Sirpur
-
కాంగ్రెస్ గూటికి ‘పాల్వాయి’?
సాక్షి, ఆసిఫాబాద్: సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాత్రం తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం.. సిర్పూర్ నియోజకవర్గంలో హరీశ్‌బాబు గట్టి ప ట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన పాల్వాయి హరీశ్‌బాబు ఆర్థోపిడిక్ సర్జన్. 2017 నవంబరులో రాజకీయ అరంగ్రేటం చేశారు. బెజ్జూర్ మండలం రెబ్బన గ్రామంలో 10 అంశాలతో రాజకీయ ఎజెండాను రూపొందించి ప్రజల్లోకి వచ్చారు. ఏడాది పాటు రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ టికెట్‌తో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికలే ధ్యేయంగా పావులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల్ని కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పాల్వాయి హరీశ్‌బాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాక హరీశ్‌బాబు వెంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రావడం.. ప్రజల్లో కూడా అతనిపై సానుభూతి ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో పాల్వాయికి కలిసొచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా పార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌బాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం నియోజవర్గంలో తిరుగుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు తదితరాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐదు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కుమురంభీం క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ‘సిర్పూర్ అభివృద్ధి కోసమే కలిశా’ కౌటాల(సిర్పూర్): సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే హరీశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఎమ్మెల్యేను సంప్రదించగా.. ముఖ్యమంత్రి కేవలం పార్టీ ప్రతినిధి కాదని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అని అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పనుల కోసం సీఎంను కలుస్తున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకు తావులేదని స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. -
సిర్పూర్ పైనే ఏనుగంత ఆశ!
సాక్షి, హైదరాబాద్: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి. ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. సిర్పూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌లకు పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు పంచుకుంటే బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ సిర్పూర్‌తో పాటు చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ సోదరుడు ఆర్. ప్రసన్న కుమార్ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భావిస్తున్నారు. -
పొదరిల్లు చేసుకున్నం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పొదరిల్లుగా మార్చుకున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆం్ర«ధాలో కలపడం వల్ల 50ఏళ్లకుపైగా గోసపడ్డామన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ గోస మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అందరూ ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని, లేకపోతే మోసపోయి గోస పడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుము రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌తోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రం వచ్చినప్పుడు ఏమీ లేకుండే. సాగు, తాగునీరు లేదు. రైతులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు జరిగేవి. అన్నింటా దళారీ వ్యవస్థ ఉండేది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పోతున్నాం. రాష్ట్రం ఓ పొదరిల్లుగా మారింది. అవినీతి లేని పాలన అందిస్తున్నాం. భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు అందుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించాం. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 15 నుంచి 20ర్యాంకులో ఉండేది. ఇప్పుడు నంబర్ వన్‌గా మారింది. ఇదంతా మంత్రమో, మాయ చేస్తేనో అయితదా? పట్టుదలతో పనిచేస్తున్నాం. నిజాం స్థాపించిన సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉంది. వంద శాతం రాష్ట్ర వాటా ఉండాల్సిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి 49శాతం వాటా ఇచ్చింది. వాళ్లు ఉన్నన్ని రోజులు కంపెనీకి లాభాలు రాలేదు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. కార్మికులకు బోనస్‌లు పెంచాం. రాష్ట్రాన్ని జాప్యం చేసి గోస పెట్టింది బీఆర్ఎస్ 24 ఏళ్ల కింద పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించకున్నాం. అంతకుముందు 50ఏళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలకులు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గోస పడ్డాం. ఉప్పెనలా ఉధృతంగా ఉద్యమం చేస్తే 2004లో ఎన్నికల ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు కాగానే మాట తప్పింది. మళ్లీ గోస పెట్టింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు పోరాడితే.. చివరికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ ఎందుకని.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్ పథకమని అంటున్నారు. భూవివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి లంచం ఇవ్వకుండానే అరగంటలో అయిపోతున్నాయి. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలా అంటున్నవారినే బంగాళాఖాతంలో వేయాలి. ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది. రైతుబంధు, ఉచిత విద్యుత్ ఉండాలంటే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే సాధ్యం. వారికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నారని గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలే రోజూ లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి అధికారమిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారు. అందుకే ప్రజల కోసం పనిచేసే వారిని, కష్టపడే పార్టీని ఎన్నుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైటు వెలుగుతుంది. కానీ మాకు తెలంగాణ ప్రజలే బాసులు. గిరిజనేతరులకూ పట్టాలిస్తాం పారిశ్రామికంగా సిర్పూర్ కాగజ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ తెచ్చుకోబట్టే ఆసిఫాబాద్ జిల్లా అయ్యింది. గతంలో వానాకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని పత్రికల్లో వచ్చేది. ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ, వంద పడకలతో ఆస్పత్రి వచ్చాయి. ఆసిఫాబాద్‌లో 47వేలు, సిర్పూరులో 16 వేల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం. గిరిజనేతరులకూ త్వరలో పట్టాలు ఇస్తాం. ఈ విషయంలో కేంద్రం అడ్డంకిగా మారింది. ఆలోచించి ఓటు వేయండి ఓటు వేసే ముందు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచించాలి. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను విచారించి ఓటు వేయాలి. మీరు వేసే ఓటు వచ్చే ఐదేళ్లు మీ తలరాతను నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం, మతం లేదు. అందరినీ కలుపుకొని పోతున్నాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. బీఆర్ఎస్ కంటే ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ముస్లింల కోసం వాళ్లు రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. మేం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అన్నీ ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..’’ అని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎంపీ వెంకటేశ్‌నేత, తదితరులు పాల్గొన్నారు. ïసీఎం సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. మరోసారి మొరాయించిన హెలికాప్టర్ సీఎం కేసీఆర్ పర్యటనల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ మరోసారి మొరాయించింది. మూడు రోజుల కింద బీఆర్ఎస్ సభల కోసం బయలుదేరిన ఆయన హెలికాప్టర్లో సమస్య వల్ల ఫామ్‌హౌజ్‌కు వెనుదిరిగి.. మరో హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం కాగజ్‌నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్లో వెళ్లిన సీఎం.. అది ముగిశాక ఆసిఫాబాద్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ హెలికాప్టర్లో సాంకేతికలోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ సభ ముగిసేలోపు పైలట్ హెలికాప్టర్లో సాంకేతికలోపాన్ని సవరించి ఆసిఫాబాద్‌కు తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్ హెలికాప్టర్లో బెల్లంపల్లి సభకు హాజరై, తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. -
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్‌ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
కాంగ్రెస్ దోఖా పార్టీ.. సీఎం కేసీఆర్
సాక్షి, సిర్పూర్ : కాంగ్రెస్ దోఖా పార్టీ అని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం సిర్పూర్లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్లో 16 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ధరణి పోర్టల్ తెచ్చామన్నారు. ధరణి తీసేస్తే కథ మళ్లీ మొదటికొస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజల చేతిలో ఉన్న వజజ్రాయుధం ఓటని చెప్పారు. ‘కాంగ్రెస్ కు బాసులు ఢిల్లీలో ఉంటరు.. మాకు తెలంగాణప్రజలే బాసులు. ఓటు వేసేటపుడు విజ్ఞతతో వ్యవహరించాలి. ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల మీ తలరాతను మారుస్తుంది. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి విచక్షణతో ఓటు వేయాలి. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టింది’ అని కేసీఆర్ తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది?
సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్ స్వల్ప జ్వరంతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చింతలమానెపల్లి(సిర్పూర్): గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లుగా ఆర్ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు. ధనార్జనే ధ్యేయం.. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనలను ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌ల్లో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సి వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకేగదిలో నిర్వహిస్తుండడం గమనార్హం. పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ల్లోనూ ఆర్ఎంపీ క్లినిక్‌లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు పోతున్నా చర్యలేవి..? ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కిల్లింగ్ ఇంజక్షన్స్.. ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్ ఇంజక్షన్’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ముప్పు వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది. – అరుణకొండ రవికుమార్, ఎండీ జనరల్ ఫిజీషియన్, మంచిర్యాల ఎక్కువ డోస్ మందులతోనే.. రోగుల జ్వరం తీవ్రతతతోపాటు ప్లేట్‌లెట్స్‌ను కూడా వైద్యులు గమనించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ఫ్లూయిడ్స్, నరాల ద్వారా ఇచ్చే మందులను పరిశీలనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డోస్ మందులను తీవ్రస్థాయిలో వినియోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. – సందీప్ జాదవ్, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు -
20 మందితో బీఎస్పీ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్‌తో కలసి పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తున్నామని, త్వరలో మరికొందరు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రకటనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనలు చేశారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆచరణలో అమలుకాని హామీలతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ఉంటున్నాయని విమర్శించారు. అధికారాన్ని అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడం ఎందుకని నిలదీశారు. బీఎస్పీ ప్రజాబలం ఉన్న పార్టీ అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధనబలమే తప్ప ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. బీఎస్పీ తొలి జాబితా ఇదీ.. సిర్పూర్ – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జహీరాబాద్ – జంగం గోపి, పెద్దపల్లి – దాసరి ఉష, తాండూరు – చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ – ముడావత్ వెంకటేశ్ చౌహాన్, చొప్పదండి – కొంకటి శేఖర్, పాలేరు – అల్లిక వెంకటేశ్వర్రావు, నకిరేకల్ – మేడి ప్రియదర్శిని, వైరా – బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి – నక్క విజయ్ కుమార్, వనపర్తి– నాగ మోని చెన్నరాములు, మానకొండూరు – నిషాని రామచందర్, కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ – బన్సీలా ల్ రాథోడ్, ఆందోల్ – ముప్పారపు ప్రకాశ్, సూర్యా పేట – వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ – గో ర్లకాడి క్రాంతికుమార్, కొత్తగూడెం– ఎర్ర కామేశ్, జుక్కల్– ప్రద్న్య కుమార్ మాధవరావు ఏకాంబర్. -
తాను పోటీచేసే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!
ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్‌కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా? కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గుడ్‌బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్‌కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఈసారి బీజేపీ నుంచి పోటీ తప్పదా?
కుమ్రం భీమ్ జిల్లా కేంద్రమైన సిర్పూర్ పట్టణం రాత మారుస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నియోజకవర్గం రాత మార్చలేకపోయిన ఎమ్మెల్యే తన మాటనే మార్చుకున్నారు. సీనియర్ నాయకుడు కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో కారు పార్టీ గుర్తు మీదే విజయం సాధించారు. అంబలి, అన్నదానం, నిరుపేద విద్యార్థులకు విద్యాదానంతో కోనప్ప రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాని నియోజకవర్గాన్ని చెప్పినంత స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా మూతపడ్డ నిజామ్ నాటి పేపర్ మిల్లును పట్టుబట్టి ప్రైవేటు యాజమాన్యం ద్వారా ప్రారంభింపచేశారు. దీనికి కేసీఆర్ సర్కార్ రాయితీలు కూడా ఇచ్చింది. పేపర్ పరిశ్రమ మూతపడేనాటికి ఉన్న ఉద్యోగులందరికీ మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు. కాని పరిశ్రమ ప్రారంభం తర్వాత పాతవారికి పర్మినెంట్ ఉద్యోగాలు దక్కలేదు. మొత్తం ఉద్యోగాలన్ని ఉత్తరాది వారితో నింపేశారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. స్థానిక రెగ్యూలర్ ఉద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వకపోయినా..ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందంటున్నారు. పేపర్ మిల్లు పునరుద్దరించింది.. ఎవరి కోసం అంటూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కోనప్పపై మండిపడుతున్నారు. నియోజకవర్గం లో సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగడం లేదు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, కుమ్రం బీమ్ ప్రాజెక్టు కాల్వలు పూర్తికాలేదు. పీపీరావు ప్రాజెక్టు పనులు ఏళ్ళతరబడి సాగుతున్నాయి. ప్రాణహిత-చేవేళ్ల పై సర్కారు చేతులు ఎత్తేసింది. వార్థా బ్యారేజీ చేపడుతామని ప్రకటించినా అది కాగితాలకే పరిమితమైంది. పోడు భూముల సమస్య తీర్చితామని అనేకసార్లు హమీ ఇచ్చారు కోనప్ప. అయితే హక్కు పత్రాలు పంపిణీ చేయడంలో సర్కారు కాలయాపన చేస్తోంది. దీంతో పోడు రైతులు సర్కార్ పై ఉద్యమిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా..సేవా కార్యక్రమాలతో ఎన్నికలలో గట్టేక్కిస్తామని భావిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇదిలాఉంటే..బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు పోడు భూములపై పోరాటం సాగిస్తూ..ప్రజల్లో బలపడుతుండటం కోనప్పకు ఆందోళన కలిగిస్తోందట. గత ఎన్నికలలో ఓడినా సానుభూతి తోడువుతుందని..అదేవిధంగా హిందూత్వ ఓటు బ్యాంకు తోడైతే కోనప్పను ఓడించడం ఖాయమని భావిస్తున్నారట బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు. మరోవైపు రావి శ్రీనివాస్ బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. తెలంగాణలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అసిఫాబాద్. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అదివాసీల ప్రాబల్యం అత్యధికంగా ఉంటుంది. అసిఫాబాద్ నుంచి గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అత్రం సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామలతో అత్రం సక్కు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారు పార్టీలో చేరిపోయారు. ఈసారి గులాబీ పార్టీ నుండి పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. -
సిర్పూర్ ఆదివాసీ కోటను కాపాడండి!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది గోండుల కోట. సిర్పూర్ ఒకప్పుడు గోండు (కోయ) రాజుల ఏలుబడిలో వున్న ప్రాంతం. దీనినే పూర్వ కాలంలో సూర్యపురంగా పిలిచేవారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు (కోయ) రాజు భీమ్ బల్లాలా పాలించాడు. ఈయన కాలంలోనే సిర్పూర్ కోట నిర్మితమైంది. ఈ రాజ్యానికి సరిహద్దుగా సిరోంచా, చంద్రపూర్, ఊట్నూర్, అహేరి, ఆసిఫాబాద్ కేంద్రాలుగా గోండు రాజ్యాలుండేవి. ముస్లిం, బ్రిటిష్ సైన్యాలు దండయాత్రలు చేసి ఈ రాజ్యాలను ఆక్రమించి కొల్ల గొట్టాయి. అయినా అలనాటి గోండు రాజ్యాల ఆనవాళ్ళు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఊట్నూర్, సిర్పూర్ టౌన్లలో ఉన్న కోటలు. ఈ చారిత్రక కోటలు నేడు కబ్జాకోరల్లో చిక్కుకొని ఆనవాళ్ళు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సిర్పూర్ టౌన్ కేంద్రంగా ఉన్న గోండు రాజుల కోట దాదాపుగా 10 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఉండేది. ప్రస్తుతం కోటగోడ, కోట స్థలంలో ఉన్న శిథిలావస్థకు చేరిన కొలను చూడవచ్చు. ఆ కోట భూములు రికార్డుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ కోట నేడు భూ కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?) తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రభుత్వానికి మన చరిత్ర, సంస్కృతుల పట్ల ఉన్న మక్కువకు ఇది నిదర్శనం. అటువంటి ప్రభుత్వం ఉన్న కాలంలోనూ సిర్పూర్ కోట ఆక్రమణలకు గురవ్వడం బాధాకరం. ఇప్పుడు ఆ భూమిలో గ్రామ పంచాయితీ, హస్పిటల్, రోడ్లు, ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ళు ఉన్నాయి. కోటను భూకబ్జాదారుల నుంచి కాపాడి, రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణ కిందికి తేవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) – పోలేబోయి అశోక్ ఆదివాసీ చరిత్ర అధ్యయన వేదిక, సిర్పూర్ కాగజ్‌నగర్ -
యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్ చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
బెజ్జూర్ (సిర్పూర్): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్.. నీపై కేసులు బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్ అటవీ శాఖ ఎఫ్ఎస్వో ప్రసాద్ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్‌పై ఎఫ్ఆర్వో దయాకర్‌ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్కే మోహిత్ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, ఎఫ్ఎస్వో ప్రసాద్, బీట్ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు. -
ఆడపిల్ల పెళ్లికి కానుకగా రూ.5,016..
ఆడపిల్లా.. అంటూ ఇప్పటికీ ముఖం చిట్లించే వారెందరో! కానీ ఈ ముగ్గురూ ఆడపిల్ల పుట్టుకను పండుగ చేస్తున్నారు. ఓ సర్పంచ్ ఆడపిల్ల పుడితే రూ.5 వేలు కానుకగా ఇస్తుంటే.. ఇంకో సర్పంచ్ ఆడపిల్లకు కట్నంగా రూ.5,016 అందజేస్తున్నారు. ఇంకో వైద్యురాలు ఆడపిల్ల పుడితే ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు. ఈ ముగ్గురి పరిచయం.. ఆడబిడ్డ కట్నం రూ.5,016 ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ సర్పంచ్ నేరెళ్ల హేమలత మహిళా ప్రజాప్రతినిధిగా గ్రామాన్ని ప్రగతిపథంలో నడపడమే కాదు.. ఆ ఊళ్లో పుట్టే ప్రతి ఆడపిల్లకు అండగా నిలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఏ ఇంట ఆడబిడ్డ పెళ్లి జరిగినా కట్నంగా రూ.5,016 ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 36 యువతులకు చెక్కులను అందించారు. ఇటీవలే ఒకేసారి గ్రామంలో 67 మందికి కరోనా పాజిటివ్ రాగా పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి బాధితులకు పౌష్టికాహారం అందించారు. వలసకూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందచేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఆడబిడ్డలకు పెండ్లి కానుకతో పాటు, తోటివారికి తోచిన సాయం చేస్తానని సర్పంచ్ హేమలత చెబుతున్నారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఆదర్శంగా నిలుస్తున్న బీబ్రా సర్పంచ్ దహెగాం(సిర్పూర్): ఆడపిల్ల పుడితే తల్లి పేరిట రూ.5వేలు కానుకగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురంభీం జిల్లా దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన వెంటనే తన సొంత డబ్బును పోస్టాఫీసులో మాతృమూర్తి పేరిట డిపాజిట్ చేస్తున్నారీయన. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పే ఈయన.. ఆడపిల్లను తల్లిదండ్రులకు బరువుగా భావించకూడదంటారు. 2020 జూన్ 2న, తన తల్లిదండ్రులైన బండ సుదర్శన్–సులోచనల పెళ్లిరోజును పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్ చేస్తానని ఈయన గ్రామస్తుల ముందు ప్రకటించి.. అలాగే చేస్తున్నారు. ‘అపూర్వ’ సాయం భైంసాటౌన్(ముథోల్): ఆడపిల్ల అని తెలిస్తే.. గర్భంలోనే చిదిమేస్తున్న తల్లిదండ్రులను చూసి చలించిన ఆమె.. తనవంతుగా ఆడశిశువును బతికించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చేవారికి ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారు. భైంసాకు చెందిన డాక్టర్ అపూర్వ.. భర్త డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి భైంసాలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 2016 నుంచి తమ ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న వారికి ఆడబిడ్డ పుడితే ఎలాంటి రుసుం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 400 ఉచిత ఆపరేషన్లు చేశామని అంటున్నారీమె. ‘గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చాలామంది అబార్షన్ చేయిస్తున్నారు. వైద్యవృత్తిలో ఉన్నందుకు మా వంతుగా ఆడపిల్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నా’మని చెప్పారు డాక్టర్ అపూర్వ. -
కాగజ్‌నగర్‌లో వలస కార్మికుడి ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వలస కార్మికుడు గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా సోలాపూర్ తాలూకా ధాన్గంజ్ ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (21), కొంతమంది అక్కడి యువకులతో కలిసి జనవరిలో గుజరాత్‌కు చెందిన అవినాష్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక సిర్పూర్ పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడి (కూలి)గా చేరాడు. కాంట్రాక్టు కార్మికులకు మిల్లు యాజమాన్యం స్థానిక ఓల్డ్ కాలనీలోగల కంపెనీకి సంబంధించిన డి టైప్ క్వార్టర్ కేటాయించింది. అందులో వికాస్‌తోపాటు ఐదు గురు కార్మికులు నివాసముంటున్నారు. లాక్డౌన్ అమలుతో వీరంతా ఇక్కడే చిక్కుకున్నారు. మిల్లు యాజమాన్యం, కాంట్రాక్టర్ కార్మికులకు ఆహార సామగ్రి అందిస్తున్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఉపాధి లేక 15 రోజులుగా వికాస్ చౌహాన్ సొంతూరుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. శ్రామిక్ రైలు ద్వారా వారణాసి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన క్వార్టర్‌లోనే గురువారం ఉరేసుకున్నాడు. తోటి కార్మికుడు పోలీసులకు సమాచారం అందించారు. వికాస్ చౌహాన్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వికాస్ చౌహాన్ మృతదేహం -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
సాక్షి, ఆసిఫాబాద్ : సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమనాయకుడైన కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్సీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల ఆయన కుటుంబీకులు, నియోజకవర్గ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపుతూ ఈ విషాద సమయంలో గుండెనిబ్బరంతో ఉండాలన్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. -
వేధింపులకే వెళ్లిపోయాడా?
సాక్షి, సిర్పూర్(టి)(కాగజ్‌నగర్): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పిట్టల నవీన్ (16) అనే విద్యార్థి శనివారం పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన శవమై కనిపించాడు. పాఠశాల నుంచి ఈనెల 11న మధ్యాహ్నం బయటికి వెళ్లిన పిట్టల నవీన్ తిరిగిరాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత గురువారం సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో విద్యార్థి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. సిర్పూర్(టి) ఎస్సై వెంకటేష్ దర్యాప్తు చేస్తుండగా శనివారం సాయంత్రం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన చెట్ల పొదల్లో ఓ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు నవీన్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విద్యార్థి తల్లితండ్రులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం తమ కుమారునిదే అని గుర్తించారు. తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన విద్యార్థి ఆత్మహత్య తన కొడుకు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి చేదేడు వాదోడుగా నిలుస్తాడని కోటి ఆశలతో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో తల్లితండ్రులు చేర్పించగా తన కొడుకు అర్ధాంతరంగా పాఠశాల నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థి తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బందువులు, ఎమ్మార్పీఎస్ నాయకుల ధర్నా బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ల వేధింపులకు పాఠశాల నుంచి పారిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నవిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 20లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని, మూడు ఎకరాల భూమి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. పీడీ సుమిత్, ఆర్మీ ఇన్స్స్ట్రక్టర్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేస్తున్నామని, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్‌పై విచారణ చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఆర్సీవో గంగాధర్ తెలిపారు. అంత్యక్రియల కొరకు తక్షణ ఆర్థిక సహాయంగా 30వేల రూపాయల నగదును అందజేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శోకసంద్రం నడుమ విద్యార్థి అంత్యక్రియలు కౌటాల(ఆసిఫాబాద్): నవీన్ అంత్యక్రియలు ఆదివారం కౌటాలలో శోకసంద్రంనడుమ ముగిశాయి. మృతుడి తండ్రి శ్రీనివాస్ కౌటాల గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి తమ్ముడు ప్రవీణ్, చెల్లి నవ్య ఉన్నారు. వేధింపులతోనే మృతి తమ కుమారుడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ టీచర్, తెలుగు టీచర్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, బందువులు ఆరోపించారు. -
చేపల వలకు చిక్కి.. జీవచ్ఛవాలుగా మారి..
చింతలమానెపల్లి (సిర్పూర్): ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదం మిగిల్చింది. శనివారం గల్లంతైన బీట్ అధికారులు మంజం బాలకృష్ణ ((31), బదావత్ సురేష్ నాయక్ (35)ల మృతదేహాలు సోమవారం లభ్యమ య్యాయి. చేపల వలకు చిక్కి జీవచ్ఛవాలుగా కనిపించాయి. ఉదయం నుంచే చింతలమానెపల్లి, మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్లకు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో నదిలో చేపల వేటకు ఏర్పాటు చేసిన వలలో మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి. ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీం ఇన్స్పెక్టర్ పవన్ ఆధ్వర్యంలో మృతదేహాలను బయటకు తీశారు. కాగా, ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందడం పట్ల అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
ముగ్గురిని మింగిన బావి పూడ్చివేత
సాక్షి, సిర్పూర్: కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కారెం మహేష్, గాదిరెడ్డి రాకేష్, మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని శికిరం గ్రామానికి చెందిన సొక్కల శ్రీనివాస్‌లు బావిలో దిగి ఊపిరాడక బుధవారం మృతి చెందారు. ఆరుగంటల పాటు అధికారులు శ్రమించి జేసీబీ, ప్రోక్లియిన్‌లతో బావి చూట్టు తవ్వకాలు జరిపారు. బావిలో ఆక్సిజన్ నింపి బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బావి చుట్టూ తవ్విన మట్టిని జేసీబీల సహాయంతో పూడ్చివేశారు. రాత్రి కావడంతో పూర్తిగా పూడ్చివేత పనులు నిర్వహించలేదు. బావిని పూర్తిగా పూడ్చివేస్తామని అధికారులు తెలిపారు. కంటతడి పెట్టిన ముత్తంపేట ముత్తంపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బంధువులు బావిలో దిగి మృతి చెందడంతో గ్రామంలోని యువకులు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బావిలో దిగి ముగ్గురు మృతి చెందిన వార్త మండలంలో సంచలనం రేపడంతో గురువారం ఉదయం యువకుల అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి వారి మృతదేహాలకు నివాళ్లు అర్పించారు. ఇద్దరు యువకుల మృతదేహాలకు ఒకేసారి గ్రామంలో చివరి అంతిమ యాత్ర నిర్వహించడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి మెలిసి ఉండే యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరునా విలపించారు. -
వైఎస్సార్ నా గురువు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే
నియోజకవర్గంలో ఏటా అంబలి పంపిణీతో ఎనలేని సంతృప్తినిస్తుంది. నాకు భక్తిభావం ఎక్కువే. శ్రీవేంకటేశ్వర స్వామిని ఇష్టదైవంగా కొలుస్తా. మాది 13 మందితో ఉమ్మడి కుటుంబం. నా ప్రతీ పనిలో నా భార్య రమాదేవి సహకారం మరువలేనిది. ఎస్పీఎం (సిర్పూర్ పేపర్ మిల్లు)ను తెరిపించేలా చూడాలని ఏ గుడికి వెళ్లినా మొక్కుకునేవాడిని. మిల్లు పునఃప్రారంభం కావడం ఎంతో బలాన్నిచ్చింది. ఖాళీ సమయాల్లో మనువలు, మనువరాళ్లతో గడుపుతుంటా’ అంటున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ‘సాక్షి’ పర్సనల్ టైం ఆయనను పలుకరించగా.. అనేక విషయాలు వెల్లడించారు. సాక్షి, ఆసిఫాబాద్: మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కోనేరు సూర్యనారాయణ, అమ్మ క్రిష్ణవేణి. నలుగురు అన్నదమ్ములం, నలుగురు అక్కాచెల్లెళ్లు. నేను రెండోవాడిని. కాగజ్‌నగర్ సర్‌సిల్క్‌లోని జెడ్పీహైస్కూల్లో పదోతరగతి పూర్తి చేశా. ఇంటర్ ఇక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివా. ఆ తర్వాత సర్సిల్క్లో క్యాంటీన్ స్టోర్ కీపర్‌గా పనిచేశా. 1984లో మిల్లు మూతపడడంతో కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో కర్ర బొగ్గు వ్యాపారం చేశా. కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశా. అప్పట్లో మాకు రెండెకరాల భూమి ఉండేది. అంతా కలిసి వ్యవసాయం చేసేవాళ్లం. మాది ఉమ్మడి కుటుంబం.. మా మేనమామ కూతురు రమాదేవితో 1981లో మా వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వంశీకృష్ణ వివాహం జరిగింది. నాకు చేదోడువాదోడుగా ఇక్కడే ఉంటున్నాడు. అమ్మాయి ప్రతిమ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రతీ పనిలో నా భార్య రమాదేవి నాకు ఎంతగానో సహకరిస్తుంది. రోజూ అంబలి తయారు చేసి పంపిణీ చేయడంలో ఆమె సహకారం మరువలేనిది. ప్రస్తుతం మా అన్నదమ్ముల కొడుకులు, మనుమలు, మనరాళ్లతో మొత్తం 13 మంది ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసే ఉంటున్నాం. మొక్కులు బాకీ ఉన్నాయి.. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడిన మూడున్నరేళ్లు నేను ఏ గుడికి వెళ్లినా మిల్లు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని మొక్కుకునే వాడిని. తిరుపతి, వేములవాడ, కొండగట్టు, బెజవాడ కనకదుర్గమ్మతో పాటు నాగ్‌పూర్, అజ్మీర్ దర్గాలు, రాజస్థాన్‌లోని సలాసర్ గుడి, కర్ణాటకలోని పలు గుళ్లకు వెళ్లినప్పుడు మొక్కుకున్నా. మిల్లు పునఃప్రారంభం కావడంతో ఒక్కో మొక్కు తీర్చుకుంటూ వస్తున్నా. ఇంకా కొన్ని మొక్కులు ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది. సేవ చేయడం ఇష్టం.. వేసవిలో నిత్యం మా ఇంటి నుంచి ఐదు వేల లీటర్ల అంబలి తయారు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వార సంతలతోపాటు కాగజ్‌నగర్ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అందిస్తున్నాం. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, బసవతారకం ఆసుపత్రుల్లో ఎంతో మంది రోగులకు పంపిణీ చేశాం. అంబలి తాగిన వారు ‘కడుపు చల్లగా ఉండా’ అని దీవిస్తుంటారు. ఆ దివేనలు నాకు చాలు. ఇంత మంది దీవెనలు ఎంతో సంతృప్తినిస్తాయి. ఒక పూట భోజనం పెట్టాలి.. నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి నిత్యం కాగజ్‌నగర్‌కు వేలాది మంది వస్తుంటారు. వాళ్లలో అనేక మంది మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటారు. అలాంటి వారి కోసం పట్టణంలో ప్రతి రోజూ ఒకపూట భోజనం పెట్టాలని అనుకుంటున్నా. ఇప్పటికే 25వేల ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, కోనేరు కిట్ పేరు మీద గర్భిణులకు పోషకాహార కిట్ అందించాం. విద్యార్థులకు బుక్స్, స్పోకెన్ ఇంగ్లిష్ మెటీరియల్‌తో పాటు సైనిక్ స్కూల్ ప్రవేశాలు, పోలీస్, అటవీ ఉద్యోగాల పరీక్షల సన్నద్ధత కోసం ఉచితంగా కోచింగ్ ఇచ్చాం. సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు 2018లో కోనేరు ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. వైఎస్సార్ నా గురువు.. రాజకీయాల్లో నాకు ప్రధాన గురువు అంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెబుతా. క్రీయాశీలక రాజకీయాల్లోకి రాక ముందు మొదట కేవీ నారాయణరావు హయాంలో టీడీపీ సానుభూతిపరుడిగా ఉండేవాడిని. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరా. కార్మిక నాయకుడు జి.సంజీవరెడ్డి నాయకత్వంలో ఎస్పీఎం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా. తొలిసారి 1999లో కాంగ్రెస్ నుంచి సిర్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా. ఓటమితో కుంగిపోయి ఉండడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టిన సమయంలో వైఎస్సార్ నాకు ఎంతో తోడ్పాటునిచ్చారు. అనేక రకాలుగా భరోసా నింపారు. వైఎస్సార్ హయాంలోనే 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందా. 2009లో పోటీ చేసి ఓడిపోయినా తిరిగి 2014లో రెండోసారి, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్నల ప్రోత్సాహం ఉంది. అప్పట్లో జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ సులాన్ అహ్మద్ నాకు రాజకీయంగా అండగా ఉన్నారు. అయితే మొదట్లో నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ‘సాక్షి’లో వ్యాసానికి పారితోషికం.. ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడి రైతులకు ఎంత ఆవశ్యకమో తెలియజేస్తూ 2010లో ‘సాక్షి’ దినపత్రికలో వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలకు చక్కటి స్పందన వచ్చింది. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యం నుంచి పారితోషికంగా నాకు రూ.1500 డీడీ పంపారు. తీపి గుర్తుగా ఆ డీడీని దాచుకున్నా. ఇప్పటికీ నాకు అనేక విషయాలపై వ్యాసాలు రాయాలని ఉంటుంది. కానీ వీలు కుదరడం లేదు. ‘మంత్రి’ సాధ్యపడకపోవచ్చు.. మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు ఉన్నప్పటికీ సీనియార్టీ, ప్రాంతం, సామాజిక, జిల్లాల వారీగా తదితర సమీకరణలు చూసినప్పుడు నాకు కేబినెట్లో చోటు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు. మంత్రి పదవి వచ్చినా, రాకున్నా నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి చేస్తా. – సాక్షి, ఆసిఫాబాద్ -
ఊరికి దారేది..?
సాక్షి, సిర్పూర్(టి): మండలంలోని గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్లు గుంతలమయమైన ప్రతీ రోజు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఊళ్లలోకి వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయా? అన్న పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి.. మండలంలోని ఇటిక్యాలపహాడ్ గ్రామం మండలకేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండగా జ్యోతినగర్ ప్రధాన రహదారి నుంచి రోడ్డు పూర్తిగా ఇసుకతో ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాహనాల రాకపోకలు కొనసాగడంలేదు. మండలంలోని చీలపల్లి గ్రామం మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రోడ్డు మట్టికొట్టుకుపోయి కంకరతేలడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. లోనవెల్లి గ్రామానికి రోడ్డు వసతి ఉన్నప్పటికీ బీటీరోడ్డు పూర్తిగా కంకరతేలింది. సిర్పూర్(టి)–కౌటాల ప్రధాన రహదారి వెంబడి కర్జపల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. అదేవిధంగా డోర్పల్లి గ్రామానికి వెళ్లే 4 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. గుంతలు, మట్టి, ఇసుక రోడ్లతో ప్రతీ రోజు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం మరమ్మతు చర్యలు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట అత్యవసర సమయాల్లో గ్రామాల నుంచి మండలకేంద్రానికి, పట్టణాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వసతి లేని గ్రామాలకు రోడ్డు వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తరుచూ వాహనాల మరమ్మతులు... మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉండటంతో వాహనాలు తరుచూ మరమ్మతులు చేయించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి వెళ్లే రహదారిలో మూడు వాగులు ఉండటంతో వాహనాల్లో ప్రయాణికులను వాహనాల నుంచి దింపి వాగులు దాటిస్తున్నారు. వాగుల్లో వాహనాలు కూరుకుపోవడంతో తరచూ వాహనాలు పాడవుతున్నాయని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. ఇబ్బందులకు గురవుతున్నాం లోనవెల్లి క్రాస్‌రోడ్డు నుంచి లోనవెల్లి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి కంకరతేలింది. మండలంలోని చీలపల్లి, ఇటిక్యాలపహాడ్, డోర్పల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులు రోడ్డు వసతి కల్పించాలి. – ప్రసాద్, లోనవెల్లి అధికారులు స్పందించాలి మండలంలోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారులు గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్లుగా రోడ్డు వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. – సురేశ్, సిర్పూర్(టి) -
తొలి నియోజకవర్గం తొలి గ్రామం తొలి ఓటరు
కాగజ్‌నగర్(సిర్పూర్) : సిర్పూర్.. మారుమూల నియోజకవర్గం. కానీ, ఓటరు జాబితా, ఎన్నికల ప్రక్రియలో మాత్రం ఈ నియోజకవర్గం ముందు వరుసలో నిలుస్తోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ప్రతి సెగ్మెంట్‌కు ఒక వరుస సంఖ్య ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సిర్పూర్ నియోజకవర్గం వరుస సంఖ్య 246. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇది తెలంగాణలోని నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక, ఈ నియోజకవర్గంలోని మాలిని గ్రామంలో తొలి పోలింగ్ స్టేషన్ ఉంది. ఇదే గ్రామానికి చెందిన కినాక సుమనబాయి.. తెలంగాణ రాష్ట్ర ఓటరు జాబితాలో తొలి ఓటరుగా గుర్తింపు పొందారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన సుందరబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా ఉండేవారు. ఆమె మరణానంతరం సుమనబాయి తొలి ఓటరయ్యారు. ఎన్నికల లెక్కల్లో ముందు వరుసలో ఉన్న మాలిని గ్రామం.. అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలోనే ఉండిపోయింది. ఈ గ్రామ జనాభా 600. ఓటర్లు 460 మంది. మండల కేంద్రం కాగజ్‌నగర్‌కు ఈ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘ప్రతి ఎన్నికల్లోనూ నిస్వార్థంగా ఓటు వినియోగించుకుంటున్నా. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి ఆ రోజు తప్పకుండా ఓటు వేస్తుంటాను’ అని తొలి ఓటరు సుమనబాయి అంటున్నారు. -
సిర్పూర్ మిల్లు.. మళ్లీ మొదలు
సాక్షి, హైదరాబాద్/ఆసిఫాబాద్ : సిర్పూర్ పేపర్ మిల్లుకు మంచిరోజులొచ్చాయి. నాలుగేళ్ల కిందట మూతబడిన ఆ మిల్లు మళ్లీ తెరుచుకోనుంది. మిల్లు స్వాధీనానికి ప్రముఖ పేపర్ కంపెనీ జేకే పేపర్ లిమిటెడ్ సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జ్యుడీషియల్ సభ్యుడు బిక్కి రవీంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ‘స్వాధీన ప్రక్రియ కొలిక్కి రావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాయితీ నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయి. పెద్ద సంఖ్యలో రాయితీలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జేకే పేపర్ లిమిటెడ్ ముందుకొచ్చింది’ అని ఉత్తర్వుల్లో రవీంద్రబాబు ప్రస్తావించారు. మిల్లు పునఃప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతాయని చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగానే కాగజ్‌నగర్‌లో కార్మికులు ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిల్లు గేటు ఎదుట బాణసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నిజాం ఉస్మాన్ కాలంలో.. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 1936లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఏర్పాటైంది. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. మొదట కొత్తపేట్గా ఉన్న ఆ ఊరి పేరు మిల్లు ఏర్పాటుతో కాగజ్‌నగర్‌గా మారింది. వేలాది మందికి ఆ మిల్లు జీవనాధారమైంది. ఆ తరువాత మిల్లు బిర్లా కుటుంబం చేతికి, అటు నుంచి పొద్దార్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ముడిసరుకు ధరలు పెరగడం, తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం, నిర్వహణ లోపాలతో 2014లో మిల్లు మూతబడింది. ఆనాటికి మిల్లును ఆర్.కె.పొద్దార్ నిర్వహిస్తున్నారు. ఎన్సీఎల్టీలో పిటిషన్ మూతబడే నాటికి కంపెనీ యాజమాన్యం వద్ద 49.91 శాతం, ప్రజల వద్ద 50.09 శాతం ఈక్విటీ వాటాలున్నాయి. రుణదాతలతో పాటు కార్మికులు, ఉద్యోగుల వేతనాలు తదితరాలకు రూ.673.59 కోట్లను చెల్లించాల్సి ఉంది. 2004, 2008 మధ్య మిల్లు యాజమాన్యం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో లీడ్ బ్యాంక్ ఐడీబీఐ 2016 అక్టోబర్ 12న మిల్లు ఆస్తులు స్వాధీనం చేసుకుంది. మిల్లు నుంచి తమకు రూ.51.86 లక్షల రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని కంపెనీ చెల్లించే పరిస్థితిలో లేనందున దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ రమా రోడ్‌లైన్స్, మరికొందరు ఎన్సీఎల్టీలో గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్.. గతేడాది దివాలా పరిష్కార నిపుణుడిని నియమించింది. పేపర్ మిల్లు భూములు, భవనాలు, నివాస గృహాలు, ప్లాంటు, యంత్రాల విలువను రూ.338.52 కోట్లుగా చేర్చారు. ప్రణాళికకు 80.66 శాతం ఓట్లు మిల్లు స్వాధీనానికి గుజరాత్‌కు చెందిన జేకే పేపర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రుణ పరిష్కార ప్రణాళిక సమర్పించింది. ఆ ప్రణాళికకు ఆమోదముద్ర వేసేందుకు రుణదాతలైన బ్యాంకర్లు ఓటింగ్ నిర్వహించగా ఆమోదిస్తూ 80.66 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో జేకే ప్రణాళికను ఆమోదిస్తూ రుణదాతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే మిల్లును స్వాధీనం చేసుకునేందుకు తమకు కొన్ని రాయితీలివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జేకే పేపర్ లిమిటెడ్ కోరింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రాయితీలిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇక దివాలా పరిష్కార నిపుణుడు తన న్యాయవాది వీకే సాజిత్ ద్వారా మొత్తం వివరాలతో కూడిన నివేదికను ఎన్సీఎల్టీకి సమర్పించారు. రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలపడం, ఐబీసీ సెక్షన్ 29ఎ ప్రకారం జేకే పేపర్ లిమిటెడ్‌కు అనర్హత వర్తించకపోవడంతో ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రాయితీలివే.. పదేళ్ల పాటు ఎస్జీఎస్టీ, 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు. రూ.50 కోట్ల లోపు 20 శాతం పెట్టుబడి రాయితీ. పదేళ్ల పాటు డీబార్కడ్ యూక, సుబాబుల్ సరఫరాపై రాయితీ. బొగ్గు రిజర్వు చేయడంతో పాటు పదేళ్ల పాటు సరఫరా చేస్తూ టన్నుకు రూ. 1,000 రాయితీ. కొత్త పెట్టుబడులపై 5 ఏళ్లు 2 శాతం వడ్డీ రాయితీ. 2 నెలల్లో అన్ని లైసెన్సులకు అనుమతులు. పదేళ్లు విద్యుత్ చార్జీల మినహాయింపు. కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల బకాయిల చెల్లింపును సర్కారే తీసుకుంది. కేటీఆర్‌కు కృతజ్ఞతలు మిల్లు పునరుద్ధరణకు కృషి చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. మిల్లు పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొన్ని కంపెనీలతో చర్చలు జరిపామని తెలిపారు. వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ ప్రారంభమవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. -
పాఠశాలల సామగ్రి ఏమైంది?
బెజ్జూర్(సిర్పూర్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పాఠశాలకు ఏటా రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో పాఠశాలలో రికార్డులు భద్రపర్చేందుకు బీరువా, మూడు కుర్చీలు, చాక్‌పీస్, వాటర్‌ఫిల్టర్, తదితర సామగ్రిని కొనుగొలు చేయాల్సి ఉంటుంది. కాని సామగ్రి కొనకుండా ఈ నిధులను గతేడాది మార్చిలోనే డ్రా చేసినట్లు సమాచారం. పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సామగ్రి లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలో 49 పాఠశాలకు సంబంధించి రూ.4.90 లక్షలు మంజూరు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు కలిసి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. నిధులు డ్రా అయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో అప్పట్లో దీనిపై ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు పాఠశాలలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు కొంత నాసిరకం సామగ్రి కొనుగోలు చేసి ఎమ్మార్సీ కార్యాలయంలో భద్రపర్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జిల్లా అధికారులను ఎంఈవో రమేశ్ ముందుగానే కలిసి మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు సైతం నామమాత్రంగా విచారణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. 46 పాఠశాలల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 22 పాఠశాలల రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. 50 పాఠశాలలకుగాను కేవలం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా, నలుగురు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే అన్ని పాఠశాలలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సల్గుపల్లి పాఠశాల హెచ్ఎం తిరుపతికి19 పాఠశాలలకు, బారెగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవికి 18, పెంచికల్‌పేట ఉర్దూ పాఠశాల హెచ్ఎంకు 12, కొండపల్లి పాఠశాల హెచ్ఎం 7 పాఠశాలలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వీరు సామగ్రి కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధి నిధులను డ్రా చేసిన ప్రధానోపాధ్యాయులు ఇంతవరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. దీంతో సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన నిధులు ఏమాయ్యయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై సలుగుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిని సంప్రందించగా బెజ్జూర్ ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నిధులు డ్రా చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో డ్రా చేసి ఎంఈవోకే ఇచ్చామని తెలిపారు . బెజ్జూర్ ఎంఈవో రమేశ్‌బాబును సంప్రదించగా వారం రోజుల్లో పాఠశాలలకు సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. సామగ్రి సరఫరా చేయని పక్షంలో నిధులను యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
దహెగాం(సిర్పూర్) : పెళ్లి అయి 15 సంవత్సరాలు అయినా సంతానం కావడం లేదని భర్త తో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెసరికుంట గ్రామంలో చోటు చేసుకుం ది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన దుర్గాదేవి(32), దహెగాం మండలం లక్కం కుమార్‌తో 2003లో వివాహామైంది. దుర్గాదేవికి సంతానం కలగకపోవడంతో భర్త మరో పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు. దీంతో గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి దుర్గాదేవి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి తమ్ముడు మేకల లచ్చన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు.