
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ‘కమీషన్’ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేపాయి. కేటీఆర్(KTR) వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భట్టి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు కేటీఆర్ వ్యాఖ్యలను ప్యానెల్ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడంతో నిరసనగా బీఆర్‌ఎస్ వాకౌట్ చేసి అసెంబ్లీ బయట నిరసనలు కొనసాగించింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మంత్రులకు సంయమనం ఉండాలి. ప్రభుత్వ హామీలు అమలు చేయకుంటే అడుగుతాం. 30 శాతం కమిషన్ అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు’’ అని అనడంతో సభలో అలజడి రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ‘‘కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించాలి. సభలో కమీషన్లపై ఆధారాలతో చూపించాలి. కేటీఆర్ ఆధారాలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మాట్లాడితే డెమోక్రసీ అంటున్నాడు. కానీ, ఇలా మాట్లాడతాడని ఊహించలేదు.
.. సభలో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీలాగా బరితెగించి రాజకీయాలు చేయడం లేదు. కాంట్రాక్టు బిల్లులు ఇవ్వకుండా పోయింది ఎవరు? ఇప్పుడొచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నారా? చర్చ వాస్తవంగా జరగాలే తప్ప పక్కదారి పట్టించేలా ఉండకూడదు’’ అని అన్నారు. ఈ క్రమంలో.. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అని ప్యానెల్ స్పీకర్‌ను కోరారు. అయితే..
భట్టి(Bhatti) వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌ను తాను విమర్శించలేదన్న భట్టి.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాత్రమే అన్నానని, అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించలేదని భట్టి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల ోటాపోటీ నినాదాలు కొనసాగాయి. భట్టి వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ ఎంట్రీ 4 మెట్ల మీద కూర్చుని ‘‘వద్దు రా నాయనా ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వం’’ అంటూ బయట నినాదాలు చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కేటీఆర్ వ్యాఖ్యల తొలగింపు
‘‘కేటీఆర్ వ్యాఖ్యలతోనే ఈ గొడవ మొదలు అయింది. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆవేదనతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. కేటీఆర్ అన్‌పార్లమెంటరీ పదాన్ని వాడారు. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తాం. సీనియర్ సభ్యులుగా ఉండి ఇలాంటి నిరసనలు చేయడం కరెక్ట్ కాదు’’ అని ప్యానెల్ స్పీకర్ అన్నారు.