
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు.
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో..
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్‌ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు.
చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి.