పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ ముగియడంతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ జరిగిన సరళి తమ కంటే తమకే అనుకూలమంటూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఆ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా తమ సత్తా చాటుతామని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వాలపై వ్యతిరేకత
నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో గిరిజన నేత రాములునాయక్‌కు టికెట్ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్ ఇవ్వడం లాభిస్తుందని అం చనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానిక త పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అదే జోరు.. ఈసారీ హుషారు
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లిన కమలనాథులు కూడా రెండు స్థానాల్లో విజయం తమదేనని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని పట్టభద్రులు విశ్వసించారని, తమకు ఎన్నికల ప్రచారంలో లభించిన స్పందనతోపాటు పోలింగ్ జరిగిన సరళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున అనివార్యంగా తమను ఎంచుకున్నారని, మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న విశ్వాసం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానం రంగారెడ్డితోపాటు బోనస్‌గా నల్లగొండ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని, ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు వెళతామని కమలనాథులంటుండటం గమనార్హం.
ఇక సాగర్ ఉప ఎన్నిక
రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి నాగార్జునసాగర్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నిక వైపు మరలనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉప ఎన్నికపై ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసిన వెంటనే మళ్లీ అన్ని రాజకీయ పార్టీలు సాగర్ కేంద్రంగా మకాం వేసి ఎన్నికల రాజకీయం నడిపేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.
చెప్పుకోగలిగాం... చేతల్లో చూపిస్తాం
పోలింగ్ తర్వాత మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తమ ప్రయత్నానికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. పట్టభద్రులు తమకెందుకు ఓటేయాలనే అంశాన్ని విస్తృతంగా తీసు కెళ్లగలిగామనే అంచనాలో తెలంగాణ భవన్ వర్గాలున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన పార్టీ యంత్రాంగం 10 రోజులుగా పక్కా కార్యాచరణతో ముందుకెళ్లిందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు చెందిన 100కుపైగా సంఘాలు బహిరంగంగా తమకు మద్దతు ప్రకటించినందున ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే పడ్డాయని టీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న కొంత వ్యతిరేకతను కూడా సమసిపోయేలా చేయగలిగామని, ఈ రెండుస్థానాల్లోనూ ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమా టీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
మొదటి, రెండో ప్రాధాన్యత..
పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో రాజకీయపార్టీలు నిమగ్నమయ్యాయి. ఏ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా, రెండో ప్రాధాన్యత విషయంలో క్రాస్ ఓటింగ్ తథ్యమని, ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లోనూ కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్‌ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది.
హైదరాబాద్–రంగా రెడ్డి–మహబూబ్‌నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి... వారికి ప్రథమ ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్లలో తమకు ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన
పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment