సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు.
రెండు స్థానాల్లో 15 వేల మంది అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున మొత్తం 8 వేల పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ పేర్కొన్నారు. రెండు నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు శనివారం రాత్రిలోగా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్టు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు.
‘హైదరాబాద్’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్‌ఎస్), ఎన్.రామచందర్‌రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్), ఎల్.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. ‘నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది.
పోలింగ్ శాతం పెరిగేనా?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల మండలి ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 85 శాతం అధికంగా ఓటర్ల నమోదు జరిగింది. పోలింగ్ ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే... ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి.
‘తొలి’ప్రాధాన్యత ఇస్తేనే ఓటు చెల్లుబాటు / ఫస్ట్ ప్రయారిటీ మస్ట్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత ఓటు విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్‌కు సంబంధించి సీఈఓ శశాంక్ గోయల్ ఓటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఇలా ఉన్నాయి..
- పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఊదా (వయోలెట్) రంగు స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాలి. మరే ఇతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించరాదు.
- ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో ‘1’అంకెను రాయాలి. ఓటర్లు తమ తదుపరి ప్రాధాన్యతలను చెప్పడానికి 2 ,3, 4, 5 ... అంకెలను ద్వారా ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో రాయాలి. ఓటు (బ్యాలెట్ పత్రం) చెల్లుబాటు కావడానికి ఓటర్లు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యత (1)ను ఇవ్వాలి. మిగిలిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేయడం, వేయకపోవడం ఓటర్ల ఇష్టం. తొలి ప్రాధాన్యత ఓటు వేసి, తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసినా, వేయకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది.
- ప్రాధాన్యతలను తెలపడానికి అంతర్జాతీయ ప్రామాణిక అంకెలు 1, 2, 3, 4... లేదా రోమన్ అంకెలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐV.. లేదా భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. అయితే ఓటరు.. ఒకే భాష/ సంఖ్యా విధానానికి సంబంధించిన అంకెలను మాత్రమే వాడాలి. భిన్నమైన న్యూమరికల్స్‌ను కలిపి ఉపయోగించరాదు.
- ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలా రాస్తే ఓటు చెల్లుబాటు కాదు.
- ఏ ఒక్క అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతలను ఇచ్చినా ఓటు చెల్లుబాటు కాదు.
- అభ్యర్థి పేరుకు ఎదురుగా రైట్/ టిక్ గుర్తు లేదా గీ గుర్తులతో ఎంపికను తెలియజేస్తే ఓటు చెల్లుబాటు కాదు.
- బ్యాలెట్ పత్రంపై ఓటర్లు తమ ఇంటి పేరు, ఇతర పదాలు, సంతకం, పొడి అక్షరాలు రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. అలాచేస్తే ఓటు చెల్లదు.
- ప్రాధాన్యతల ఎంపికను అంకెల్లో మాత్రమే సూచించాలి. ఒకటి, రెండు, మూడు ... అని అక్షరాల్లో రాయకూడదు.
- అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్యత సంఖ్యను రాయాలి. రెండు గడుల మధ్య ఉన్న గీతపై ప్రాధాన్యత అంకెను రాస్తే ఓటు చెల్లుబాటు కాదు.
- ఓ క్రమపద్దతిలో మడతపెట్టిన బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్ అధికారులు ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది.
ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓకే...
పట్టభద్రుల ఓటర్లందరికి ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎపిక్ కార్డును తీసుకువచ్చి ఓటేయవచ్చు. ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేకుంటే ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌస్‌లు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఓటర్లకు విద్యా సంస్థలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, వర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ ఒరిజినల్, సంబంధిత అధికారులు జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్.
Comments
Please login to add a commentAdd a comment