సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్/జనగామ: ‘సాగునీటి శాఖ మంత్రులుగా ఐదేళ్లు మామ ఉన్నడు.. మరో ఐదేళ్లు అల్లుడున్నడు. మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత–చేవెళ్ల అన్యాయానికి గురైంది. ఉమ్మడి ఆదిలాబాద్ మళ్లీ ఎడారైంది. మనకు నీళ్లు రాకపోవడానికి, నిర్మల్‌లో చెరువులు కబ్జాలు కావడానికి ఈ కేసీఆర్ సర్కారు కారణం కాదా.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తాం..’అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పా రు. బుధవారం నిర్మల్, బోథ్, జనగామలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి, ఈ ప్రాంతంలో 1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నం చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టిని మార్చి, కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారని విమర్శించారు.
రూ. 38 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట అంచనాలు పెంచి రూ.1.51 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన తమ్ముడు కలిసి కబ్జాలు చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక కూటమిగా వ్యవహరిస్తున్నాయని, సీపీఐ, జనసమితితో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొడంగల్ ఎలా అభివృద్ధి చేస్తానో అదే స్థాయిలో నిర్మల్‌నూ అభివృద్ధి చేస్తామన్నారు.
గడీల రాజ్యాన్ని కూల్చకుంటే మళ్లీ నిజాం పాలన
‘సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణలోని పరిపాలన భవన్ అయిన ప్రగతి భవన్‌లోకి ప్రజల ఎంట్రీ లేనప్పుడు ఆ ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చినా తప్పులేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గద్దరన్న ప్రగతి భవన్‌కు వెళ్తే గేటువద్ద నిలిపేశారని చెప్పారు. రాష్ట్రం కోసం పాటుపడిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా ప్రతినిధులు, కామ్రేడ్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలకు స్థానంలేని దొర గడి (ప్రగతి భవన్)లోకి ఆంధ్ర పెట్టుబడి దారులకు ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతున్నారన్నారు. గడీల రాజ్యాన్ని కూల్చకుంటే మరోసారి నిజాం పాలన చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కామారెడ్డి తీర్పుతో దేశ రాజకీయాల్లో కీలకమార్పులు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పుతో దేశ రాజకీయ చరిత్రలో కీలక మార్పులు జరుగుతాయని, తీర్పు కోసం తెలంగాణ ప్రజలతోపాటు 140 కోట్ల మంది దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ మాట్లాడుతూ... తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల కుటుంబ చీడను వదిలించుకునే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కరెంటు 24 గంటలు ఇస్తున్నట్లు రుజువు చేస్తే తాను రెండు చోట్లా పోటీ నుంచి తప్పుకుంటానని, లేదంటే సీఎం ముక్కునేలకు రాయాలన్నారు.
నాడు కేసీఆర్‌కు కారులో డీజిల్ పోసే పరిస్థితి లేదని, ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. గజ్వేల్‌లో రూ.వెయ్యి కోట్లతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించుకుంటే, తనయుడు కేటీఆర్ రూ.2వేల కోట్లతో జన్వాడ, పంజగుట్టలో విలాసవంతమైన భవనాలను నిర్మించుకుని పేదల గూడును విస్మరించారని మండిపడ్డారు. అలాగే స్లిప్పర్ల మీద తిరిగిన హరీశ్‌రావుకు ఆస్తులు ఎట్ల వచ్చాయో చెప్పాలని డిమాండ్‌చేశారు.
కవితకు బెంజి కార్లు, పెద్ద పెద్ద భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. మైనారిటీ నాయకుడు షబ్బీర్‌ను ఓడించేందుకు కేసీఆర్ కామారెడ్డికి వచ్చాడన్నారు. అందుకే కేసీఆర్‌ను బొందపెట్టాలని తాను పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తనను ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తిగా చిత్రీకరించేందుకు కేసీఆర్ మామ, ఒవైసీ అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
వలంటీర్ వ్యవస్థను తెస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థను తెస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. ఏ బూత్‌లో ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ బూత్ వాళ్లతో కలసి భోజనం చేస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు యూసుఫ్ అలీ, ఈరవత్రి అనిల్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment