కల్వల మల్లికార్జున్‌రెడ్డి : రాష్ట్రసాధనే లక్ష్యంగా ఉద్యమపార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి తొలిసారిగా ‘భారత్ రాష్ట్రసమితి’ రూపంలో ఎన్నికల పరీక్షకు సిద్ధమవుతోంది. జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి ఓవైపు రంగం సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించేందుకు పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రసాధన ఉద్యమంలో ఎన్నికలను అ్రస్తాలుగా మలుచుకొని ఫలితాలు రాబట్టుకున్న కేసీఆర్ ‘హ్యాట్రిక్ అధికారం’ కోసం త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఉపఎన్నికలతోనే ప్రస్థానం షురూ ..: తెలంగాణ రాష్ట్ర సాధనకు టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి ఏకకాలంలో రాజీనామా చేసిన కేసీఆర్ ఉపఎన్నిక ద్వారా టీఆర్‌ఎస్ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2001లో సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి భారీ విజయం సాధించారు.
కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన..: టీఆర్‌ఎస్ 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఉమ్మడి ఏపీలో 46 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 26 చోట్ల విజయం సాధించింది. రాష్ట్ర ఏర్పాటుపై మాట తప్పిందనే కారణంతో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు.
2006 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో ఎంపీగా మరోమారు కేసీఆర్ విజయం సాధించారు. 2008లో టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లగా, కేవలం ఏడుగురు మాత్రమే గెలుపొందారు. భారీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆ తర్వాత పార్టీ నేతల ఒత్తిడితో ఉపసంహరించుకున్నారు.
ముందస్తు ఎన్నికలతో రెండోసారి అధికారం..: ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తూ 2018 సెపె్టంబర్ 6న కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు రద్దు నిర్ణయంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఏకకాలంలో 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అన్ని చోట్లా పోటీ చేసి 88 చోట్ల విజయం సాధించింది. వరుసగా రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.
తర్వాతి కాలంలో కోరుకంటి చందర్ (ఏఐఎఫ్‌బీ), రాములునాయక్ (ఇండిపెండెంట్)తో పాటు 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో అసెంబ్లీలో పార్టీ సంఖ్యాబలం 104కు చేరింది. గడిచిన నాలుగేళ్లలో 2018–22 మధ్యకాలంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, మునుగోడులో టీఆర్‌ఎస్ హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు.
బీఆర్‌ఎస్ రూపంలో తొలి పరీక్ష ..: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చారు. బీఆర్‌ఎస్ పేరిట తొలిసారిగా ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ ఒకే జాబితాలో 115 మంది పేర్లు కేసీఆర్ ప్రకటించారు.
తొలిసారిగా చేజిక్కిన అధికార పగ్గాలు..: 2014 ఎన్నికల్లోఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ 119 స్థానాల్లో పోటీ చేసి 63 చోట్ల విజయం సాధించింది. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఎస్‌పీ, సీపీఐ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం భారీగా పెరిగింది. నారాయణఖేడ్, పాలేరు ఎమ్మెల్యేల(కాంగ్రెస్) మరణంతో 2016లో వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది.
మహాకూటమితో కేసీఆర్ జట్టు..: 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమితో టీఆర్‌ఎస్ జట్టు కట్టింది. 45 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయగా, 10 సీట్లే గెలిచింది. తర్వాత పార్టీలో చేరిన చెన్నమనేని రమేశ్ (వేములవాడ) సహా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. 2011 ఉపఎన్నికలో బాన్సువాడలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం విజేతగా నిలిచారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతున్న దశలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, గంప గోవర్దన్, జూపల్లికృష్ణారావు, తాటికొండ రాజయ్య 2012లో రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. నాగర్‌కర్నూలు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన నాగం జనార్దన్‌రెడ్డికి టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే ఉప ఎన్నికలో మహబూబ్‌నగర్ నుంచి ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment