సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్‌ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.
ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్‌ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్‌ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్‌లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.
రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment