బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్‌ఎస్ అధినేత
సాక్షి, హైదరాబాద్: తుంటి ఎముక సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొనేందుకు గత రెండు విడతల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నివాళులు అర్పించనున్నారు.
మరోవైపు పార్టీ మారిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. అలాగే జాబ్ కేలండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో గళం వినిపించనుంది. చేనేత కార్మీకుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షల వల్ల రైతులకు జరుగుతున్న నష్టం తదితరాలను కూడా ప్రస్తావించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీకి బీఆర్‌ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు.
నేడు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీ...
అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళవారం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment