సాక్షి, హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గరంగరంగా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతుండగా.. తాము అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో తెరపైకి వచ్చిన పలు అంశాలు అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంపై ప్రతిపక్షాలు గొంతెత్తనున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం స్కెచ్ గీస్తోంది. కాగా, ఈ నెల 18న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని, ఈసారి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి..
సమావేశాల్లో పలు అంశాలను సభలో లేవనెత్తి అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఆధారాలతో సహా వివరాలు సేకరించే పనిలో పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెరపైకి వచ్చిన ఉద్యోగాల కల్పన, ఐటీఐఆర్, నిరుద్యోగ భృతి, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభు త్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఆది లేదా సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం సీఎల్పీ భేటీ కానుంది.
బీజేపీ కూడా నిరుద్యోగ భృతి, నిజాం షుగర్స్, యూనివర్సిటీల నిర్వీర్యం, ఉద్యోగ నోటిఫికేషన్లు, జోనల్ వ్యవస్థపై నిర్లక్ష్యం, కేంద్ర పథకాల అమలు, ఫసల్‌బీమా యోజన వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో రెడీగా ఉంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు శనివారం భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వం లీకులిచ్చి ఉద్యోగులకు 29% ఫిట్‌మెంట్ ఇస్తామని చెప్పిన విషయంపై కూడా గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. ఎంఐఎం కూడా గ్రేటర్ పరిధిలోని సమస్యలు, ఇతర అంశాలతో సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది.
గట్టిగానే బదులివ్వాలని..
ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార టీఆర్‌ఎస్ కూడా పకడ్బందీగానే సిద్ధమవుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగానే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత అభివృద్ధి అనే కోణంలో ప్రతిపక్షాలను తూర్పారపట్టేందుకు సిద్ధమవుతున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
2014-19 వరకు రాష్ట్రం సగటున 17.24 శాతం వృద్ధి సాధించిందని, 2013-14లో ఉన్న జీఎస్‌డీపీకి, 2019-20లో ఉన్న జీఎస్‌డీపీకి 114 శాతం మెరుగుదల ఉందని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.2.28 లక్షల వరకు పెరిగిందన్న విషయాలను గణాంకాలతో సహా చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాము చేసిన అభివృద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని వివరించేందుకు అవసరమైన అన్ని వివరాలను ఆయన సిద్ధం చేసుకుంటున్నారని అధికారపక్షాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో అమలవుతున్న పాలనా సంస్కరణలు, కొత్త చట్టాలు, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, హరిత తెలంగాణ, ఐటీ, పరిశ్రమల ఏర్పాటులో పురోగతి, మత సామరస్యం, వ్యవసాయ రంగంలో వృద్ధి, రైతు సంక్షేమం, పంట ఉత్పత్తుల్లో పెరుగుదల, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు, పల్లె, పట్టణ ప్రగతి వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, మిషన్ భగీరథ, కాకతీయ ఫలితాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, మార్కెటింగ్, గోడౌన్ సౌకర్యాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, ధరణి, రెసిడెన్షియల్ గురుకులాలు, కరోనాను కట్టడి చేసిన తీరు.. ఇలా ప్రతి విషయాన్ని వివరిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలోనే కౌంటర్ ఇచ్చి మిగిలిన రోజుల్లో కూడా ప్రతిపక్షాలు నోరెత్తకుండా చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment