15 నుంచి తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీ | Telangana Assembly Budget Session Starts March 15th | Sakshi
Sakshi News home page

15 నుంచి తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీ

Published Wed, Mar 10 2021 2:02 AM | Last Updated on Wed, Mar 10 2021 2:02 AM

Telangana Assembly Budget Session Starts March 15th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ పదిహేడో సమావేశాల నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల మరణించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 16న సంతాపం ప్రకటిస్తారు. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమవుతాయి. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

భౌతిక దూరం, కోవిడ్‌ నిబంధనలతో..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఇప్పుడు కూడా భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సమావేశాల నిర్వహణ తీరుతెన్నులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో సభ్యుల మధ్య దూరం ఉండేలా అదనపు సీట్లు ఏర్పాటు చేశారు. అందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. గ్యాలరీ పాసులను రద్దు చేయడంతోపాటు మీడియాకు పరిమిత సంఖ్యలో పాసులు ఇచ్చారు. ఈసారి కూడా అవే తరహా నిబంధనలను పాటించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement