
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం చోటుచేసుకుంది. అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత వచ్చిన బ్యాలెట్ పేపర్ల కంటే ... రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ పేపర్లను తక్కువగా చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 8 మంది ఎలిమినేషన్‌లో ఉండగా, 50 ఓట్లు గల్లంతైనట్లు చూపడంతో బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
దీంతో కాసేపు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియను నిలిపివేసి తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యతలో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ 38, బీజేపీ 17, ప్రొపెఫర్ నాగేశ్వర్ 18, కాంగ్రెస్ 13 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల(8042)తో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి 1, 12, 727 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు 1, 04, 685, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,628 , కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 31,567 ఓట్లతో ఉన్నారు.
కాగా 2015లో జరిగిన ఇదే నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు 31 మందితోపాటు నోటా ఉంది. అయితే, ప్రస్తుతం నోటా లేదు. ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమంలో జరగనున్నందున మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరికీ కోటా ( చెల్లుబాటయ్యే మొత్తం ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ) ఓట్లు రాకుంటే, కోటా ఓట్లు వచ్చేంత వరకు తర్వాతి ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment