సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు పడతాయి.. స్వతంత్రులు ఏమైనా ఓట్లు చీలుస్తారా.. అక్కడ మనకు ప్లస్సా.. మైనస్సా.. ఇలాంటి లెక్కలు వేస్తున్నారు.
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థులు ఎన్నికల సంగ్రామం నుంచి కొంత సేద తీరినట్టే తీరి.. మరో పక్క ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ బూత్‌ల వారీగా పరిస్థితిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. మండలం, గ్రామం, పట్టణం, వార్డు ఇలా అన్నీ స్థాయిల్లో ఆయా పోలింగ్ బూత్‌ల వారీగా క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడవచ్చు.. మన పరిస్థితి బాగుందా.. లేదా.. ఇలా లెక్కల్లో మునిగితేలారు.
మహిళల ఓట్లే అధికంగా పోల్..
పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా పోలయ్యాయి. ఈ లెక్కన అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళల ఓట్ల శాతం కీలకం కానుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మహిళా ఓట్లే అధికంగా పోలయ్యాయి. కాగా, జిల్లాలో బోథ్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 177 బాబ్‌జీపేట్‌లో వంద శాతం ఓటింగ్ జరిగింది. జిల్లాలో వందశాతం ఓటింగ్ జరిగిన బూత్ ఇది ఒక్కటే కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ బీసీ (బాలుర) కళాశాల వసతి గృహంలోని పోలింగ్ కేంద్రంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 47.86 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 1,85,862 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,65,793 ఓట్లు పోల్ కాగా బీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న 44.56 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాల్సిందే. బోథ్ నియోజకవర్గంలో 1,72,397 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,54,487 ఓట్లు పోల్ కాగా, అప్పుడు బీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 38.19 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. మొత్తంగా రిజల్ట్స్ డేకు ఒకరోజు మాత్రమే వ్యవధి ఉండగా అందరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పోలైన ఓట్లు:
-మొత్తం ఓటర్లు: 4,48,374,
-పోలైన ఓట్లు: 3,58,259,
-శాతం: 79.86%
పురుషులు, మహిళల ఓట్ల వివరాలు:
► పురుషుల ఓట్లు: 2,19,291
పోలైన ఓట్లు: 1,77,597
శాతం: 80.96%
► మహిళల ఓట్లు: 2,29,074
పోలైన ఓట్లు: 1,80,661
శాతం: 78.86%
ఇవి చదవండి: కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతారా?
Comments
Please login to add a commentAdd a comment