
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఆదివారం పోలింగ్ జరిగే రెండుస్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’లో మరోమారు విజయం సాధించాలని, ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉంది. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు బీజేపీ తరఫున మళ్లీ బరిలోకి దిగారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ స్థానాన్ని చేజిక్కించుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ కూతురు సురభి వాణీదేవిని ఈ స్థానంలో అభ్యర్థిగా నిలిపిన టీఆర్‌ఎస్ ఆమె గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఈ రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటమేకాక వీటిలో 64 చోట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు పరీక్షగా మారాయి. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన టీఆర్‌ఎస్ సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించింది.
‘హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ప్రతిష్టాత్మకం
‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 2007, 2015లలో మాత్రమే టీఆర్‌ఎస్ పోటీ చేసింది. 2015లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి విజయం సాధించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఏకంగా 9 మంది మంత్రులు ఈ నియోజకవర్గం పరిధిలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తోపాటు మొత్తం 93 మంది పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment