సాక్షి, నల్లగొండ : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా.. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకాగా, అదేరోజు రాత్రి ఏడుగంటల సమయంలో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఒక రౌండ్‌లో 56వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. గురువారం తెల్ల వారుజామున 2.30గంటలకు తొలిరౌండ్ ఫలితం తేలింది.
ఇప్పటివరకు ఆరు రౌండ్లలో 3,35,961 ఓట్లను లెక్కించగా.. వాటిలో 18,754 ఓట్లు చెల్ల కుండాపోయాయి. చెల్లిన 3,17207 ఓట్లలో.. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 95,317 ఓట్లు సాధించారు. ఆయనకు 22,843 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక, ఆ తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)కు 72,474 ఓట్లు, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్‌కు 59,705 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 34,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 24,268 ఓట్లు లభించాయి.
నల్లగొండ శివారులోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
వామపక్షాలకు ఆరో స్థానం
ఓట్ల లెక్కింపు పూర్తయిన ఆరు రౌండ్లలో వామపక్షాల అభ్యర్థి, సీపీఐకి చెందిన జయసారథి రెడ్డి 8,348 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ 7,881 ఓట్లతో ఏడో స్థానంలో, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి 6,805 ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 22మంది అభ్యర్థులకు కనీసం పది ఓట్లు కూడా పోల్ కాలేదు.
ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తున్న అధికారులు
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. గెలుపు కోటా నిర్ణయం
ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కావాలి్సన కోటా ఇంకా తేలలేదు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లని ఓట్ల లెక్క తేల్చాక ఈ కోటా నిర్ణయం కానుంది. మొదటి ప్రాధాన్య ఓటుతో ఎవరూ కోటా మేర ఓట్లు సాధించని పక్షంలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అప్పటికీ విజేత తేలకుంటే.. మూడో ప్రాధాన్య ఓట్లనూ లెక్కించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కానీ, లేదా శనివారం ఉదయానికి గానీ విజేత ఎవరో తేలనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, ఒక్కో రౌండ్ లెక్కింపునకు ఐదు గంటల సమయం పడుతోంది. ఈ లెక్కన మొత్తం ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి శుక్రవారం తెల్లవారుజామువరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
► మొత్తం లెక్కించిన ఓట్లు 3,35,961
► చెల్లిన ఓట్లు 3,17,207
► చెల్లని ఓట్లు 18,754
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: 18,549 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment