సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నాయకుల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీల దూకుడు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. రాష్ట్రంలోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు కుమార్తెను రంగంలోకి దింపిన టీఆర్‌ఎస్ ఒక్కసారిగా సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురాగా, రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన ఉద్యోగ ఖాళీల భర్తీ, ఐటీఐఆర్, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ లాంటి అంశాలపై ప్రతిపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తి, సానుభూతి, అనుభవం, సామాజిక కోణం లాంటి అంశాల ప్రాతిపదికన ఈ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
మీరేం చేశారంటే... మీరేం చేశారు
ఉద్యోగాల భర్తీ అంశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య వేడి పుట్టిస్తోంది. ఈ అంశంపై అధికార టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సవాల్ విసరగా, మంత్రి కేటీఆర్ ప్రతిస్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక జరిగిన ఖాళీల భర్తీ గురించి శ్వేతపత్రం రూపంలో లెక్కలు చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు కూడా ట్విట్టర్ వేదికగా సవాల్ చేయగా, మంత్రి కేటీఆర్ దీటుగా స్పందించి ‘నో డాటా అవైలబుల్ (ఎన్‌డీఏ)’ అంటూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను టీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసిందని, బీజేపీ అమల్లోకి తేలేకపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండగా, ఇదే అంశంపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నడుమ కూడా మాటలయుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ రాకపోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించగా, కర్ణాటకలో కూడా ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి టీఆర్‌ఎస్ పార్టీనే కారణమా అని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా కేటీఆర్ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు మాట అటుంచితే బీజేపీ, టీఆర్‌ఎస్‌ల పట్ల పట్టభద్రుల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు స్వతంత్రులు ప్రయత్నిస్తూ వాగ్బాణాలు విసురుతుండటం గమనార్హం.
ప్రొఫెసర్ల పరిస్థితేంటి?
ఈసారి ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు కోదండరాం, నాగేశ్వర్‌లు బరిలో నిలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలాకాలంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తన శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీజేఎస్ పక్షాన ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మండలి ఎన్నికలు కోదండరాంకు జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు తనకు రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ప్రజల్లో ఉన్న సానుభూతిని సద్వినియోగం చేసుకునే దిశలో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కె.నాగేశ్వర్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనకున్న పరిచయాలు, అనుభవంతో ఈ మాజీ ఎమ్మెల్సీ మరోమారు విజయం తన పక్షాన ఉండేలా పక్కావ్యూహంతో ముందుకెళుతున్నారు. ఈసారి అనూహ్యంగా ఈ స్థానం నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవిని టీఆర్‌ఎస్ రంగంలోకి దించడంపై కూడా రాజకీయవర్గాల్లో, పట్టభద్రుల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
పీవీ.. ఐటీఐఆర్.. ఇద్దరు ప్రొఫెసర్లు
Published Fri, Mar 5 2021 3:10 AM | Last Updated on Fri, Mar 5 2021 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment