12 లోక్‌సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్‌ | BRS Leader KCR Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

12 లోక్‌సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్‌

Published Thu, Apr 25 2024 5:57 PM | Last Updated on Thu, Apr 25 2024 5:57 PM

BRS Leader KCR Fires On Congress Govt

హామీలన్నీ అమలు చేసేదాకా సర్కారును వెంటాడుతాం..: కేసీఆర్‌ 

ఐదెకరాలకే రైతుబంధు అంటూ దగా... రైతు బీమా ఉంటుందో, లేదో...

నీళ్లు ఇవ్వడం లేదు.. కరెంటు సరిగా రావడం లేదు.. 

ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది? పింఛన్ల పెంపు ఏది? 

నన్ను తిట్టినా సరే.. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే వదలను 

మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌ షోలలో మాజీ సీఎం ప్రసంగం 

బస్సు యాత్ర షురూ... రైతులతో మాటామంతీ.. నేడు భువనగిరి రోడ్‌ షో  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్‌ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్‌షోలలో కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్‌ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్‌సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. 

పంటలు ఎండటం ఇదే మొదటిసారి 
బీఆర్‌ఎస్‌ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్‌ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్‌లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్‌ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్‌.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్‌ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? 

రైతులకు అన్యాయం 
జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.

అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్‌ఎస్‌ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. 

ధాన్యం ఎందుకు కొనడం లేదు? 
తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. 

ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. 
నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్‌ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్‌ ప్ర­భు­­త్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్‌ టెయిల్‌ పాండ్‌ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్‌ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. 

తులం బంగారం ఏమైంది? 
మా హయాంలో రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్‌ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్‌ నిలదీశారు. 

కేసీఆర్‌ కాన్వాయ్‌లో వాహనాలు ఢీ 
మిర్యాలగూడ టౌన్‌: కేసీఆర్‌ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్‌ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వా­య్‌లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొ­న్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

కేసీఆర్‌ భయపడతడా? 
‘‘నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్‌ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్‌ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ 

తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. 
లోక్‌సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్‌ 
సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్‌తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్‌ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్‌.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్ర­కు బయలుదేరారు.

మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభి­వాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోట­ల్‌ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్‌ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. 

నేడు భువనగిరిలో రోడ్‌ షో 
బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్‌ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్‌ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్‌ బస్సు యాత్ర సాగనుంది.  

రైతులతో కేసీఆర్‌ మాటా మంతీ 
నల్లగొండ రూరల్‌: కేసీఆర్‌ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. 
అన్నెపర్తి వద్ద.. 
రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్‌.. 
కేసీఆర్‌: ఎందుకు.. ఏమైంది? 
రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్‌ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. 
కేసీఆర్‌: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్‌ అరవింద్‌రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు)  మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్‌. ఐకేపీ సెంటర్‌లో బాధలు చూడాలి సార్‌. 
కేసీఆర్‌: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్‌రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. 

ఆర్జాలబావి వద్ద.. 
రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్‌ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్‌. 
కేసీఆర్‌: ధాన్యం కొంటలేరా? 
రైతు: కొంటలేరు సార్‌. ఎండకు చస్తున్నాం. 
కేసీఆర్‌: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement