సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్‌లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది.
కళేబరంపై గడ్డి మందు చల్లి..
ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది.
సీన్ రీ కన్‌స్ట్రక్షన్
పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్‌నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది.
పరిహారంలో జాప్యం
కాగజ్‌నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మరో పశువుపై దాడి
రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ రేంజ్ ఉట్‌పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment