సాక్షి, ఆదిలాబాద్: ‘‘ఇప్పటి ఎన్నికల తీరు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కోట్లు గుమ్మరిస్తుండ్రు, దీంతో ఓటర్లు కూడా అలానే తయారయ్యారు. ఎవరు ఎంత ఇస్తుండ్రు అని చూస్తుండ్రు తప్పా అభిమానం అనేది పూర్తిగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఎన్నికల ప్రచారానికి లెక్క లేనంతగా ఖర్చు పెడుతుండ్రు.
మా అప్పటి ఎన్నికల తీరుకు ఇప్పటి ఎన్నికల తీరుకు చాలా మార్పు వచ్చింది. 1985 ఎన్నికల్లో నేను రూ.10వేలు మాత్రమే ఖర్చు చేశాను..’’ అని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్‌నాయక్ అన్నారు. అప్పటి, ఇప్పటి ఎన్నికల తీరుపై గోవింద్‌నాయక్ ‘సాక్షి’తో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే..
అభిమానంతో ఓటేసేవారు..
నేను మొట్టమొదటిసారి 1977లో ఖానాపూర్ నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశాను. అప్పుడు ఎన్నికలపై ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఆ సమయంలో నేను ఓడిపోయాను. రెండోసారి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాను.
అప్పుడు నేను ఎన్నికల కోసం ఖర్చు చేసింది రూ.10వేలు మాత్రమే. ఇదీ ఓటర్లకు పంచేందుకో, మరో దేనికో కాదు. గ్రామాల్లో తిరిగేందుకు ప్రయాణ ఖర్చులు, గోడలపై రాతలకు మాత్రమే. నేనే ద్విచక్ర వాహనంతో ఎక్కువగా పర్యటించేవాణ్ని. ఎందుకంటే గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు ఉండేవి కాదు. పెద్ద పెద్ద వాహనాలు లేవు. ఓటర్లు కూడా అభిమానంతో ఓటేసేవారు తప్పా నయా పైసా ఆశించేవారు కాదు.
1994లో రూ.లక్ష మాత్రమే..
రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేశాను. అప్పుడు కూడా ఇప్పటితో పోల్చుకుంటే చాలా తక్కువే. కేవలం లక్ష రూపాయలు అయ్యింది. మేము కూడా జనం కోసం అలా పని చేసి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాం. ప్రజలంతా కూడా మా పై ఉన్న అభిమానంతో మాకు ఓటేసి గెలిపించుకునేది. వారి కోసం మేము పనిచేసేది. నిత్యం ప్రజల మధ్య తిరిగేటోళ్లం. ఖానాపూర్ నియోజకవర్గం చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాలకు విస్తరించింది. దీంతో ప్రచారం చేయడం అభ్యర్థులకు కష్టమే.
2004లో రూ.10లక్షలకు పెరిగింది..
నేను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశాను. మొదట 1985 పోటీ చేసిన సమయంలో ప్రచార ఖర్చు రూ.10వేలు అయితే రెండోసారి 1994లో రూ.లక్ష, ఇక మూడోసారి 2004లో మాత్రం రూ.10లక్షల వరకు పెట్టాను. అంతే తప్పా ఇప్పటిలా కోట్లు ఖర్చు పెట్టలేదు.
పోలింగ్ ఏజెంట్‌కు రూ.10 మాత్రమే..
ఎన్నికల రోజున పోలింగ్ సమయంలో ఏజెంట్‌గా వ్యవహరించే వారికి రూ.10 ఇచ్చేది. అది నాకు బాగా గుర్తుంది. నేను రాజకీయంగా ప్రజల ఆదరాభిమానాలు పొందాను. అదే నాకు చాలా సంతోషం. ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు నన్ను మరిచిపోరు. అభిమానంతో నన్ను గెలిపించుకున్నారు.
నేను కూడా ప్రజలకు అదే తీరుగా పనిచేశాను. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొందరు సంపాదించుకుంటారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు. మా తాతలు, తండ్రుల నుంచి వచ్చిన కొన్ని ఆస్తులు అమ్మేశాను తప్పా కొనలేదు. వయస్సు పైబడడంతో ప్రస్తుతం స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఇంటి వద్ద ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. - మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment