telangana budget sessions
-
అసెంబ్లీకి వెళ్లనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తుంటి ఎముక సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొనేందుకు గత రెండు విడతల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో నివాళులు అర్పించనున్నారు. మరోవైపు పార్టీ మారిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే జాబ్ కేలండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో గళం వినిపించనుంది. చేనేత కార్మీకుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షల వల్ల రైతులకు జరుగుతున్న నష్టం తదితరాలను కూడా ప్రస్తావించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీకి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ... అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళవారం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
బడ్జెట్ సమావేశాల్లో జాబ్ కేలండర్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో జాప్యంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇకపై అలా జరగకుండా యూపీఎస్సీ తరహాలో ఏటా ప్రణాళికాబద్ధంగా కేలండర్ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ప్రతి ఖాళీని మార్చి 31లోగా తెప్పించుకుని జూన్ 2లోగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ఎన్ని ఖాళీలున్నా డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి ఏటా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ఎంపికయ్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో అర్హులకు సింగరేణి సంస్థ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ కార్యక్రమంలో 2023 సివిల్స్ విజేతలు, 2024లో మెయిన్స్ రాసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిరుద్యోగుల బాధ నా కళ్లతో చూశా.. ‘రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి పాధాన్యత. మా ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన తర్వాత 90 రోజుల్లోగా 30 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. దీనిని బట్టి మా ప్రభుత్వ ప్రాధాన్యతను నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో ఏ నోటిఫికేషన్ పరీక్షలు కూడా నిర్దేశిత సమయానికి జరగలేదు. ఉజ్వల భవిష్యత్తు ఆలోచనలతో యువత అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే సంవత్సరాల తరబడి పరీక్షలు వాయిదా పడ్డాయి. తీరా పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేసరికి ప్రశ్నపత్రాల లీకు వ్యవహారంతో నిరుద్యోగులు పడిన బాధ, భావోద్యేగాన్ని నా కళ్లతో చూశా. దీంతో యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి దాని తరహాలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాం. యూపీఎస్సీ తరహాలో వెనువెంటనే నోటిఫికేషన్లు ఇచ్చాం. గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాం. గ్రూప్–2 పరీక్షలు గ్రూప్–3తో కలిపి నవంబర్, డిసెంబర్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. మా ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఏ సంస్థపైనా ఎలాంటి ఆరోపణలూ రాలేదు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే ప్రభుత్వం వారిని వ్యక్తిగతంగా కలుస్తుందని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనే సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. నిరుద్యోగ యువతలో నమ్మకం, విశ్వాసం కల్పించడం మా బాధ్యత..’అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర కొలువులపైనా దృష్టి పెట్టాలి ‘నిరుద్యోగ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ వంటి వాటిపై సైతం దృష్టి సారించాలి. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణ కేడర్‌ను తీసుకుని రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు పోస్టుల్లో తెలంగాణ యువత ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాష్ట్రానికి నిధులు, ఇతర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపేటప్పుడు అక్కడ తెలంగాణ అధికారులు ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటే లక్ష్యం: భట్టి సివిల్స్ తరహా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం వ్యయ ప్రయాసలతో కూడిన అంశమని, సీఎం రేవంత్ చొరవతో.. అలాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి తరఫున దీనిని చేపట్టడం అభినందనీయమన్నారు. 2023లో రాష్ట్రం నుండి సివిల్స్‌కు ఎంపికైన 35 మంది అభ్యర్థులను, ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మామా అల్లుళ్లు రాష్ట్రాన్ని చెదలు పట్టించారు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్ట్‌ల పేరుతో దోచుకున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారు. రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారమని అప్పుడే నిపుణులు చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది. 14 పేజీలతో రిటైర్డ్ ఇంజినీర్లు ఈ నివేదిక ఇచ్చారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన. మేడిగడ్డ వద్దే ప్రాజెక్ట్‌లు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజానీకానికి కళంకంగా మారింది. దోచుకోవాలని దాచుకోవాలనే ఆలోచనతోనే మేడిగడ్డ కట్టారు కూలిన ప్రాజెక్ట్‌ను చూసి మీరు సిగ్గుపడాలి. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తుంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది కూడా మేమే. తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు, కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లు నియమించుకున్న ఇంజినీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్ట్ కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు. మేడిగడ్డ మేడిపండేనా సాక్షిలో కథనం కూడా వచ్చింది. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. కాళేశ్వరంతో చేవేల్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. నేడు ఇదే సభలో హరీష్ అబద్దాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సెలైంట్‌గా చూస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు సాగు నీటి మంత్రిగా కొనసాగి.. ఆ తరువాత హరీష్‌ను ఎందుకు బర్తరఫ్ చేశారు. విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ విమర్శలు చేశారు. -
హరీష్ రావు Vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖపై అధికార కాంగ్రెస్ నేతలు వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడుస్తోంది. మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సభలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్ఆర్ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. ►బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్‌కే ఇవ్వాలి. ►30 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్‌ది సెల్ఫ్‌గోల్. కాగ్ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కాగ్ రిపోర్ట్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్ నివేదిక తప్పులతడక అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాగ్ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ►రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ►ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది. ►రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్కరోజే కాళేశ్వరానికి..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌లను కొనసాగించారు. 81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు. మొత్తం ఖర్చు 54,234కోట్లు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు. 2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు. పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. ►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది. ►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది. ►అన్నారం బ్యారేజ్‌లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు. ►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది. ►అక్టోబర్‌లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం. ►ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది. ►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు. ►గత ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది. ►కడెం ప్రాజెక్ట్‌ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది. ►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. ►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్‌లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్‌లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది. ►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్‌లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్‌తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు. రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది. 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు. తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు. 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్‌ను తొలగించలేదు. పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్‌రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్‌కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్‌పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్‌ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్‌పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్‌పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్‌పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్‌పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్‌పై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు -
రేపే తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకు ముందు.. ఉదయం 9గం. ప్రాంతంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో.. ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండవు. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు. రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఖర్చుల కోసం తీసుకునే మొత్తం ఇది. -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఈనెల 6వ తేదీన బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ 03:30PM తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 1:35PM ముగిసిన బీఏసీ సమావేశం రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఈనెల 6వ తేదీన బడ్జెట్. 8వ తేదీన బడ్జెట్‌పై చర్చ 12:45PM ముగిసిన గవర్నర్ తమిళసై ప్రసంగం ►కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళసై హరితహారం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచాం పరిశ్రమలు ఐటీ ద్వారా 3.31 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు 20 జిల్లాల్లో డయాగ్నెస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశాం వరంగల్‌లో రూ. 1100 కోట్లతో 2 వేల బెడ్స్ సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం తెలంగాణలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం 203 మైనారిటీ గురుకల పాఠశాలలు ఏర్పాటు ఇప్పటివరకూ 12.5 లక్షల మందికి షాదీ ముబారక్ ఇప్పటివరకూ 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశాం ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చాం గత ఎనిమిదేళ్లలో 2,21, 774 ఉద్యోగాలను భర్తీ చేశాం రూ. 7,289 కోట్లతో మన ఊరు-మన బడి కింద స్కూళ్ల అభివృద్ధి మన ఊరు-మన బడి ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి బతుకమ్మ ఫెస్టివల్ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి నేతన్నలకు రూ. 5లక్షల బీమా పథకం సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ రాష్ట్ర జీఎస్డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నది తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది దళితబంధు విప్లవాత్మకమైన పథకం ప్రతి దళితుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నాం పేదలకు చేయూతగా ఆసరా పథకం.. ఆసరా పథకం లబ్ధిదారుల వయస్సు 57కు తగ్గించాం ఎస్టీల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాం 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుంది తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నాం ► తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్‌కు హాల్లోకి స్వాగతం పలికారు. తెలంగాణ 2023-2024 వార్షిక బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో.. శాసనసభ హాల్లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ►గవర్నర్ చదవాల్సిన ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ►శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ చాంబర్లలో వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలు (బీఏసీలు) సమావేశమవుతాయి. ఇందులోనే అసెంబ్లీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుంది? ఎజెండా ఏమిటనేది ఖరారవుతుంది. ► శుక్రవారం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడే సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 14 వరకు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నూతనంగా ఉండేది భవనమే.. బడ్జెట్ కాదు!
నూతనంగా ఉండేది భవనమే.. బడ్జెట్ కాదు! -
ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పుడుతోంది: హరీష్ రావు
అప్డేట్స్: ►సీఎం కేసీర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పడుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారని, తెలంగాణలోని పల్లెలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యిందన్నారు. కాంగ్రెస్ హయాలంలో ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. గ్రామాభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ►బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రతీ ఏడాది బడ్జెట్పెంచుకుంటూ పోతున్నారని, అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని, పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కార్పొరేట్ బడ్జెట్ కాదన్నారు.. బడ్జెట్ ద్వారా పేదలకు ఏం దక్కిందని ప్రశ్నించారు. మల్టీజోన్ వారీగా మొత్తం ఖాళీలు: 13, 170 ► మల్టీ జోన్-1: 6,800 ► మల్టీ జోన్-2: 6,370 ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి వివరాలు: ► ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం ► ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు ► ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు ► దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు ► ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు ► హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు జోన్ల వారీగా ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు (18,866) జోన్-1 కాళేశ్వరం: ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. - 1,630 జోన్-2 బాసర: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. - 2,328 జోన్-3 రాజన్న-సిరిసిల్ల: కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. - 2,403 జోన్-4 భద్రాద్రి: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ. - 2,858 జోన్-5 యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ. - 2,160 జోన్-6 చార్మినార్: మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. - 5,297 జోన్-7 జోగులాంబ: మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు. - 2,190 ► వైద్య ఆరోగ్య శాఖ- 12,755, బీసీ సంక్షేమ శాఖ- 4,311 ► నీటిపారుదల శాఖ-3,692, ఎస్సీ సంక్షేమ శాఖ-2,879 ► ట్రైబల్ వెల్ఫేర్-2,399 పోస్టుల భర్తీ ► రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 7వేల కోట్ల అదనపు భారం పడనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ► ఉన్నత విద్యాశాఖ -7,878, రెవిన్యూ శాఖ-3,560 ► పోలీసు శాఖలో 18,344 పోస్టుల భర్తీ ► విద్యాశాఖలో 13,086 పోస్టుల భర్తీ ► అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ► అటెండర్ నుంచి ఆర్డీవో పోస్టు వరకు స్థానికులకే వర్తింపు ► 5 శాతం ఓపెన్ కోటలో పోటీ పడొచ్చు: సీఎం కేసీఆర్ ► 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజ్: సీఎం కేసీఆర్ ►విద్యాశాఖలో 25 నుంచి 30వేల వరకు పోస్టులు తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ► తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 ఉన్నాయని.. వాటికి నేటి నుంచి నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ► జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగాల ఖాళీలు, మల్టీజోన్ స్థాయిలో 13,170 ఉద్యోగాల ఖాళీలు, ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8174 ఉద్యోగాల ఖాళీలు నోటిఫైచేశామని చెప్పారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 80,039 అని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ► గ్రూప్-1పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1373, గ్రూప్-4 పోస్టులు 9168, జిల్లా స్థాయిలో 39829 ఉద్యోగాల ఖాళీలు, లక్ష 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ► తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. రాజకీయాలంటే వేరే పార్టీలకు గేమ్.. టీఆర్ఎస్కు ఒక టాస్క్ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమం చేపట్టామని చెప్పారు. ► తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. ► రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ► ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు శుభవార్త వినిపిస్తానన్నారు. లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీల భర్తీ ప్రకటించే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ 2022–23 రెండోరోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత.. స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సమావేశాలకు విరామం ప్రకటించారు. కాగా బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ చేపట్టకుండానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం అవుతుంది. ఇలావుండగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం సభకు సమర్పిస్తారు. -
సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..? కీలక ప్రకటనపై ఉత్కంఠ..
సాక్షి, హైదారబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ 2022-2023 రెండోరోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. జాబ్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కొన్న విషయం తెలిసిందే. వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం 1,92,800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఇప్పటికే 1.32 లక్షల కొలువులు భర్తీ చేశామన్న సర్కారు -
దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నేడు(మార్చి 16న) దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు. చదవండి: (విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేనన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదని,. నోముల నర్సింహయ్య తనకు వ్యక్తిగతంగాదగ్గరి మిత్రులని పేర్కొన్నారు. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు పని చేశామని, తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని నర్సింహయ్య హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు. అనంతరం సభ వాయిదా పడింది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పనున్నారు.18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ‘నాడు ఆకలి చావులు, ఆత్మహత్యలతో అల్లాడిపోయిన తెలంగాణలో నేడు జీవకళ తొణికిసలాడుతున్నది. దండగ అన్న చోటే వ్యవసాయం ఆశావహంగా మారింది. కాగితాలకు పరిమితమైన ప్రాజెక్టులు నేడు సాకారమై సాగు నీటిని అందిస్తున్నాయి. నాటి బీడు పొలాలు నేడు తరి పొలాలై తరిస్తున్నాయి. విద్యుత్ కోతల విపత్తులు అదృశ్యమై రాష్ట్రం వెలుగులీనుతోంది. గుక్కెడు నీటి కోసం గోసపడిన నేలపై నేడు ఇంటింటికీ నల్లాల ద్వారా ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల మీద పోయిన విశ్వాసం తిరిగి పెరుగుతున్నది. నాడు అందని ద్రాక్షలా ఉన్న నాణ్యమైన విద్య పైసా ఖర్చులేకుండా పేద పిల్లలకు లభిస్తోంది. ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం చేస్తుంటే పెళ్లి మండ పాల్లో మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. నాడు తక్కువ వేతనాల కారణంగా అర్ధాకలితో అలమటించిన క్షేత్రస్థాయి ఉద్యోగులకు నేడు గౌరవప్రద వేతనాలు గ్యారంటీగా లభిస్తున్నాయి. నిన్నటివరకూ పాలు, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, పండ్లు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కాగా నేడు ఎగుమతి చేసే దిశగా పురోగమిస్తున్నాం. నాడు మూతపడుతున్న పరిశ్రమలు, నేడు తరలివస్తున్న పరిశ్రమలు. నాడు నిత్యం కర్ఫ్యూలు, నేడు ప్రశాంత జనజీవనం. ఇదీ ఆనాటి తెలంగాణకు, ఈనాటి తెలంగాణకు ఉన్న వ్యత్యాసం’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆమె రాష్ట్ర శాసనసభలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న వివక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఏడేళ్లలో సాధించిన పురోగతిని ఆమె వివరించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు గవర్నర్ మాటల్లోనే... దేశానికి మార్గదర్శి గాఢాంధకారాన్ని బద్ధలు కొడుతూ పొడిచిన తొలి పొద్దులా, ఆరు దశాబ్దాల చీకటిని చేధిస్తూ ఏడేళ్ల కింద తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు శైశవ దశలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించి దేశానికి దారి చూపే మార్గదర్శిగా నిలిచింది. రాష్ట్రం నేడు గెలిచి నిలిచి... విమర్శకులు నోళ్లు వెళ్లబెట్టుకునేలా చేసింది. వలసవాద కుట్రలతో కుదేలైన రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణను పురోగామి రాష్ట్రంగా మార్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలో మూడోస్థానానికి ఎదగడం రాష్ట్ర పురోగతికి ప్రబల నిదర్శనం. తలసరి ఆదాయం రెట్టింపు వార్షిక ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014–19 వరకు 17.24 శాతం వృద్ధిరేటు సాధించింది. 2013–14లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.4,51,580 కోట్లు అయితే, 2019–20లో 114.71 శాతం వృద్ధితో రూ.9,69,604 కోట్లకు పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం రూ.1,12,162 నుంచి రూ.2,28,216కు పెరిగింది. 2020–21లో జీఎస్డీపీ రూ.9,78,373 కోట్లుగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉంటుందని అంచనా. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా కోలుకున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన భారత ఆర్థిక సర్వే 2020–21లో ప్రశంసించారు. కొత్త వెలుగులు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నూతన చరిత్ర లిఖించింది. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,245 మెగావాట్లకు పెరిగింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 13,900 ఎంవీఏ నుంచి 37,000 ఎంవీఏకు పెరిగింది. రూ.32,500 కోట్లతో ఇంటింటికీ తాగునీరు మిషన్ భగీరథతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ విరగడైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేళ్లలో రూ.32,500 కోట్లను ఖర్చు చేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. 24,543 ఆవాస ప్రాంతాల్లో 57,26,804 నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికీ రోజూ రక్షిత నీరు సరఫరా అవుతోంది. మిషన్ కాకతీయ పేరుతో 45 వేల చెరువులను పునరుద్ధరించే మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 342 టీఎంసీల నిల్వకు రిజర్వాయర్లు తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలనే మహా సంకల్పంతో ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఆనాడు సమైక్య పాలకులు గోదావరిపై ప్రతిపాదించిన రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 11.43 టీఎంసీలు కాగా, తెలంగాణ ప్రభుత్వం 227.77 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2014 తర్వాత నా ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 342.21 టీఎంసీలు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతల పథకాలు దాదాపు పూర్తికావొచ్చాయి. రైతులే మాకు ముఖ్యం ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల, విప్లవాత్మక చర్యలతో వ్యవసాయ రంగం ఆశాజనకంగా మారింది. నా ప్రభుత్వానికి వ్యవసాయానికి మించిన ప్రాధాన్యం మరొకటి లేదని, రైతు బాగోగులే మాకు ముఖ్యమని, వ్యవసాయ రంగాభివృద్ధికి మరింత పట్టుదలతో కృషి కొనసాగుతుందని ప్రకటిస్తున్నా. ఎకరానికి రూ.10 వేల రైతుబంధు, 5 లక్షల రైతు బీమా, సాగునీరు, విద్యుత్ సదుపాయాలతో నేడు రాష్ట్రంలో రైతులు బంగారు పంటలను పండిస్తున్నారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాల నుంచి 2.10 కోట్ల ఎకరాలకు (రెండు సీజన్లలో కలిపి) పెరిగింది. దిగుబడి 2.05 కోట్ల టన్నుల నుంచి 4.11 కోట్ల టన్నులకు పెరిగింది. సంక్షేమంలో అగ్రగామి సంపద పెంచాలి– పేదలకు పంచాలి.. అనే స్ఫూర్తితో రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు పెంచింది. వికలాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.3,016కు పెంచింది. బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కొత్తగా రూ.2,016 పెన్షన్ అందిస్తోంది. రాష్ట్రం వచ్చినప్పుడు 29,21,828 మందికి పెన్షన్లు లభిస్తుండగా.. ఇప్పుడు 39,36,521 మందికి ఇస్తున్నాం. పెన్షన్లపై వార్షిక వ్యయం రూ.860 కోట్ల నుంచి రూ.8,710 కోట్లకు పెరిగింది. త్వరలో భూముల డిజిటల్ సర్వే.. భవిష్యత్తులో భూ హద్దుల వివాదాలు తలెత్తకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములన్నింటికీ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా, వక్రీకరణకు వీలులేని కోఆర్డినేట్స్ ఇవ్వనున్నాం. ధరణి పోర్టల్, కొత్త రిజిస్ట్రేషన్ల విధానంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైద్య సదుపాయాలు మెరుగు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను గణనీయంగా పెంచింది. 17 వేల నుంచి 23,450కు బెడ్ల సంఖ్య, 254 నుంచి 11,758కు ఆక్సిజన్ బెడ్ల సంఖ్య, 100 నుంచి 1484కు వెంటిలేటర్ బెడ్లు, 3 నుంచి 49కి డయాలసిస్ సెంటర్లు, 4 నుంచి 29కి ఐసీయూలు, నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లను 18 నుంచి 42కు, బ్లడ్ బ్యాంకుల సంఖ్య 18 నుంచి 31కి పెంచింది. మూడు చోట్లలో కిడ్నీ, రెండు చోట్లలో లివర్, రెండు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లను, 22 వైరాలజీ ల్యాబ్‌లను, 25 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నగరానికి మరో మణిహారం..ఆర్ఆర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో కేంద్రం నుంచి రీజినల్ రింగ్ రోడ్డును సాధించింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్, షాద్‌నగర్ పట్టణాల మీదుగా వలయాకారంలో.. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్కు 30 కి.మీల అవతల 348 కి.మీల పొడవున ఈ రోడ్డు నిర్మాణం కానుంది. రాష్ట్రానికి మరో వరంలా, హైదరాబాద్ నగరానికి మరో మణిహారంగా ఈ రోడ్డు మారనుంది. ఐటీ ఎగుమతులు ః రూ.1.40 లక్షల కోట్లు! టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 15,252 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 15.51 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఈ పరిశ్రమలతో లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 250 కొత్త ఐటీ కంపెనీలు వచ్చాయి. 2020–21లో రాష్ట్రం నుంచి రూ.1.40 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగనున్నాయని నాస్కామ్ అంచనా వేసింది. అభివృద్ధి, సంక్షేమ యజ్ఞాన్ని కొనసాగిస్తాం ‘ఇది నా ప్రభుత్వం సాధించిన అద్భుత అభివృద్ధి వికాసం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అనేక రంగాల్లో వినూత్న పథకాలను అమలు చేస్తోంది. ప్రగతి ఫలాలను ప్రజలకు అందిస్తూ దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాల్లో మొదటి వరుసలో నిల్చున్నదని కేంద్ర ప్రభుత్వం అనేక నివేదికల ద్వారా అనేక పర్యాయాలు ప్రకటిస్తూ వస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలెన్నో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ అభివృద్ధి, సంక్షేమ యజ్ఞాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని, సామాజిక దొంతరలో అట్టడుగున ఉన్న బిడ్డలకు ప్రగతి ఫలాలు ప్రాధాన్యతగా అందించే విధంగా మానవీయ దృక్పథంతో మరిన్ని చర్యలు చేపడతామని, ఈ లక్ష్య సాధనకు నా ప్రభుత్వం పునరంకితమవుతుందని తెలియజేస్తున్నాను’అని గవర్నర్ ప్రకటించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తొలిరోజు సమావేశానికి హాజరయ్యారు. చదవండి: (సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చా: మంత్రి కేటీఆర్) -
తెలంగాణ అసెంబ్లీ గరంగరం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గరంగరంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతుండగా.. తాము అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో తెరపైకి వచ్చిన పలు అంశాలు అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంపై ప్రతిపక్షాలు గొంతెత్తనున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం స్కెచ్ గీస్తోంది. కాగా, ఈ నెల 18న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని, ఈసారి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి.. సమావేశాల్లో పలు అంశాలను సభలో లేవనెత్తి అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఆధారాలతో సహా వివరాలు సేకరించే పనిలో పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెరపైకి వచ్చిన ఉద్యోగాల కల్పన, ఐటీఐఆర్, నిరుద్యోగ భృతి, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభు త్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఆది లేదా సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎల్పీ భేటీ కానుంది. బీజేపీ కూడా నిరుద్యోగ భృతి, నిజాం షుగర్స్, యూనివర్సిటీల నిర్వీర్యం, ఉద్యోగ నోటిఫికేషన్లు, జోనల్ వ్యవస్థపై నిర్లక్ష్యం, కేంద్ర పథకాల అమలు, ఫసల్‌బీమా యోజన వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో రెడీగా ఉంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు శనివారం భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వం లీకులిచ్చి ఉద్యోగులకు 29% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పిన విషయంపై కూడా గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. ఎంఐఎం కూడా గ్రేటర్ పరిధిలోని సమస్యలు, ఇతర అంశాలతో సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. గట్టిగానే బదులివ్వాలని.. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార టీఆర్ఎస్ కూడా పకడ్బందీగానే సిద్ధమవుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగానే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత అభివృద్ధి అనే కోణంలో ప్రతిపక్షాలను తూర్పారపట్టేందుకు సిద్ధమవుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. 2014-19 వరకు రాష్ట్రం సగటున 17.24 శాతం వృద్ధి సాధించిందని, 2013-14లో ఉన్న జీఎస్డీపీకి, 2019-20లో ఉన్న జీఎస్డీపీకి 114 శాతం మెరుగుదల ఉందని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.2.28 లక్షల వరకు పెరిగిందన్న విషయాలను గణాంకాలతో సహా చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాము చేసిన అభివృద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని వివరించేందుకు అవసరమైన అన్ని వివరాలను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని అధికారపక్షాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న పాలనా సంస్కరణలు, కొత్త చట్టాలు, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, హరిత తెలంగాణ, ఐటీ, పరిశ్రమల ఏర్పాటులో పురోగతి, మత సామరస్యం, వ్యవసాయ రంగంలో వృద్ధి, రైతు సంక్షేమం, పంట ఉత్పత్తుల్లో పెరుగుదల, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు, పల్లె, పట్టణ ప్రగతి వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ, కాకతీయ ఫలితాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, మార్కెటింగ్, గోడౌన్ సౌకర్యాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, ధరణి, రెసిడెన్షియల్ గురుకులాలు, కరోనాను కట్టడి చేసిన తీరు.. ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలోనే కౌంటర్ ఇచ్చి మిగిలిన రోజుల్లో కూడా ప్రతిపక్షాలు నోరెత్తకుండా చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ పదిహేడో సమావేశాల నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల మరణించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 16న సంతాపం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమవుతాయి. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలతో.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఇప్పుడు కూడా భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సమావేశాల నిర్వహణ తీరుతెన్నులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో సభ్యుల మధ్య దూరం ఉండేలా అదనపు సీట్లు ఏర్పాటు చేశారు. అందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. గ్యాలరీ పాసులను రద్దు చేయడంతోపాటు మీడియాకు పరిమిత సంఖ్యలో పాసులు ఇచ్చారు. ఈసారి కూడా అవే తరహా నిబంధనలను పాటించే అవకాశం ఉంది. -
నా తెలంగాణ ప్రగతికి చిరునామా
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాలపాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వణక్కం.. నమస్కారం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యాక మొదటిసారిగా ఉభయసభలకు హాజరైన తమిళిసై.. తమిళంలో వణక్కం అని, తెలుగులో నమస్కారం అని సభ్యులకు అభివాదం చేసి ఆ తరువాత ఆంగ్లంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని సాధించుకున్న అనతికాలంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులతో పోల్చుకుంటే తక్కువ వ్యవధిలో సాధించిన ప్రగతిని చూసి దేశమంతా అబ్బురపడటం గర్వకారణమన్నారు. 2014 జూన్ 2 నాటికి ముందున్న దుర్భర పరిస్థితులను దూరం చేసుకుంటూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యత పాటిస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలోని వనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, బలాలు, బలహీనతలన్నింటినీ అంచనా వేసుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల వంటి మూడంచెల ప్రణాళికలను రూపొందించుకొని రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వాన్ని, పాలనను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు బలపరుస్తున్నారన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడే రాష్ట్ర సారథిగా ముందుకు నడిపించడం తెలంగాణకు కలిసొచ్చిన అంశమన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం కారణంగా కుదేలైన అన్ని రంగాలకు పునరుత్తేజం కల్పించేందుకు దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం గడిచిన ఆరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఆమె మాటల్లోనే... పేదలకు కనీస జీవన భద్రత కోసం.. ‘‘పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారికి భద్రత కల్పించాయి. ఆసరా, వికలాంగుల పెన్షన్లను పెంచడంతో వారు ఎవరిపైనా ఆధారపకుండా సంతోషంగా బతుకుతున్నారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వారందరికీ పెన్షన్లు అందుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం చేతివృత్తులు, కులవృత్తులకు తోడ్పాటు అందిస్తోంది. ప్రభుత్వ ఖర్చుతో నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కేవలం తెలంగాణలోనే అమలవుతోంది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి.. బీజేపీ సభ్యులు రాజాసింగ్, రాంచంద్రరావు పేదలు, వివిధ వర్గాలకు చేయూత.. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు స్థలాలను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోంది. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని బోనస్‌గా ప్రభుత్వం అందిస్తోంది. ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 22,667 మంది ఆర్టిజన్ల సర్వీసును క్రమబద్ధీకరించింది. విద్యుత్ రంగంలో అనితర విజయాలు.. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణం. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగాన్ని ఆలకిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ వ్యవసాయ రంగంలో అభివృద్ధి.. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని అమలు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తోంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తికానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజులపాటు నీరందించడానికి సమ్మక్క బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధించేలా 40 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజీని మంజూరు చేసింది. రాష్ట్రంలో నీటిపారుదల రంగం పురోగతికి ఈ యాసంగిలో వరిసాగే నిదర్శనం. యాసంగి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలవగా ఈ యాసంగి సీజన్లో వరి పంట సాగు 38,19,419 ఎకరాలకు పెరిగింది. 123.5 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచవ్యాప్త గొప్ప పథకాల్లో రైతు బంధు ఒకటి.. రైతుబంధు పథకం ఇప్పుడు భారత దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం. ఎకరానికి çరూ. 10 వేల చొప్పున రెండు విడతల్లో రైతుబంధును అందిస్తూ దేశానికి ఓ రోల్‌మోడల్‌గా నిలిచింది. తెలంగాణ స్ఫూర్తితో వివిధ రాష్ట్రాలు రైతుబంధును ఆదర్శంగా తీసుకుంటున్నాయి. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతుబంధు ఒకటని ఐక్యరాజ్యసమితి కీర్తించడం మనకు గర్వకారణం. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ ఇకపై రైతుబంధు సమితిలు.. రైతు సమన్వయ సమితిలను ఇకపై రైతుబంధు సమితిలుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనం వేసిన దగ్గర నుంచి మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతుబంధు సమితిలు కీలక బాధ్యతలు నిర్వహించేలా ప్రభుత్వం త్వరలోనే కార్యాచరణను ప్రారంభించనుంది. త్వరలోనే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్.. ‘కంటి వెలుగు’లో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిíßస్తాం. ప్రజలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది. కొత్త విధానాలు–కొత్త చట్టాలు.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచడం కోసం, స్థానిక సంస్థలను క్రియాశీలం చేయడం కోసం ప్రభుత్వం కొత్త గ్రామీణ విధానం, కొత్త పట్టణ విధానం తీసుకొచ్చింది. కొత్తగా పంచాయతీ, పురæ చట్టాలను తెచ్చింది. గతంలో ప్రభుత్వానికి, మంత్రులకు ఉండే అధికారాలను తొలగించి కలెక్టర్లకు ఇచ్చింది. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రూ. 2.04 లక్షల కోట్ల పెట్టుడులు... రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటివరకు 12,427 పరిశ్రమలు అనుమతులు పొందగా రూ. 2.04 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఐటీ రంగంలో మేటీ.. ఐటీ రంగంలో రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగింది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వచ్చాయి. 2013–14లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు కాగా 2018–19 నాటికి రూ. 1.09 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఐటీ ఎగుమతుల వృద్ధిరేటులో దేశ సగటు 8.9 శాతం కాగా తెలంగాణలో 16.89 శాతం కావడం ఐటీ రంగంలో సాధించిన ప్రగతికి సంకేతం. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీæ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరింపజేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. శాంతిభద్రతల పటిష్టత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ.. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా పడింది. అయినప్పటికీ పటిష్టమైన పరిపాలన విధానాలు, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా తెలంగాణ ఆ దుస్థితిలో లేదు. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంతోపాటు ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలను యథాతథంగా అమలు చేస్తూ స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ అత్యంత ఆశావహ దృక్పథంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.’’ గవర్నర్ నోట జై తెలంగాణ నినాదం.. గవర్నర్ తమిళిసై తన ప్రసంగం చివరల్లో ఓ కొటేషన్‌ను తమిళంలో చెప్పి దాని అర్థాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ‘‘ఆకలి దప్పులు లేని, అనారోగ్యాలు లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్ప రాజ్యం’’అని వివరించారు. అనంతరం జైహింద్, జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగంపై స్పందనలు గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దరిదాపుల్లో లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తావించలేదు. నిరుద్యోగ భృతి–సాగునీటి ప్రాజెక్టులపై క్లారిటీ లేదు. పేదలకిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఆరేళ్ల నుంచీ ఒకటే మాట చెబుతున్నారు. ఈ ప్రసంగంలో పోడుభూములు, ఎస్సీ–ఎస్టీ నిధులపై అంకెలు చెప్పలేదు. రైతుబంధు–రైతురుణమాఫీ అనేవి ఎన్నికల ఆయుధాలుగా మారాయి. మిషన్ భగీరథ నీళ్ల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు– మహిళల పై దాడుల నివారణ చర్యలు కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్దతిలో రూ.4వేల కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం పై చర్చ జరపాలి. ఉస్మా నియా యూనివర్సిటీలో ఎదురవుతున్న వివిధ సమస్యల పై చర్చించాలి. ప్రాధాన్యత సంతరించుకున్న ఆయా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు పొడిగించాలి. – సీఎల్పీ నేత భట్టి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం విన్న తరువాత చాలా బాధ అనిపిం చింది. ఒక అత్యున్నత స్థాయి మహిళ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది. తెలంగాణలో ఇంకా అన్ని కష్టాలు పోలేదు. ఈ రోజు కొంతమంది నాయకులు తమ ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారు. ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటాన్ని కూడా కేసీఆర్ సహించలేకపోతున్నారు. – కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు పలికించింది. గత ఖరీఫ్‌లో రైతుబంధు అందరికీ అందలేదు, యాసంగి పంటలు చేతికందే సమయమొచ్చినా ఆ సబ్సిడీ చెల్లింపులు చేయలేదు. కందిపంట వేసిన రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. గవర్నర్ ప్రసంగంలో రూ.లక్ష రుణమాఫీ హామీ అమలు ప్రస్తావనే లేదు. డబుల్బెడ్రూం ఇళ్లపై ప్రచారం తప్ప, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదు. – చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఉపాధి కల్పన, గృహ నిర్మాణాలు, ఉద్యోగభద్రత, శాంతిభద్రతల సమస్యలు ప్రస్తావించకుండా టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను గవర్నర్ ప్రసంగంలో వినిపించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని ప్రతిబింబించేలా, ప్రగతికి దోహదపడేలా ఈ ప్రసంగం లేదు. దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట వరుసకు కూడా ప్రస్తావించలేదు. – తమ్మినేని వీరభద్రం అరిగిపోయిన రికార్డును మరోసారి సభలో వినిపించారు. అన్నిరంగాల్లో ప్రభుత్వం విఫలమైందదని గవర్నర్ ప్రసంగంతో రుజువైంది. గవర్నర్‌తో పబ్లిక్ డాక్యుమెంట్ చదివించారు. ఒక్క అంశం కూడా ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాతది కాదు. – రాంచంద్రరావు ఇది కొత్త తరహా బడ్జెట్ ఏమీ కాదు. గవర్నర్ ప్రసంగంలోని ప్రతి అంశంపైనా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తాం. సీఏఏ, భైంసా అంశాలపై సభలో చర్చను లేవనెత్తుతా. – రాజాసింగ్ గవర్నర్ తమిళిసై ప్రసంగం తెలంగాణ ఖ్యాతిని చాటింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడింది. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పురోగతి సాధించింది. – టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గవర్నర్ తమిళిసై ప్రసంగంలో కొత్తదనం లేదు. గత ప్రసంగమే తిరిగి చెప్పించినట్లుంది. కొత్త సీసాలో పాత సారాను తలపిస్తోంది. రైతు సమన్వయ సమితి స్థానంలో రైతు బందు సమితిలు తప్ప కొత్త అంశాలేమీ లేవు. – టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలంగాణ ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్‌పై (ఎన్పీఆర్) స్టే విధించాలి. కేరళ మాదిరిగా ఎన్పీఆర్పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ ప్రసంగంలో ఎన్పీఆర్ ప్రస్తావన ఉంటుందని భావించాం. కానీ, నిరాశపర్చింది. – మజ్లిస్ ఎమ్మెల్యేలు -
ఆదివారం నాడు తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ఆదివారం నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన సభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం జరిగిందని, అందులో భట్టివిక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారని చెప్పారు. శనివారం గవర్నర్ తమిళిసై ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ ఉంటుందని తెలిపారు. సోమవారం, మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉంటుదన్నారు. 13,14,16,17,18,19తేదీల్లో పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. 20వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీప్లే ఉంటుందని తెలిపారు. ‘అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క షార్ట్ డిస్కర్షన్ పెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ దానికి సానుకూలంగా స్పందించారు. షార్ట్ డిస్కర్షన్లు వచ్చిన సంఖ్యను బట్టి 20వ తేదీ తరువాత మరొక సారి బీఏసీ ఉంటుంది. దాని తరువాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలనేది చెబుతాం. మండలిలో 13,14వ తేదీల్లో షార్ట్ డిస్కర్షన్ ఉంటుంది. 15వ తేదీ సెలవు. శాసన సభలో 12 రోజులు, మండలిలో 8 రోజులు సమావేశాలు ఉంటాయి. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో చర్చ చేసిన తరువాత వాటికి వ్యతిరేకంగా బిల్ పాస్ చేస్తామ’ని చెప్పారు. -
సజావుగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతికి దోహదం చేసే చర్చలను ప్రజలు నిశితంగా గమనిస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులుతో కలిసి బుధవారం శాసనసభ ఆవరణలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ శాసనసభ పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూడాలని, సభ్యులు అధికారుల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని పోచారం ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశాలు నిర్వహిస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ నుంచి శాసనమండలిలోకి వచ్చే మంత్రులకు ట్రాఫిక్ సమస్య ఎదురవకుండా చూడాలని, ఉభయ సభల్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయాల నుంచి వచ్చే సభ్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్, విప్‌లు, ఎమ్మెల్సీల విషయంలో జిల్లా స్థాయిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సభ జరిగేందుకు అధికారులు సర్వసన్నద్ధులుగా ఉండాలని వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ కార్యదర్శులు వాట్సాప్ ద్వారా సమావేశాల తీరును ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో ప్రత్యేక భేటీ.. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసు అధికారులతో గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీపీ (ఎస్పీఎఫ్) తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, చీఫ్ విప్‌లు దాస్యం వినయభాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టీఆర్ఎల్పీ ఇన్చార్జి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్‌ను స్పీకర్, మండలి చైర్మన్ సంయుక్తంగా ప్రారంభించారు. -
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ: అందుకు మోదీ కారణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే ముజాంఖాన్ చర్చ ప్రారంభించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఆర్ధిక మాంద్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయలేకపోయిందని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కేంద్రం తీరు ఉందని దుయ్యబట్టారు. ఈ నెల 9న 2019-20 వార్షిక బడ్జెట్‌ను కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీలు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది. -
ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
-
బడ్జెట్ ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: మార్చి 8వ తేదీ నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుల గురించి చర్చిస్తున్నారు. మార్చి 11న వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 18 రోజులపాటు సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సమావేశంలో మంత్రి ఈటల, అధికారులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీని డిజిటలైజేషన్ విధానంలో జరిపే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహాలో గవర్నర్ ప్రసంగాన్ని ఎవరైనా అడ్డుకుంటే ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేయడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే మార్చి తొలి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశముంది. -
'కలలో కూడా ఊహించలేదు'
-
'కలలో కూడా ఊహించలేదు'
హైదరాబాద్: తెలంగాణ ఉభయ సభల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... అధికారపక్షం తీరును తూర్పారబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. అందరినీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. సభలో జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా, తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. సభలో జరిగిన విషయాలకు సంబంధించిన దృశ్యాలను బయటకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో టీఆర్ఎస్ నాయకులు విపక్ష నాయకులను అణగతొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతునొక్కిన తీరు ఇకముందు సాగబోదన్నారు. ముఖ్యమంత్రి పూటకో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణగతొక్కాలన్న వైఖరిని మార్చుకుని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలని ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
కేసీఆర్‌కు ఫర్మాన పంపిన షబ్బీర్ అలీ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం సీఎంకు ఓ ఫర్మాన పంపించారు. కేసీఆర్ ఇప్పటివరకూ ప్రధానంగా 101 హామీలిచ్చారని, అందులో మూడు మాత్రమే పూర్తిగా అమలు అయ్యాయని షబ్బీర్ అలీ అన్నారు. పాక్షికంగా మరో ఎనిమిది హామీలు అమలు అయ్యాయని, ఆ వివరాలు సరైనవో కావో కేసీఆరే చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్నో ఫర్మానాలో మార్కు చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే కేసీఆర్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ గురువారం సాయంత్రం అయిదు గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. కాగా మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగం, ఏపీ బడ్జెట్ తుదిరూపుపై సమీక్ష జరిపారు.