పొదరిల్లు చేసుకున్నం!  | CM KCR Comments On BJP And Congress At Sirpur Public Meeting | Sakshi
Sakshi News home page

పొదరిల్లు చేసుకున్నం! 

Published Thu, Nov 9 2023 3:56 AM | Last Updated on Thu, Nov 9 2023 8:34 AM

CM KCR Comments On BJP And Congress At Sirpur Public Meeting - Sakshi

బుధవారం సిర్పూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పొదరిల్లుగా మార్చుకున్నామని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఆం్ర«ధాలో కలపడం వల్ల 50ఏళ్లకుపైగా గోసపడ్డామన్నారు.

ఇప్పుడు మళ్లీ ఆ గోస మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అందరూ ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని, లేకపోతే మోసపోయి గోస పడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుము రంభీం జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌తోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రం వచ్చినప్పుడు ఏమీ లేకుండే. సాగు, తాగునీరు లేదు. రైతులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు జరిగేవి. అన్నింటా దళారీ వ్యవస్థ ఉండేది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పోతున్నాం. రాష్ట్రం ఓ పొదరిల్లుగా మారింది. అవినీతి లేని పాలన అందిస్తున్నాం. భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు అందుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించాం.

ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 15 నుంచి 20ర్యాంకులో ఉండేది. ఇప్పుడు నంబర్‌ వన్‌గా మారింది. ఇదంతా మంత్రమో, మాయ చేస్తేనో అయితదా? పట్టుదలతో పనిచేస్తున్నాం. నిజాం స్థాపించిన సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉంది. వంద శాతం రాష్ట్ర వాటా ఉండాల్సిన కంపెనీలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రానికి 49శాతం వాటా ఇచ్చింది. వాళ్లు ఉన్నన్ని రోజులు కంపెనీకి లాభాలు రాలేదు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. కార్మికులకు బోనస్‌లు పెంచాం.  

రాష్ట్రాన్ని జాప్యం చేసి గోస పెట్టింది 
బీఆర్‌ఎస్‌ 24 ఏళ్ల కింద పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించకున్నాం. అంతకుముందు 50ఏళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పాలకులు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గోస పడ్డాం. ఉప్పెనలా ఉధృతంగా ఉద్యమం చేస్తే 2004లో ఎన్నికల ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు కాగానే మాట తప్పింది. మళ్లీ గోస పెట్టింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అన్నట్లు పోరాడితే.. చివరికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. 

ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ ఎందుకని.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్‌ పథకమని అంటున్నారు. భూవివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి లంచం ఇవ్వకుండానే అరగంటలో అయిపోతున్నాయి. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అలా అంటున్నవారినే బంగాళాఖాతంలో వేయాలి. ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది. రైతుబంధు, ఉచిత విద్యుత్‌ ఉండాలంటే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తేనే సాధ్యం.  

వారికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు 
పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నారని గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలే రోజూ లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి అధికారమిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారు. అందుకే ప్రజల కోసం పనిచేసే వారిని, కష్టపడే పార్టీని ఎన్నుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో స్విచ్‌ వేస్తే ఇక్కడ లైటు వెలుగుతుంది. కానీ మాకు తెలంగాణ ప్రజలే బాసులు. 

గిరిజనేతరులకూ పట్టాలిస్తాం 
పారిశ్రామికంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ తెచ్చుకోబట్టే ఆసిఫాబాద్‌ జిల్లా అయ్యింది. గతంలో వానాకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని పత్రికల్లో వచ్చేది. ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీ, వంద పడకలతో ఆస్పత్రి వచ్చాయి. ఆసిఫాబాద్‌లో 47వేలు, సిర్పూరులో 16 వేల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం. గిరిజనేతరులకూ త్వరలో పట్టాలు ఇస్తాం. ఈ విషయంలో కేంద్రం అడ్డంకిగా మారింది. 

ఆలోచించి ఓటు వేయండి 
ఓటు వేసే ముందు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచించాలి. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను విచారించి ఓటు వేయాలి. మీరు వేసే ఓటు వచ్చే ఐదేళ్లు మీ తలరాతను నిర్ణయిస్తుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కులం, మతం లేదు. అందరినీ కలుపుకొని పోతున్నాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. బీఆర్‌ఎస్‌ కంటే ముందు ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ పాలన చేసింది.

ముస్లింల కోసం వాళ్లు రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. మేం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అన్నీ ఆలోచించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి..’’ అని సీఎం కేసీఆర్‌ కోరారు. ఈ సభల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎంపీ వెంకటేశ్‌నేత, తదితరులు పాల్గొన్నారు. ïసీఎం సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. 
 
మరోసారి మొరాయించిన హెలికాప్టర్‌ 
సీఎం కేసీఆర్‌ పర్యటనల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్‌ మరోసారి మొరాయించింది. మూడు రోజుల కింద బీఆర్‌ఎస్‌ సభల కోసం బయలుదేరిన ఆయన హెలికాప్టర్‌లో సమస్య వల్ల ఫామ్‌హౌజ్‌కు వెనుదిరిగి.. మరో హెలికాప్టర్‌ తెప్పించుకుని వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం కాగజ్‌నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం.. అది ముగిశాక ఆసిఫాబాద్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

కానీ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ సభ ముగిసేలోపు పైలట్‌ హెలికాప్టర్‌లో సాంకేతికలోపాన్ని సవరించి ఆసిఫాబాద్‌కు తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ హెలికాప్టర్‌లో బెల్లంపల్లి సభకు హాజరై, తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement