విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్‌‌ | Telangana Assembly Budget Session Started | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం‌‌

Published Mon, Mar 15 2021 11:04 AM | Last Updated on Tue, Mar 16 2021 8:56 AM

Telangana Assembly Budget Session Started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నాడు ఆకలి చావులు, ఆత్మహత్యలతో అల్లాడిపోయిన తెలంగాణలో నేడు జీవకళ తొణికిసలాడుతున్నది. దండగ అన్న చోటే వ్యవసాయం ఆశావహంగా మారింది. కాగితాలకు పరిమితమైన ప్రాజెక్టులు నేడు సాకారమై సాగు నీటిని అందిస్తున్నాయి. నాటి బీడు పొలాలు నేడు తరి పొలాలై తరిస్తున్నాయి. విద్యుత్‌ కోతల విపత్తులు అదృశ్యమై రాష్ట్రం వెలుగులీనుతోంది. గుక్కెడు నీటి కోసం గోసపడిన నేలపై నేడు ఇంటింటికీ నల్లాల ద్వారా ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల మీద పోయిన విశ్వాసం తిరిగి పెరుగుతున్నది. నాడు అందని ద్రాక్షలా ఉన్న నాణ్యమైన విద్య పైసా ఖర్చులేకుండా పేద పిల్లలకు లభిస్తోంది. ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం చేస్తుంటే పెళ్లి మండ పాల్లో మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి.

నాడు తక్కువ వేతనాల కారణంగా అర్ధాకలితో అలమటించిన క్షేత్రస్థాయి ఉద్యోగులకు నేడు గౌరవప్రద వేతనాలు గ్యారంటీగా లభిస్తున్నాయి. నిన్నటివరకూ పాలు, కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, పండ్లు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కాగా నేడు ఎగుమతి చేసే దిశగా పురోగమిస్తున్నాం. నాడు మూతపడుతున్న పరిశ్రమలు, నేడు తరలివస్తున్న పరిశ్రమలు. నాడు నిత్యం కర్ఫ్యూలు, నేడు ప్రశాంత జనజీవనం. ఇదీ ఆనాటి తెలంగాణకు, ఈనాటి తెలంగాణకు ఉన్న వ్యత్యాసం’అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆమె రాష్ట్ర శాసనసభలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న వివక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ఏడేళ్లలో సాధించిన పురోగతిని ఆమె వివరించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు గవర్నర్‌ మాటల్లోనే... 

దేశానికి మార్గదర్శి
గాఢాంధకారాన్ని బద్ధలు కొడుతూ పొడిచిన తొలి పొద్దులా, ఆరు దశాబ్దాల చీకటిని చేధిస్తూ ఏడేళ్ల కింద తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు శైశవ దశలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించి దేశానికి దారి చూపే మార్గదర్శిగా నిలిచింది. రాష్ట్రం నేడు గెలిచి నిలిచి... విమర్శకులు నోళ్లు వెళ్లబెట్టుకునేలా చేసింది. వలసవాద కుట్రలతో కుదేలైన రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణను పురోగామి రాష్ట్రంగా మార్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచికలో రాష్ట్రం దేశంలో మూడోస్థానానికి ఎదగడం రాష్ట్ర పురోగతికి ప్రబల నిదర్శనం. 

తలసరి ఆదాయం రెట్టింపు
వార్షిక ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014–19 వరకు 17.24 శాతం వృద్ధిరేటు సాధించింది. 2013–14లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.4,51,580 కోట్లు అయితే, 2019–20లో 114.71 శాతం వృద్ధితో రూ.9,69,604 కోట్లకు పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం రూ.1,12,162 నుంచి రూ.2,28,216కు పెరిగింది. 2020–21లో జీఎస్డీపీ రూ.9,78,373 కోట్లుగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉంటుందని అంచనా. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా కోలుకున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన భారత ఆర్థిక సర్వే 2020–21లో ప్రశంసించారు. 

కొత్త వెలుగులు
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, అన్ని రంగాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నూతన చరిత్ర లిఖించింది. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,245 మెగావాట్లకు పెరిగింది. ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీ 13,900 ఎంవీఏ నుంచి 37,000 ఎంవీఏకు పెరిగింది. 

రూ.32,500 కోట్లతో ఇంటింటికీ తాగునీరు
మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పీడ విరగడైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేళ్లలో రూ.32,500 కోట్లను ఖర్చు చేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. 24,543 ఆవాస ప్రాంతాల్లో 57,26,804 నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికీ రోజూ రక్షిత నీరు సరఫరా అవుతోంది. మిషన్‌ కాకతీయ పేరుతో 45 వేల చెరువులను పునరుద్ధరించే మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 

342 టీఎంసీల నిల్వకు రిజర్వాయర్లు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలనే మహా సంకల్పంతో ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఆనాడు సమైక్య పాలకులు గోదావరిపై ప్రతిపాదించిన రిజర్వాయర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 11.43 టీఎంసీలు కాగా, తెలంగాణ ప్రభుత్వం 227.77 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2014 తర్వాత నా ప్రభుత్వం తలపెట్టిన రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 342.21 టీఎంసీలు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ఎత్తిపోతల పథకాలు దాదాపు పూర్తికావొచ్చాయి. 

రైతులే మాకు ముఖ్యం
ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల, విప్లవాత్మక చర్యలతో వ్యవసాయ రంగం ఆశాజనకంగా మారింది. నా ప్రభుత్వానికి వ్యవసాయానికి మించిన ప్రాధాన్యం మరొకటి లేదని, రైతు బాగోగులే మాకు ముఖ్యమని, వ్యవసాయ రంగాభివృద్ధికి మరింత పట్టుదలతో కృషి కొనసాగుతుందని ప్రకటిస్తున్నా. ఎకరానికి రూ.10 వేల రైతుబంధు, 5 లక్షల రైతు బీమా, సాగునీరు, విద్యుత్‌ సదుపాయాలతో నేడు రాష్ట్రంలో రైతులు బంగారు పంటలను పండిస్తున్నారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాల నుంచి 2.10 కోట్ల ఎకరాలకు (రెండు సీజన్లలో కలిపి) పెరిగింది. దిగుబడి 2.05 కోట్ల టన్నుల నుంచి 4.11 కోట్ల టన్నులకు పెరిగింది. 

సంక్షేమంలో అగ్రగామి
సంపద పెంచాలి– పేదలకు పంచాలి.. అనే స్ఫూర్తితో రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు పెంచింది. వికలాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.3,016కు పెంచింది. బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కొత్తగా రూ.2,016 పెన్షన్‌ అందిస్తోంది. రాష్ట్రం వచ్చినప్పుడు 29,21,828 మందికి పెన్షన్లు లభిస్తుండగా.. ఇప్పుడు 39,36,521 మందికి ఇస్తున్నాం. పెన్షన్లపై వార్షిక వ్యయం రూ.860 కోట్ల నుంచి రూ.8,710 కోట్లకు పెరిగింది.

త్వరలో భూముల డిజిటల్‌ సర్వే..
భవిష్యత్తులో భూ హద్దుల వివాదాలు తలెత్తకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములన్నింటికీ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా, వక్రీకరణకు వీలులేని కోఆర్డినేట్స్‌ ఇవ్వనున్నాం. ధరణి పోర్టల్, కొత్త రిజిస్ట్రేషన్ల విధానంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 

వైద్య సదుపాయాలు మెరుగు
మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను గణనీయంగా పెంచింది. 17 వేల నుంచి 23,450కు బెడ్ల సంఖ్య, 254 నుంచి 11,758కు ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్య, 100 నుంచి 1484కు వెంటిలేటర్‌ బెడ్లు, 3 నుంచి 49కి డయాలసిస్‌ సెంటర్లు, 4 నుంచి 29కి ఐసీయూలు, నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లను 18 నుంచి 42కు, బ్లడ్‌ బ్యాంకుల సంఖ్య 18 నుంచి 31కి పెంచింది. మూడు చోట్లలో కిడ్నీ, రెండు చోట్లలో లివర్, రెండు హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్లను, 22 వైరాలజీ ల్యాబ్‌లను, 25 డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. 

నగరానికి మరో మణిహారం..ఆర్‌ఆర్‌ఆర్‌
రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో కేంద్రం నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డును సాధించింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్, షాద్‌నగర్‌ పట్టణాల మీదుగా వలయాకారంలో.. ప్రస్తుతం ఉన్న ఓఆర్‌ఆర్‌కు 30 కి.మీల అవతల 348 కి.మీల పొడవున ఈ రోడ్డు నిర్మాణం కానుంది. రాష్ట్రానికి మరో వరంలా, హైదరాబాద్‌ నగరానికి మరో మణిహారంగా ఈ రోడ్డు మారనుంది. 

ఐటీ ఎగుమతులు  ః రూ.1.40 లక్షల కోట్లు!
టీఎస్‌–ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 15,252 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 15.51 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఈ పరిశ్రమలతో లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 250 కొత్త ఐటీ కంపెనీలు వచ్చాయి. 2020–21లో రాష్ట్రం నుంచి రూ.1.40 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగనున్నాయని నాస్కామ్‌ అంచనా వేసింది. 

అభివృద్ధి, సంక్షేమ యజ్ఞాన్ని కొనసాగిస్తాం
‘ఇది నా ప్రభుత్వం సాధించిన అద్భుత అభివృద్ధి వికాసం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అనేక రంగాల్లో వినూత్న పథకాలను అమలు చేస్తోంది. ప్రగతి ఫలాలను ప్రజలకు అందిస్తూ దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాల్లో మొదటి వరుసలో నిల్చున్నదని కేంద్ర ప్రభుత్వం అనేక నివేదికల ద్వారా అనేక పర్యాయాలు ప్రకటిస్తూ వస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలెన్నో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ అభివృద్ధి, సంక్షేమ యజ్ఞాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని, సామాజిక దొంతరలో అట్టడుగున ఉన్న బిడ్డలకు ప్రగతి ఫలాలు ప్రాధాన్యతగా అందించే విధంగా మానవీయ దృక్పథంతో మరిన్ని చర్యలు చేపడతామని, ఈ లక్ష్య సాధనకు నా ప్రభుత్వం పునరంకితమవుతుందని తెలియజేస్తున్నాను’అని గవర్నర్‌ ప్రకటించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తొలిరోజు సమావేశానికి హాజరయ్యారు. 

చదవండి: (సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చా: మంత్రి కేటీఆర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement