Nalgonda-Khammam-Warangal
-
TG: ‘మండలి’ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, సాక్షి: నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. -
MLC Election Results: సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్ఎస్
సాక్షి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నపై గెలుపొందారు. కాగా మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై ఆమె గెలుపొందారు. చదవండి: MLC Election Results: సురభి వాణిదేవి విజయం -
కౌంటింగ్.. ఇంకా వెయిటింగ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా తుది ఫలితం తేలకపోవడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సహా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోలై... చెల్లుబాటయ్యే ఓట్లలో 50% + ఒక ఓటును పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏడురౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా... ఏ అభ్యర్థీ 50% ఓట్లు (విజ యానికి కావాల్సిన నిర్ణీత కోటా ఓట్లు) సాధించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. అతితక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ (ఆఖరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని మొదట ఎలిమినేట్ చేస్తారు. అలా కింది నుంచి పైకి వెళుతూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారు), వారి బ్యాలెట్లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ (ఎలిమినేషన్ విధానం) కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో శనివారం మధ్యాహ్నం వరకు, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముందని లెక్కింపు సరళి వెల్లడిస్తోంది. అయితే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ పూర్తయిన తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల నడుమ చివరి వరకు గెలుపు దోబూచులాడే అవకాశముందని స్పష్టమవుతోంది. రెండు స్థానాల్లోనూ శనివారం రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ‘హైదరాబాద్’లో ఇద్దరి నడుమ హోరాహోరీ ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 93 అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్.వాణీదేవి (టీఆర్ఎస్) ఒకటో, ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. దీంతో చివరి నిముషం వరకు ఈ ఇద్దరి నడుమ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశముంది. మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (స్వతంత్ర), నాలుగో స్థానంలో నిలిచిన జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) బ్యాలెట్లలో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లపై వాణీదేవి, రాంచందర్‌రావు గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చిన్నారెడ్డి, నాగేశ్వర్లు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వాణీదేవి, రామచందర్‌రావు నడుమ ఎవరికి ఎక్కువగా వెళితే వారు విజేత అయ్యే అవకాశముంది. విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావాలంటే వాణీదేవి మరో 17.57 శాతం, రాంచందర్‌రావు మరో 19 శాతం ఓట్లు సాధించాల్సి ఉంది. నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు ఇద్దరికీ కలిసి 25.26 శాతం తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లలో వచ్చే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేర వాణీదేవి, రాంచందర్‌రావుకు కీలకం కానున్నాయి. ‘నల్లగొండ’లో ఆ ముగ్గురు నడుమ పోటీ ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’పట్టభధ్రుల నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) మొదటి స్థానంలో, తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) రెండు, ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) మూడో స్థానంలో నిలిచారు. అయితే ప్రథమ ప్రాధాన్యత ఓట్ల సంఖ్య పరంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే సుమారు 7.5 శాతం ఓట్లు అదనంగా సాధించారు. కోదండరాం కంటే తీన్మార్ మల్లన్న సుమారు 2.5 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. పల్లా ముందంజలో ఉన్నా మల్లన్న, కోదండరాంలకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వస్తే...ప్రధాన పోటీదారుల స్థానాలు తారుమారయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), ఎస్.రాములు నాయక్ (కాంగ్రెస్) బ్యాలెట్స్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మల్లన్న, కోదండరాం గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వీరితో పాటు జయసారధిరెడ్డి (సీపీఐ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), రాణీరుద్రమ (యువ తెలంగాణ) బ్యాలెట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా పల్లా, మల్లన్న, కోదండరాం సాధించే ఫలితంపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది. తేలని లెక్క.. కొనసాగుతున్న ఉత్కంఠ పట్టభద్రుల స్థానాల కోటా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై స్పష్టత రాకపోవడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జన సామాన్యానికి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎవరికి వారుగా తుది ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ‘హైదరాబాద్’లో 93, ‘నల్గొండ’లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎలిమినేషన్ విధానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నెమ్మదిగా జరుగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో శుక్రవారం రాత్రికి రెండు స్థానాల్లోనూ కేవలం ఐదారుగురు అభ్యర్థులు మాత్రమే లెక్కింపు బరిలో మిగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ధీటుగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ పోటీ చేసిన అభ్యర్థులు ః 93 మొత్తం ఓట్లు ః 5,31,268 పోలైన ఓట్లు ః 3,58,348 చెల్లని ఓట్లు ః 21,309 చెల్లిన ఓట్లు ః 3,37,039 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,68,520 ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,689 (33.43 శాతం) ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,668 (31 శాతం) కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,620 (15.9 శాతం) చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,554 (9.36 శాతం) తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ‘నల్గొండ– ఖమ్మం– వరంగల్’ పోటీ చేసిన అభ్యర్థులు ః71 మొత్తం ఓట్లు ః 5,05,565 పోలైన ఓట్లు ః 3,87,969 చెల్లని ఓట్లు ః 21,636 చెల్లిన ఓట్లు ః 3,66,333 గెలిచేందుకు రావాల్సిన ఓట్లు ః 1,83,167 పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,10,840 (30.25 శాతం) తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,290 (22.73 శాతం) కోదండరాం (టీజేఎస్) ః 70,072 (19.12 శాతం) గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39,107 (10.67శాతం) రాములు నాయక్(కాంగ్రెస్) : 27,588 (7.53 శాతం) శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు కలుపుకొని తాజాగా ప్రధాన అభ్యర్థుల ఓట్ల వివరాలు ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్) ః 1,11,190 ఓట్లు తీన్మార్ మల్లన్న (స్వతంత్ర) ః 83,629 ఓట్లు కోదండరాం (టీజేఎస్) ః 70,472 ఓట్లు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) ః 39, 268 ఓట్లు రాములు నాయక్(కాంగ్రెస్) : 27, 713 ఓట్లు ‘హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్‌నగర్’ ఎస్.వాణిదేవి (టీఆర్ఎస్) ః 1,12,802 ఓట్లు ఎన్.రాంచందర్‌రావు (బీజేపీ) ః 1,04,965 ఓట్లు కె.నాగేశ్వర్ (స్వతంత్ర) ః 53,687 ఓట్లు చిన్నారెడ్డి (కాంగ్రెస్) ః 31,602 ఓట్లు ఎలిమినేషన్ ఇలా సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. మొత్తం పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగం + ఒక ఓటు... విజయానికి కావాల్సిన నిర్ణీత కోటా (50%+1) అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ ఈ కోటాను చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు పది మంది అభ్యర్థులు రంగంలో ఉంటే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని (అంటే 10వ స్థానంలో నిలిచిన అభ్యర్థిని) మొదట ఎలిమినేట్ చేస్తూ...ఆ అభ్యర్థి బ్యాలెట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలుపుతారు. పదో వ్యక్తి ఎలిమినేట్ అవడంతో.. 9 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైన ఉన్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి ఆ ఓట్లను కలిపి... వారికి వచ్చిన మొత్తం ఓట్లుగా పరిగణిస్తారు (ఎలిమినేట్ అయిన పదో అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లలో ఒకవేళ తొమ్మిదవ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చి ఉంటే.. ఆ బ్యాలెట్ పేపర్లలోని మూడో ప్రాధాన్యత ఓట్లను పైనున్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎవరికి వస్తే వారికి కలుపుతారు). తర్వాత 8వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ఇతనికి చెందిన బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పైన ఉండే ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరెవరికి వస్తే.. వారికి ఆ ఓట్లను కలుపుతారు. ఇలా ఎలిమినేట్ ఆయ్యే క్రమంలో పైనున్న స్థానాల్లోని అభ్యర్థుల్లో ఎవరికైనా 50 శాతం ఓట్లతో పాటు ఒక్క ఓటు అదనంగా వచ్చినా .. వారిని విజేతగా ప్రకటిస్తారు. అక్కడితో (ఆ ఎలిమినేషన్ రౌండ్‌తో) కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారు. ఇద్దరే మిగిలితే... ఎక్కువ ఓట్లున్న వారే విజేత నిర్ణీత కోటా ఓట్లను ఎవరూ సాధించలేని పక్షంలో పోటీలో ఇద్దరు అభ్యర్థులు మిగిలే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ ఇద్దరిలో ఎవరికీ నిర్ణీత కోటా ఓట్లు (50 శాతం + 1 ఓటు) రాకపోయినా సరే... ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వారినే విజేతగా ప్రకటిస్తారని నల్లగొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని విజేతను ప్రకటిస్తారని వెల్లడించారు. -
ఎమ్మెల్సీ కౌంటింగ్: మూడో ప్రాధాన్యం తప్పదా?
సాక్షి,నల్లగొండ: నల్లగొండ– వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐదురౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈ ఐదురౌండ్లలో 2,79,970 ఓట్లను లెక్కించగా, వాటిలో 15,533 ఓట్లు చెల్లకుండాపోయాయి. చెల్లిన 2,64,437 ఓట్లలో పల్లా 79,113 ఓట్లు సాధించా రు. ఆయనకు 18,549 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెస ర్ కోదండరామ్‌కు 49,200 ఓట్లు వచ్చాయి. నిర్ణయం కాని కోటా ఈ స్థానానికి జరిగిన పోలింగ్‌లో 3,86,320 ఓట్లు పోల్ కాగా, వీటికి అదనంగా మరో 1,759 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చి చేరాయి. దీంతో 3,88,079 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్య ఓట్లన్నీ లెక్కించాక కానీ, చెల్లని ఓట్లు ఎన్నో తేలే అవకాశం లేదు. చెల్లని ఓట్లు తీసేశాకనే.. చెల్లిన ఓట్లలో యాభై శాతం ప్లస్ ఒక ఓటును కోటాగా నిర్ణయించనున్నారు. అనధికారిక అంచనా మేరకు ఈ కోటా 1.82 లక్షల ఓట్లు కావొచ్చని అంటున్నారు. తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించే అవకాశం ఏ అభ్యర్థికీ కానరావడం లేదు. ప్రతిరౌండ్‌లో 15 వేల పైచిలుకు ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి వస్తున్నాయి. ఇప్పటికే 79,113 ఓట్లు ఆయన ఖాతాలో పడగా.. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సరాసరి ఇదేస్థాయిలో రెండు రౌండ్లలో కూడా 15 వేల చొప్పున టీఆర్ఎస్కు వస్తే.. పల్లాకు దాదాపు 1.10 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆయన విజయానికి మరో 70 వేల ఓట్ల దూరంలో ఉండిపోతారనుకుంటే.. ఆ ఓట్లన్నీ రెండో ప్రాధాన్యంలో రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఓట్లు రాని పక్షంలో మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి ఉంటుంది. పార్టీల లెక్కలివీ...! ఇప్పటి వరకు రౌండ్ల వారీగా వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు దాదాపు 30 శాతం ఓట్లు పోల్ అవుతున్నాయి. ఆయన 18,549 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఐదు రౌండ్లలో వచ్చినట్లే సరాసరి 3,500 ఓట్ల లీడ్ మిగిలిన రెండు రౌండ్లలో వస్తే, ఆయన మెజారిటీ కనీసం 25 వేలకు చేరుతుందని అంచనా. రెండో స్థానంలో ఉన్న మల్లన్న విజయం సాధించాలంటే పల్లాతో ఉన్న తేడా(లీడ్) 25 వేల ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 28 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. మూడోస్థానంలో ఉన్న కోదండరాం విజయం సాధించాలంటే.. తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే సాధ్యమైనన్ని ఎక్కువ రెండో ప్రాధాన్య ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యంలో కూడా విజేత తేలకపోతే.. తొలి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల నుంచి ఒకరు ఎలిమినేషన్‌కు గురవుతారు. అలా ఎలిమినేషన్‌కు గురైన అభ్యర్థి ఓట్లలోని మూడో ప్రాధాన్యాన్ని మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు పోల్ అయితే ఎవరి ఓట్లను వారికి కలిపి విజేతను ప్రకటిస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయితే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న, పల్లా!
► ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీన్మార్ మల్లన్న లెక్కలు సేకరించే పనిలో నిమగ్నమయ్యా డు. తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ ►కౌంటింగ్ కేంద్రం వద్ద ఎండ వేడికి మజ్జిగ తాగుతున్న పల్లా నిద్ర సుఖమెరుగదు.. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రెండు రోజులుగా ఎఫ్‌సీఐ గోదాములో హమాలీలు 24 గంటలు అలుపెరుగక బాక్సులు మోశారు. కంటికి నిద్ర లేకపోవడంతో ఇలా కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు; చెల్లని ఓట్లు 18,754
సాక్షి, నల్లగొండ : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాగా, అదేరోజు రాత్రి ఏడుగంటల సమయంలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఒక రౌండ్లో 56వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం తెల్ల వారుజామున 2.30గంటలకు తొలిరౌండ్ ఫలితం తేలింది. ఇప్పటివరకు ఆరు రౌండ్లలో 3,35,961 ఓట్లను లెక్కించగా.. వాటిలో 18,754 ఓట్లు చెల్ల కుండాపోయాయి. చెల్లిన 3,17207 ఓట్లలో.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 95,317 ఓట్లు సాధించారు. ఆయనకు 22,843 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక, ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)కు 72,474 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్‌కు 59,705 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 24,268 ఓట్లు లభించాయి. నల్లగొండ శివారులోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వామపక్షాలకు ఆరో స్థానం ఓట్ల లెక్కింపు పూర్తయిన ఆరు రౌండ్లలో వామపక్షాల అభ్యర్థి, సీపీఐకి చెందిన జయసారథి రెడ్డి 8,348 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ 7,881 ఓట్లతో ఏడో స్థానంలో, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి 6,805 ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 22మంది అభ్యర్థులకు కనీసం పది ఓట్లు కూడా పోల్ కాలేదు. ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తున్న అధికారులు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. గెలుపు కోటా నిర్ణయం ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కావాలి్సన కోటా ఇంకా తేలలేదు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్ల లెక్క తేల్చాక ఈ కోటా నిర్ణయం కానుంది. మొదటి ప్రాధాన్య ఓటుతో ఎవరూ కోటా మేర ఓట్లు సాధించని పక్షంలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అప్పటికీ విజేత తేలకుంటే.. మూడో ప్రాధాన్య ఓట్లనూ లెక్కించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కానీ, లేదా శనివారం ఉదయానికి గానీ విజేత ఎవరో తేలనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, ఒక్కో రౌండ్ లెక్కింపునకు ఐదు గంటల సమయం పడుతోంది. ఈ లెక్కన మొత్తం ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి శుక్రవారం తెల్లవారుజామువరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ► మొత్తం లెక్కించిన ఓట్లు 3,35,961 ► చెల్లిన ఓట్లు 3,17,207 ► చెల్లని ఓట్లు 18,754 చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: 18,549 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
గట్టిపోటీ ఇచ్చిన కోదండరాం, నాగేశ్వర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముగియడంతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ జరిగిన సరళి తమ కంటే తమకే అనుకూలమంటూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఆ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా తమ సత్తా చాటుతామని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వాలపై వ్యతిరేకత నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో గిరిజన నేత రాములునాయక్‌కు టికెట్ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్ ఇవ్వడం లాభిస్తుందని అం చనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానిక త పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే జోరు.. ఈసారీ హుషారు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లిన కమలనాథులు కూడా రెండు స్థానాల్లో విజయం తమదేనని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని పట్టభద్రులు విశ్వసించారని, తమకు ఎన్నికల ప్రచారంలో లభించిన స్పందనతోపాటు పోలింగ్ జరిగిన సరళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున అనివార్యంగా తమను ఎంచుకున్నారని, మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న విశ్వాసం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానం రంగారెడ్డితోపాటు బోనస్‌గా నల్లగొండ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని, ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు వెళతామని కమలనాథులంటుండటం గమనార్హం. ఇక సాగర్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నిక వైపు మరలనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ అన్ని రాజకీయ పార్టీలు సాగర్ కేంద్రంగా మకాం వేసి ఎన్నికల రాజకీయం నడిపేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. చెప్పుకోగలిగాం... చేతల్లో చూపిస్తాం పోలింగ్ తర్వాత మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తమ ప్రయత్నానికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. పట్టభద్రులు తమకెందుకు ఓటేయాలనే అంశాన్ని విస్తృతంగా తీసు కెళ్లగలిగామనే అంచనాలో తెలంగాణ భవన్ వర్గాలున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన పార్టీ యంత్రాంగం 10 రోజులుగా పక్కా కార్యాచరణతో ముందుకెళ్లిందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు చెందిన 100కుపైగా సంఘాలు బహిరంగంగా తమకు మద్దతు ప్రకటించినందున ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడ్డాయని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న కొంత వ్యతిరేకతను కూడా సమసిపోయేలా చేయగలిగామని, ఈ రెండుస్థానాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమా టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మొదటి, రెండో ప్రాధాన్యత.. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో రాజకీయపార్టీలు నిమగ్నమయ్యాయి. ఏ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా, రెండో ప్రాధాన్యత విషయంలో క్రాస్ ఓటింగ్ తథ్యమని, ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లోనూ కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్‌ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది. హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి... వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు.
-
తెలంగాణ ఎమ్మెల్సీ: డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా
సాక్షి, నల్గొండ: నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచడం స్థానికంగా కలకలం రేపింది. తాజాగా భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులను ప్రలోబాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్) తదితరులు పోటీ పడుతున్నారు. కాగా నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
నేడే తెలంగాణ ‘పట్టభద్రుల’ ఓటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘హైదరాబాద్’ మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో .. భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 మంది, ‘నల్లగొండ’స్థానంలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు. రెండు స్థానాల్లో 15 వేల మంది అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బంది చొప్పున మొత్తం 8 వేల పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యా యని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్ గోయల్ పేర్కొన్నారు. రెండు నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు శనివారం రాత్రిలోగా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్టు నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 17న (బుధవారం) ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని 8 హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ‘హైదరాబాద్’స్థానానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. నల్లగొండలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ కూడా 8 హాళ్లలో 56 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నారు. ‘హైదరాబాద్’ స్థానం నుంచి సురభి వాణిదేవి (టీఆర్ఎస్), ఎన్.రామచందర్‌రావు (బీజేపీ), జిల్లెల చిన్నారెడ్డి (కాంగ్రెస్), ఎల్.రమణ (టీడీపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు (స్వతంత్ర అభ్యర్థి)లతో సహా 93 బరిలో ఉన్నారు. ‘నల్లగొండ’ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్), రాణిరుద్రమ (యువ తెలంగాణ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో సహా మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుండటం, భారీసైజు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తుండటంతో ఓటర్లు తమ ప్రాధాన్యతల ఆధారంగా అభ్యర్థుల పేర్లను వెతకడం కొంచెం కష్టంగా మారనుంది. పోలింగ్ శాతం పెరిగేనా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పట్టభద్రుల మండలి ఎన్నికలు రాజకీయ వేడి పుట్టించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 85 శాతం అధికంగా ఓటర్ల నమోదు జరిగింది. పోలింగ్ ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే... ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారవర్గాలు ఆశిస్తున్నాయి. ‘తొలి’ప్రాధాన్యత ఇస్తేనే ఓటు చెల్లుబాటు / ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత ఓటు విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ తొలి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్‌కు సంబంధించి సీఈఓ శశాంక్ గోయల్ ఓటర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రంతో పాటు ఇచ్చిన ఊదా (వయోలెట్) రంగు స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటు వేయాలి. మరే ఇతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించరాదు. ఓటరు తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీ గడిలో ‘1’అంకెను రాయాలి. ఓటర్లు తమ తదుపరి ప్రాధాన్యతలను చెప్పడానికి 2 ,3, 4, 5 ... అంకెలను ద్వారా ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో రాయాలి. ఓటు (బ్యాలెట్ పత్రం) చెల్లుబాటు కావడానికి ఓటర్లు తప్పనిసరిగా తొలి ప్రాధాన్యత (1)ను ఇవ్వాలి. మిగిలిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేయడం, వేయకపోవడం ఓటర్ల ఇష్టం. తొలి ప్రాధాన్యత ఓటు వేసి, తదుపరి ప్రాధాన్యత ఓట్లు వేసినా, వేయకున్నా ఓటు చెల్లుబాటు అవుతుంది. ప్రాధాన్యతలను తెలపడానికి అంతర్జాతీయ ప్రామాణిక అంకెలు 1, 2, 3, 4... లేదా రోమన్ అంకెలు ఐ, ఐఐ, ఐఐఐ, ఐV.. లేదా భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ గుర్తించిన ఇతర భారతీయ భాషల్లో ఉపయోగించే అంకెలను వినియోగించవచ్చు. అయితే ఓటరు.. ఒకే భాష/ సంఖ్యా విధానానికి సంబంధించిన అంకెలను మాత్రమే వాడాలి. భిన్నమైన న్యూమరికల్స్‌ను కలిపి ఉపయోగించరాదు. ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కన్నా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. అలా రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఏ ఒక్క అభ్యర్థికి ఒకటి కన్నా ఎక్కువ ప్రాధాన్యతలను ఇచ్చినా ఓటు చెల్లుబాటు కాదు. అభ్యర్థి పేరుకు ఎదురుగా రైట్/ టిక్ గుర్తు లేదా గీ గుర్తులతో ఎంపికను తెలియజేస్తే ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ పత్రంపై ఓటర్లు తమ ఇంటి పేరు, ఇతర పదాలు, సంతకం, పొడి అక్షరాలు రాయకూడదు. వేలిముద్రలు కూడా వేయకూడదు. అలాచేస్తే ఓటు చెల్లదు. ప్రాధాన్యతల ఎంపికను అంకెల్లో మాత్రమే సూచించాలి. ఒకటి, రెండు, మూడు ... అని అక్షరాల్లో రాయకూడదు. అభ్యర్థి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్యత సంఖ్యను రాయాలి. రెండు గడుల మధ్య ఉన్న గీతపై ప్రాధాన్యత అంకెను రాస్తే ఓటు చెల్లుబాటు కాదు. ఓ క్రమపద్దతిలో మడతపెట్టిన బ్యాలెట్ పత్రాన్ని పోలింగ్ అధికారులు ఓటర్లకు అందించనున్నారు. ఓటర్లు మడత విప్పి ఓటు వేసిన తర్వాత మళ్లీ అదే తరహాలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓకే... పట్టభద్రుల ఓటర్లందరికి ఓటరు గుర్తింపు (ఎపిక్) కార్డు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎపిక్ కార్డును తీసుకువచ్చి ఓటేయవచ్చు. ఒకవేళ ఎపిక్ కార్డు అందుబాటులో లేకుంటే ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు ఇండస్ట్రియల్ హౌస్‌లు, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఓటర్లకు విద్యా సంస్థలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, వర్శిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లమా సర్టిఫికేట్ ఒరిజినల్, సంబంధిత అధికారులు జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్. -
వేగంగా టీఆర్ఎస్ పతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం చాలా వేగంగా జరుగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందన్న భావన సరైంది కాదని, అది కేవలం నీటి బుడగ మాత్రమేనని అన్నారు. తన రాజకీయ అనుభవం మేరకు, విశ్లేషకుల పరిశీలనను బట్టి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘాల నేతలతో ఆదివారం ఆయన గాంధీ భవన్లో సమావేశం అయ్యారు. రాములు నాయక్ గెలుపునకు కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలే పెద్ద ఆస్తి అని, కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అదృష్టమని ఉత్తమ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎస్.రాములునాయక్ విజయానికి అనుబంధ సంఘాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చోటా బలంగా ఉన్న పార్టీ కేడర్‌ను ఎన్నికల్లో భాగస్వాములను చేయాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ విధానాలను ఎండగట్టండి టీఆర్ఎస్, బీజేపీల ప్రజావ్యతిరేక విధానాలను పట్టభద్రుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. బీజేపీ మతపరంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఏడేళ్లవుతున్నా దేశానికి, రాస్ట్రానికి చేసింది శూన్యమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో గత 60 ఏళ్ల కాలంలో రూ. 60 వేల కోట్ల అప్పు అయితే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో అప్పు ఏకంగా రూ. 3 లక్షల కోట్లకు చేరిందని ఉత్తమ్ విమర్శించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
మొత్తం 27 నామినేషన్లు చివరి రోజున 21 నామినేషన్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెం డు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకుగాను.. 44 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మల్లన్న నామినేషన్‌కు హాజరైన జిల్లా నేతలు వరంగల్ రూరల్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజవర్గానికి జరుగుతు న్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) నల్లగొండ కలెక్టరేట్లో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లా నేతలు పలువురు తరలివెళ్లారు. అంతకుముందు ఏచూరి గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నను గెలిపించుకునేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. సమావేశంలో ఏఐసీసీ కా ర్యదర్శి, రాష్ట్ర బాధ్యుడు ఆర్సీ.కుంతియా, పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్లు
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకు గాను 44 సెట్లు దాఖలయ్యాయి. చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది.