సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 14న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఫలితాలపై స్పష్టత బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘నల్లగొండ’స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320(76.41%) ఓట్లు పోలవగా ‘హైదరాబాద్’స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి.
‘హైదరాబాద్’స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్‌ఎస్), ఎన్. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావు(ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), ప్రొఫెసర్ ఎం. కోదండరాం (టీజేఎస్) మధ్య నెలకొంది.
ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల లెక్కింపు...
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనుండగా వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు.
పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా... మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10–12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అంటే తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు.
మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు.
హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు
తొలగింపుతో... రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకుంటే.. మొదటి ప్రాధాన్య ఓట్లు అతితక్కువగా వచ్చిన అభ్యర్థిని తొలగించి (ఎలిమేషన్ పద్ధతి) సదరు అభ్యర్థి బ్యాలెట్లలో పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో ఆ అభ్యర్థి ఓట్లకు కలుపుతూ వెళ్తారు. ఇలా మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరినే తొలగిస్తూ వారి రెండో ప్రాధాన్య ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. చివరకు కోటా ఓట్లు ఎవరు పొందుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరూ విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మళ్లీ ఇంతే సమయం పడుతుందని.. తుది ఫలితం 18న రాత్రికి అంటే.. మొత్తంగా కౌంటింగ్ మొదలయ్యాక 48 గంటలు (రెండు రోజులు) పడుతుందని చెబుతున్నారు.
షిఫ్ట్‌లవారీగా సిబ్బంది...
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు సైతం షిఫ్ట్‌లవారీగా ఏర్పాట్లు చేశారు. ‘నల్లగొండ’స్థానం పరిధిలోని 731 పోలింగ్ కేంద్రాలు, ‘హైదరాబాద్’స్థానం పరిధిలోని 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేర్లను ముందుగా కలపడం (మిక్సింగ్), ఆ తర్వాత 25 ఓట్ల చొప్పున ఒక్కో కట్టను కట్టడం వంటి పనులకే సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతనే మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ‘నల్లగొండ’లో ఒక్కో టేబుల్‌కు ఐదుగురు సిబ్బంది చొప్పున, ‘హైదరాబాద్’లో ఒక్కో టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది చొప్పున ఒక్కో షిఫ్ట్‌లో ఓట్లు లెక్కించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment