ఆందోళన కలిగిస్తున్న ఓటింగ్ సరళి
తొలి మూడు విడతల్లోనూ తగ్గుముఖమే
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు!
ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...
ఈసారి సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు.
102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్‌లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే.
2019లో రికార్డు ఓటింగ్...
2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం.
బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.
ఎందుకు తగ్గుతోంది...!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి...
⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం.
⇒ యూపీలోని గాజియాబాద్‌లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్‌లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్‌లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది.
⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్‌సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం.
⇒ తక్కువ ఓటింగ్‌కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది.
⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు.
⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం.
⇒ మండుటెండలు కూడా ఓటింగ్‌కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు.
⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్‌పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?!
1951 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్‌గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది.
1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్‌పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్‌కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.
అధికార పార్టీకే నష్టమా?
2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్‌కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment