
సీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మహేశ్‌గౌడ్
ప్రతిపక్షాల ఆరోపణలు, లేవనెత్తే అంశాలను దీటుగా ఎదుర్కోవాలి
సీఎల్పీ భేటీలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్
బీఆర్‌ఎస్‌లా కుంభకోణాలు ఎవరూ చేయలేదు.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే వాటిని ప్రస్తావించి ఎదురుదాడి చేయాలి!
నాకేమంటూ, అంటీముట్టనట్టు ఉండటం మీకు, పార్టీకి మంచిదికాదు
పార్లమెంటు తరహాలోనే రోజుకు మూడుసార్లు అటెండెన్స్ తీసుకుంటాం
జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలసి మాట్లాడతా..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
మొక్కుబడిగా హాజరవడం కాదు..
కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్‌గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు.
నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు
‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్‌ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్‌లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్‌లను ఆదేశించారు.
జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా..
త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం.
చెప్పేది సీరియస్‌గా తీసుకోండి..
సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్‌గా ప్రయత్నించాలి. నాన్‌సీరియస్‌గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment