ఈసీ సమాధానం చెప్పాలి: నానా పటోలే
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు.
ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment