట్టకు చేరుకునే దిశగా తన ప్రయాణం సాగిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అనుమానించి అప్రమత్తమయ్యారు.అప్రమత్తమైన అధికారులుపెద్దపులి సంచారం జిల్లాలోకి ప్రవేశించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అడవిని ఆనుకొని ఉన్న ములుగు జిల్లా సరిహద్దు గుండాల, ఆళ్లపల్లి మండలాలకు పెద్దపులి చేరుకుందన్న ప్రచారం జరగడంతో జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇల్లెందు మండలం కొమరారం అటవీరేంజ్ పరిధిలో కూడా గాలింపు చేపట్టారు. ఆళ్లపల్లి మండలంతోపాటు అడవికి సరిహద్దున ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాదముద్రలను పరిశీలిస్తున్నారు. పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ములుగు జిల్లాకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు, పాదముద్రల పరిశీలన చేపడుతున్నట్లు కొమరారం రేంజ్ అధికారి ఉదయ్ తెలిపారు. పాండవుల గుట్ట, ఏడు బావుల ప్రాంతంలో నిఘా పెంచామని వివరించారు.కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించిందా..?గుండాల: మూడు, నాలుగేళ్లుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో జాతీయ జంతువు అడుగుజాడలు కనిపిస్తుండగా, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకు ఉండటంలేదు. మళ్లీ పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పులి వచ్చినట్లు ప్రచారం సాగుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. మూడు రోజులపాటు ములుగు జిల్లాలో సంచరించిన పులి మంగపేట, మల్లూరు అటవీ ప్రాంతాల నుంచి సరిహద్దు దాటి జిల్లాలోకి అడుగుపెట్టిందనే సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో గుండాల, ఆళ్లపలి, రేగళ్ల, కాచనపల్లి ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మల్లూరు గుట్టవైపు వెళ్లిందని పేర్కొంటున్నారు. దామరతోగు, రేగళ్ల, మర్కోడు, అడవిరామారం, కొమరారం అటవీ ప్రాంతాల్లోని నీటి కొలను, దారి మార్గాల్లో పులి అడుగుజాడలను గుర్తించే పనిలో ఉన్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పశువుల కాపరులు అడవులకు వెళ్లొద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాడ్వాయి అడవి దాటిన పెద్దపులి దామరతోగు, రేగళ్ల, అడవిరామారం అడవి మార్గంలోని కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
పెద్దపులి ఎక్కడ?
మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు. నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. మంగపేట అటవీశాఖ ఇన్చార్జ్ రేంజ్ అధికారి అశోక్ మరో 20 మంది సెక్షన్, బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. -
మకోడి–సిర్పూర్ రైల్వే ట్రాక్‌పై పెద్దపులి
కాజీపేట రూరల్/ సిర్పూర్ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్ కాగజ్‌నగర్–మకోడి రైల్వే స్టేషన్ల మధ్య అన్నూర్ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్మన్లు చూశారు. ట్రాక్ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్ దట్టమైన ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్ పులి ఆనవాళ్లు ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్ బెంగాల్ టైగర్‌గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు. ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్ లైన్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్ లైన్లో (ఎస్1) సంచరించింది. -
వనాలు వదిలి జనాల పైకి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వన్య మృగాలు వనాలు వదిలి జనాలపైకి పడుతున్నాయి. ఆవులు, మేకలను పులి తినేసి భయపెడుతుండగా, ఏనుగులు, ఎలుగుబంట్లు ఏకంగా మనషుల్నే చంపేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, సీతంపేట, పాతపట్నం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ రకమైన ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీంతో వన్య మృగాలు సంచరిస్తున్న వార్తలు వస్తే చాలు ఈ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం..శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్లు దాడులు చేస్తుండగా, కొత్తూరు, పాలకొండ, భామిని తదితర ప్రాంతాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు మధ్యలో పులులు కూడా సంచరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇదే రకంగా పులి సంచరించగా సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి జిల్లాలోకి ప్రవేశించింది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న ఆక్రమణల వల్లే జంతువులు ఇలా ఊళ్లమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. పులి సంచారమిలా.. » ఒడిశా నుంచి మందస రిజర్వు ఫారెస్టు మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీర ప్రాంతం మీదుగా సంత»ొమ్మాళి వైపునకు చేరుకుంది. ఈ మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ కేశనాయుడుపేటలో పులి తిరిగిందన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు మృతి చెందింది. పులి కారణంగా చనిపోయిందా? మరే జంతువు కారణంగా చనిపోయిందో స్పష్టత లేదు. » కోటబోమ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. సారవకోట మండలం జమ చక్రం, సోమయ్యపేట, అన్నుపురం, వాబచుట్టు, బోరుభద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి పాతపట్నం మండలంలోకి ప్రవేశించింది. బోరుభద్ర, దాసుపురం, గురండి, తీమర, తామర, పెద్దసీదిలో సంచరించింది. తీమరలోని బెండి రామారావు మామిడితోటలో బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను చంపేసింది. » ఇదే సమయంలో ఉద్దానంలో గుర్తు తెలియని జంతువు కూడా తిరుగుతోంది. దాని దాడి ఎక్కువగా ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లోని ఒంకులూరు, మెట్టూరు, కొండపల్లి, అనకాపల్లి, బహడపల్లి, కొండలోగాం గ్రామాల్లో ఈ జంతువు సంచరించింది. పలాస మండలంలో నీలావతిలో రెండు ఆవు దూడలను చంపేసింది. ఇదే కారణమా..? ‘పులులు చాలా అరుదుగా అడవులను వదిల జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మగ, ఆడ పులులు జతకట్టే సమయం కావడంతో తమ జోడు కోసం అవి సాధారణం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంటపొలాలు, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో దాడులు అధికంగా జరిగే అవకాశం ఉంది. వేసవి ఎండలతో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు కూడా అవి జనావాసాల వైపు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైతులు పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లడంతో వాటిని వేటాడేందుకు యత్నిస్తాయి. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో పశువులు, మేకలు, గొర్రెలను మందలుగా ఉంచడంతో వాటిని కూడా వేటాడే అవకాశాలు ఉంటాయి.’ అని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త సుమా » అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు వన్య మృగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. » సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. పులులు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే శివారు ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై శబ్దం చేస్తూ చాకచక్యంగా తిరిగి అడవిలోకి పంపించాలి. » పులి అరుపులు, పాద ముద్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. » పంటల కాపలాకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లాలి. » పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా ఉండాలి. » పశువుల కాపరులు పగలంతా మేత కోసం సంచరించి రాత్రి అటవీ ప్రాంతంలో మందను ఉంచి బస చేస్తుంటారు. » పులులు వాటిని వేటాడేందుకు వస్తుంటాయి. » రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండటం సురక్షితం కాదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇబ్బందికరంగానే ఉంది... మా మండలంలో పులి తిరుగుతుందని పేపర్లు, వాట్సాప్‌లలో చూస్తుంటే భయమేస్తుంది. మేము నిత్యం కొండలు, పంట పొలాలలో మేకలు, గొర్రెలతో మందలు వేసుకుని పడుకుంటున్నాం. మా ఊరికి దగ్గర్లో ఉన్న జమచక్రం, సోమయ్యపేట గ్రామాలలో పులి అడుగులు గుర్తించడంతో ఆయా గ్రామాల నుంచి మందలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. – పల్ల ముఖలింగం, వడ్డినవలస, సారవకోట మండలం.భయం.. భయం.. పులి మా గ్రామ పంట పొలాల్లో తిరగడంతో మాకు భయంగా ఉంది. పశువులు మేతకు తీసుకు వెళ్లడానికి, ఉదయం పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఇప్పటికే ఆవుదూడను తీనేసింది. పులి ఉందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. – మద్ది నారాయణరెడ్డి, పెద్దసీది గ్రామం,పాతపట్నం మండలంఆందోళనకరమే.. పులి సంచరిస్తున్న వార్తలతో ఆందోళనగా ఉంది. మా గ్రామం వైపు పులి వచ్చిందని మాకు తెలియదు, మంగళవారం ఉదయం ఆవుదూడపై దాడి చేయడంతో మాకు పులి వచ్చిందని తెలిసింది. దీంతో పంట పొలాలవైపు వెళ్లాలంటే భయంగా ఉంది. – బండి ఆనంద్,తీమర గ్రామం, పాతపట్నం మండలం -
వైఎస్సార్, అల్లూరి జిల్లాల్లో పులుల సంచారం
లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్‌ఫోన్‌ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు. గ్రామస్తులకు తహశీల్దార్ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్‌బీవోలు మహబూబ్ బాషా, గోపాల్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్‌రోడ్/అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు. లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్ డివిజన్ పాపంపేట సెక్షన్ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు. -
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్‌నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్‌పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
గండిచెరువు సమీపంలో పెద్దపులి సంచారం
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గండిచెరువు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నదనే సమాచారం ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని పంట పొలాలకు వెళ్లారు. వారికి అదే ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కంటబడింది. దీంతో హడలిపోయిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో పులి పాదముద్రలు సేకరించడంతో పాటు, అది సంచరించిన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట అదే ప్రాంతంలో ఓ రైతుకు సంబంధించిన ఎద్దుపై పులి దాడి చేసిందన్న వార్త కూడా రైతుల్లో భయాందోళనలు కలగజేస్తోంది. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి పెద్దపులి సంచారం ఉందని, దేవలూరు వద్ద బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. -
Srikakulam District: సంతబొమ్మాళి మండలంలో పెద్దపులి సంచారం
-
శ్రీకాకుళం: అమ్మో మళ్లీ వచ్చింది.. ‘పెద్దపులి’ అలజడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్ఆర్ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.పులి సంచారంపై అప్రమత్తం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలిఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదుపులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదువ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలివ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలిపంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలిపులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదుపులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి. -
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్ -
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
ఒంగోలు జిల్లాలో పులి సంచారం
-
పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్
సాక్షి,కొమురంభీంజిల్లా: ఆసిఫాబాద్‌లో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కాగజ్‌నగర్ కారిడార్‌లో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఇక్కడ మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్నారు.పులి భయం నెలకొన్ని ఈ 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.గగ్రామాల్లోని వారంతా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పులి ఆచూకీ కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సహాయంతో వేట కొనసాగిస్తున్నారు. తాజాగా పులి దాడిలో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: పులి పంజాకు మహిళ బలి -
దారి లేకనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులుల దాడులు వణికిస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వద్ద మోర్లె లక్ష్మి అనే యువతిపై పెద్దపులి దాడిచేసి చంపేయగా, తాజాగా మరోక్తిపై ఇవాళ దాడి చేసింది. దీంతో.. జిల్లాలో ప్రజలకు మరోసారి పులి భయం పట్టుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు.. రిజర్వు అడవుల్లోని కోర్ ఏరియాలకు వెళ్లే దారిలో రోడ్లు, గ్రామాలు అడ్డుగా ఉండటంతోనే అవి మనుషులపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పులుల దాడిలో నలుగురు మరణించారు.ఈ ప్రాంతం మహారాష్ట్ర– తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్‌లో భాగంగా ఉన్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్‌ల నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. దీంతో మనుషులు–పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నది. నవంబర్–డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన సంచారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని టైగర్ కారిడార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నాలుగైదు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బండికాన, ధాబా గ్రామాల శివార్లలో ఆదివారం పశువులపై ఒక పులి దాడి చేసింది. అది మంగళవారం కూడా అక్కడే సంచరించింది. ఆ తర్వాత ఎకో వంతెన సమీపంలోని ఖిండి దేవస్థానం మీదుగా వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తీసిన వీడియోల్లో వెల్లడైంది. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఓ పెద్దపులి పశువులపై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ నెల 17న నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచి్చన పెద్దపులి.. ఉట్నూరు మండలం చాండూరు గ్రామ శివారులో రాజుల్‌గూడ గ్రా మానికి చెందిన ఓ రైతు ఎద్దుపై దాడి చేసింది. గతంలో పెద్దపులుల సంచారం అంతగా లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పరిధిలోనూ పులి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరగడాన్ని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు స్వాగతిస్తుండగా, ఆయా పరిసర గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి పులులు వెళ్లలేకపోవడం సమస్యగా మారిందని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లలో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడ పులుల తోడును వెతుక్కుంటూ మగ పులులు ఆదిలాబాద్ జిల్లాలోని పులుల కారిడార్లోకి, సమీప గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి.. కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో నాలుగైదు పులులు కనిపించాయి. కవ్వాల్ టైగర్ రిజర్వు అనుకూలమైనా.. కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాలో పులుల శాశ్వత ఆవాసాలకు అనుకూల పరిస్థితులున్నా.. మధ్యలో రోడ్లు, పోడు భూములు, గ్రామాలు ఉండడం వల్ల అవి అక్కడికి చేరుకోలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. టైగర్ రిజర్వుల్లోని కోర్ ఏరియా, పులుల అవాస ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాల తరలింపు జరగకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిందనే అంటున్నారు. కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులోని కోర్ ఏరియాలో ఉన్న పలు గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్¯ అథారిటీ నిర్ణయించింది.ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వులోని రెండు గ్రామాలను బయటకు తరలించగా, మరో రెండు గ్రామాల తరలింపునకు ప్రతిపాదించారు. కేటీఆర్‌లోని మూడు గ్రామాలను మొదటి దశలో, మరో పెద్ద గ్రామాన్ని రెండోదశలో బయటకు పంపించేందుకు ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గ్రామాల తరలింపు పూర్తయితే పులుల స్థిర నివాసానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. -
ఆదిలాబాద్‌లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
-
ఆవును హతమార్చిన పెద్దపులి
నార్నూర్: మండలంలో ని చోర్గావ్ గ్రా మ శివారులో సోమవారం సాయంత్రం తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం ఉట్నూర్ చిన్నునా యక్ తండా, హస్నాపూర్, చాందోరి మీదుగా మండలంలోని గుంజాల శివారుకు చేరుకున్న పెద్దపులి మధ్యాహ్నం నుంచి అదే ప్రాంతంలో తలదాచుకుంది. రాత్రి జైనూర్ లేదా బేల మీదుగా వెళ్లిపోతుందని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ సోమవారం గుంజాల వద్ద ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాయంత్రం చోర్గావ్ శివారులో ఆవుపై దాడి చేసి బాబేఝరి వైపు మళ్లిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
పులి మీ ఎదురుగా ఉంటే.. ఇలా తప్పించుకోండి!
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలిమీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్‌గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి. లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది. ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాందవ్గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట. ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు. ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్‌లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచ్చినప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.చదవండి: ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథగట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప.. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. పైన చెప్పినవన్నీ చేస్తున్న సమయంలో దేవుడిని ప్రార్థించడం మాత్రం మరువద్దు. ఈ టిప్స్ ఫెయిలయినా.. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. అల్ ది బెస్ట్ మరి.. ఓ పులి రేపు రా.. -
అడవికి అదే హీరో! మరి ఎదురుపడితే.. ఇలా చేస్తే సేఫ్‌గా బయటపడే ఛాన్స్
-
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం!