సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం వాయిదా పడనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఎంఐఎం ఎమ్మెల్యే ముజాంఖాన్ చర్చ ప్రారంభించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఆర్ధిక మాంద్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయలేకపోయిందని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కేంద్రం తీరు ఉందని దుయ్యబట్టారు.
ఈ నెల 9న 2019-20 వార్షిక బడ్జెట్‌ను కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత.. 14వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 14న తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ వివిధ శాఖల పద్దులపై ఎనిమిది రోజులుగా చర్చించి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసనసభ కమిటీలను ప్రకటించనున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, అండర్ టేకింగ్స్ కమిటీ వంటి ఆర్థిక కమిటీలతో పాటు అసెంబ్లీలో మొత్తం 21 కమిటీలు ఉంటాయి. కీలకమైన ప్రజా పద్దులు కమిటీ పదవిని శాసనసభలో రెండో అతిపెద్ద పక్షంగా ఉన్న ఎంఐఎం ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment