సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ తీరుపై బీఆర్‌ఎస్ అభ్యర్ధి రాకేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గోల్‌మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.
ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్‌లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.
మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి. చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment